నిన్న మొన్నటి తరాలు.. పిల్లల్ని కఠినమైన క్రమశిక్షణతో పెంచారు. అలాంటి పెంపకంలో పెరిగిన వాళ్లు.. తమ బిడ్డల్ని అతిగారాబం చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత తరానికి ఈ రెండు రకాల పెంపకాలూ అంతమంచిది కాదని నిపుణులు అంటున్నారు. చిన్నారులను మరీ కఠినంగానూ, అతి గారాబంగానూ పెంచకూడదని చెబుతున్నారు. ఈ రెండిటికీ మధ్యస్థంగా ఉండే.. ‘జెంటిల్ పేరెంటింగ్’ మంచిదని సలహా ఇస్తున్నారు.
జెంటిల్ పేరెంటింగ్‌లో కఠిన శిక్షలు, అతి గారాబాలు ఉండవు. పిల్లల పట్ల ప్రేమ, గౌరవం మాత్రమే ఉంటాయి. అదే సమయంలో వారికంటూ స్పష్టమైన, స్థిరమైన సరిహద్దులు ఉంటాయి. శిక్షించడం, నియంత్రించడం కన్నా.. వారికి బోధించడం, మార్గనిర్దేశనం చేయడమే ఇందులో కీలకం. పిల్లల్ని నమ్మకంగా, స్వతంత్రంగా, సంతోషంగా పెంచడమే.. జెంటిల్ పేరెంటింగ్ లక్ష్యం. పిల్లలను అర్థం చేసుకోవడం, వారి భావాలను గౌరవించడం, సమస్యల పరిష్కారంలో వారికి సహకారం అందించడం.. ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి పెంపకంలో తల్లిదండ్రులు-పిల్లలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇవే కాకుండా.. జెంటిల్ పేరెంటింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ తరహా పేరెంటింగ్ ఇంట్లో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు.. భావోద్వేగాలను నిర్వహించడంలో చాలా మెరుగ్గా తయారవుతారు. తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటిస్తారు. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకుంటారు.
ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల మాటలను కచ్చితంగా పాటిస్తారు. పిల్లలు తమ మాట వింటున్నారని, వాటికి విలువ ఇస్తున్నారని తల్లిదండ్రులు గుర్తిస్తే.. వారు మరింత నమ్మకంగా మాట్లాడతారు. పిల్లలు కూడా.. పేరెంట్స్ తమకు రెస్పెక్ట్ ఇస్తున్నారని గుర్తిస్తే, తల్లిదండ్రుల్ని మరింతగా అర్థం చేసుకుంటారు. అందుకు తగినట్టుగా మసులుకుంటారు.
పిల్లలకు ఏదైనా సమస్య ఎదురైతే.. వాళ్లే పరిష్కరించుకోవాలని అనుకోవద్దు. అలాగని.. తల్లిదండ్రులు ఆ సమస్యను తమ భుజానికెత్తుకోవాల్సిన పనిలేదు. ఆయా సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి పిల్లలతో కలిసి పనిచేయాలి. వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. అప్పుడే, భవిష్యత్తులో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో.. నేర్చుకోగలుగుతారు.