ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఎంత ప్రయత్నించినా.. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే!’ అన్న చందంగా తయారవుతుంది. రోజంతా కష్టపడి క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చినా.. తెల్లారేసరికి మళ్లీ మొదటికే వస్తుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఇల్లు ఇట్టే శుభ్రమై పోతుందని నిపుణులు అంటున్నారు.
కిటికీ అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్‌ను ఎంత శుభ్రం చేసినా.. మబ్బు పట్టినట్టే కనిపిస్తుంటాయి. వీటిని కాఫీ వడబోసే ఫిల్టర్ క్లాత్తోకానీ, ఫిల్టర్ పేపర్‌తో కానీ శుభ్రం చేస్తే.. తళతళా మెరిసిపోతాయి.
చెక్క ఫర్నిచర్‌పై నీటి మరకలు వదలగొట్టడం చాలా కష్టం. మొదట్లో శుభ్రపడినట్టే అనిపించినా.. కాసేపయ్యాక అక్కడక్కడా తెల్లగా పేరుకుపోయి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఈ మరకలను పోగొట్టడంలో ఆలివ్ నూనె సమర్థంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనెలో కొద్దిగా ఉప్పు కలిపి.. పేస్ట్‌గా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకలు ఉన్న చోట అప్లయి చేయాలి. గంట తర్వాత పొడి వస్త్రంతో తుడిచేస్తే.. నీటి మరకలు మాయమై పోతాయి.
దుస్తులపై నూనె పడితే.. ఆ మరకలు ఓ పట్టాన వదలవు. బేబీ పౌడర్, డిష్ సోప్ మిశ్రమంతో.. వాటిని ఈజీగా తొలగించొచ్చు. బేబీ పౌడర్ – డిష్ సోప్‌ను సమపాళ్లలో తీసుకొని.. పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకల మీద కొద్దిగా అప్లయి చేసి.. కాసేపయ్యాక బాగా రుద్ది ఉతికేస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
గాజు పాత్రలు, గ్లాసులు పగిలి పోయినప్పుడు.. కంటికి కనిపించని ముక్కలు నేలపైనే ఉండిపోతాయి. కాలికి గుచ్చుకొని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బ్రెడ్ స్లయిస్తో గ్లాసు పగిలిన ప్రదేశంలో నేలపై అద్దాలి. దాంతో చిన్నచిన్న గాజు ముక్కలు కూడా బ్రెడ్‌కు అతుక్కుపోతాయి.
పిల్లలు ఉన్న ఇంట్లో దుస్తులు, రగ్గులు, ఫర్నిచర్.. అన్నిటిమీదా మార్కర్ మరకలు పడుతుంటాయి. ఇలాంటి మార్కర్ మరకలపై కాస్త సన్‌స్క్రీన్ లోషన్ అప్లయి చేసి.. అరగంట తర్వాత పొడిబట్టతో తుడిచేస్తే సరిపోతుంది.
మైక్రోవేవ్ ఓవెన్‌ను శుభ్రం చేయడం ఓ పెద్ద పని. అందులో పడిపోయే ఆహార పదార్థాల అవశేషాలతో.. లోపలి భాగమంతా జిడ్డుగా తయారవుతుంది. ఒక గిన్నెలో నిమ్మకాయ ముక్కల్ని వేసి.. ఓవెన్లో పెట్టేయాలి. అధిక టెంపరేచర్లో ఐదు నిమిషాలు ఉంచేయాలి. దీనివల్ల నిమ్మకాయలోని ఆమ్లత్వం.. ఓవెన్లోని జిడ్డుదనాన్ని కరిగిస్తుంది. ఆ తర్వాత ఒక తడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
కిచెన్ సింక్, వాష్బేసిన్పై మరకల్ని టూత్‌పేస్ట్ సాయంతో శుభ్రం చేయవచ్చు. మొండి మరకలపై టూత్‌పేస్ట్ రాసి.. అరగంట తర్వాత స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే.. మరకలు సులభంగా వదిలిపోతాయి.