‘ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. మట్టిని మట్టిని నేను.. నన్ను తొక్కితే ఇటుకౌతాను!’.. శేషాచలం అడ్డాలో పుష్ప ఆడి, పాడిన పాట.. అల్లు అర్జున్‌కు సరిగ్గా నప్పుతుంది. ఎడమ భుజం పైకెత్తి.. సినిమా భారమంతా కుడిభుజంపై మోశాడు. ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టడమే కాదు.. వరల్డ్ వైడ్‌గా వైరల్ అయ్యాడు. ఎంతలా అంటే.. దశాబ్దాలుగా మహామహా తెలుగు నటులకు అందని ద్రాక్షలా ఊరించిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. అభిమానుల ప్రశంసల బిజీలో ఉంటూనే అల్లు అర్జున్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇలా పంచుకున్నాడు…
జాతీయ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్ అండి! ఈ శుభవార్తను మీకు మొదట చెప్పింది ఎవరు? ఆ క్షణంలో మీ భావోద్వేగాలు మాతో పంచుకుంటారా..
జాతీయ అవార్డుల కోసం ‘పుష్ప’ తరఫున మేము చాలా నామినేషన్స్ పంపించాం. ఏదో ఒక విభాగంలో తప్పకుండా అవార్డు దక్కుతుందనే నమ్మకం ఉండేది. దాంతో అవార్డుల ప్రకటన రోజున నేనూ, మా దర్శకుడు సుకుమార్, నిర్మాతలు.. అందరం ఒకేచోట కలుసుకొని అవార్డ్స్ అనౌన్స్మెంట్ న్యూస్ చూస్తూ కూర్చున్నాం. ‘పుష్ప’ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయని తెలియగానే మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమ్ అంతా కొన్ని గంటలపాటు అదే జోష్‌లో ఉండిపోయాం.
అవార్డుల ప్రకటనకు కొన్ని గంటల ముందే ‘జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్’ అంటూ సోషల్‌మీడియాలో మీ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానుల్లానే మీరు కూడా ఇది ముందే ఊహించారా?
ఉత్తమ నటుడు కేటగిరీకి సంబంధించిన నామినేషన్స్‌లో ‘పుష్ప’ తప్పకుండా ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందని నమ్మాం. ఎందుకంటే 2021లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగానే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా కూడా ‘పుష్ప’ ఓ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. మరోవైపు స్మగ్లింగ్ నేపథ్య కథాంశం కావడంతో, అవార్డు ఎంపికలో అదొక ప్రతిబంధకంగా మారుతుందనే సందేహాలు కూడా వచ్చాయి.
దశాబ్దాల తెలుగు సినిమా ప్రస్థానంలో.. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో మీరు సరికొత్త చరిత్రను సృష్టించారు. ఎందరో దిగ్గజ నటీనటులకు సాధ్యంకాని ఘనతను సాధించడం ఎలా అనిపిస్తున్నది?
నిజంగా మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి ఇది. ఈ అవార్డు వచ్చినంత మాత్రాన నేను మిగతా నటుల కన్నా గొప్పవాడినని అనుకోవడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో హేమాహేమీలైన నటులు ఎందరో ఉన్నారు. వారికి ఎందుకు ఈ అవార్డు రాలేదు? అప్పటి పరిస్థితులు ఏమిటి? అనే విషయాల మీద నాకు అంతగా అవగాహన లేదు. ‘తెలుగువారికి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది కదా!’ అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవార్డు ప్రకటించినప్పుడు కూడా ‘బహుశా తెలుగులో ఈ పురస్కారం గెలుచుకున్న మూడోవాడినేమో’ అనే అభిప్రాయంతో ఉన్నా. ‘ఫస్ట్ యాక్టర్ నువ్వే’ అని అందరూ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను.
ఇంతకీ షూటింగ్ టైమ్‌లో పుష్పరాజ్ పాత్రకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనీ, అవార్డులు వరిస్తాయని ఎప్పుడైనా అనిపించిందా?
సుకుమార్ డిజైన్ చేసిన పుష్పరాజ్ పాత్రలో ఓ మ్యాజిక్ కనిపించింది. కమర్షియాలిటీతోపాటు పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని అప్పుడే అంచనా వేశా. పుష్పరాజ్ పాత్రకు రెండు వైపులా పదును ఉందనిపించింది. బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఆ పాత్ర ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది అనుకున్నా.
అభిమానులు మిమ్మల్ని ైస్టెలిష్స్టార్ అని పిలుస్తుంటారు? అలాంటి మీరు పుష్పరాజ్ వంటి రా అండ్ రగ్డ్ క్యారెక్టర్‌ను ఎలా అడాప్ట్ చేసుకున్నారు? మీది కాని దారిలో ప్రయాణం చేస్తున్నారని ఎప్పుడూ అనుకోలేదా?
నాది కాని దారిలో ప్రయాణం చేయాలన్నదే నా కోరిక. అందుకే పుష్ప పాత్రను ఆసాంతం ఆస్వాదించాను. పాత్రలో పూర్తిగా లీనమయ్యాను. ఒక పాత్ర విషయంలో మనం ఎంత బరువు ఎత్తుకుంటే అంత పేరొస్తుంది. పుష్పరాజ్ విషయంలో అదే నిజమైంది.
జాతీయ ఉత్తమ నటుడి కేటగిరిలో మీతోపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా రేసులో ఉండటం ఏమైనా ఒత్తిడిగా ఫీలయ్యారా?
అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఈ కేటగిరీలో జాతీయస్థాయిలో 20కి పైగా నామినేషన్స్ వచ్చాయి. దక్షిణాది నుంచే కాకుండా హిందీ నుంచి కూడా నలుగురు గట్టిగా పోటీలో నిలిచారు. ఈ అవార్డు విషయంలో నేను లోకల్ కంటే ఓవరాల్ నేషనల్ కాంపిటీషన్ గురించే ఆలోచించాను.
పుష్పరాజ్ లాంటి ఓ స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించడం ఏంటని కొందరు విమర్శించారు కదా! మీ స్పందన..
ఆస్కార్ అవార్డ్స్‌లో కూడా నటుడి తాలూకు పర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకుంటారు! అంతేకానీ.. పాత్ర స్వభావం, కథా నేపథ్యం లాంటి విషయాల గురించి ఆలోచించరు. అందుకే బ్యాట్‌మెన్ వంటి నెగెటివ్ క్యారెక్టర్ కూడా ఆస్కార్ గెలుచుకుంది. అమితాబ్బచ్చన్గారు జంజీర్, అగ్నిపథ్ చిత్రాల్లో డాన్ పాత్రల్ని పోషించినా.. ఆయన నటనకు మెచ్చి ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేశారు. ‘పుష్ప’ విషయంలో కూడా ఇవే విషయాలను కన్సిడర్ చేశారని భావిస్తున్నా.
అవార్డు గెలుచుకున్న ఆనందాన్ని మీ భార్య స్నేహారెడ్డితో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
తనది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కాబట్టి ఫిల్మ్స్ గురించి ఎక్కువగా పట్టించుకోదు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి అస్సలు ఆలోచించదు. నా సినిమాలతో తన వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టి చూసుకోదు. అంతకుముందు పెద్ద హిట్ పడితే హ్యాపీగా ఫీలయ్యేది. కానీ, ఎమోషన్‌గా ఫీలైన సందర్భాలు మాత్రం ఎప్పుడూ లేవు. ఈ అవార్డు విషయంలో మాత్రం స్నేహ భావోద్వేగానికి గురైంది. నన్ను హత్తుకొని ఆనందబాష్పాలు రాల్చింది.
సంబురాల్లో మీ పిల్లలు అయాన్, అర్హ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అవార్డు గురించి వాళ్లకు మీరు ఏం చెప్పారు?
అందరికంటే ఎక్కువగా అయాన్ హ్యాపీగా ఫీలయ్యాడు. వాడికి అవార్డు గురించి తెలుసు. అర్హ ది చిన్న వయసు కాబట్టి ఏం తెలియదు. డాడీ ఏదో గొప్ప పని చేశాడని సంతోషంలో ఉంది (నవ్వుతూ..).
అర్హ ‘శాకుంతలం’ చిత్రంలో నటించింది. కుమారుడు అయాన్‌ను మీ సినిమాల ద్వారా బాలనటుడిగా పరిచయం చేసే ఆలోచన ఏమైనా ఉందా?
ఈ విషయంలో నా నిర్ణయం ఏమీ ఉండదు. తనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆలోచిస్తా. పిల్లలు వారి ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఓ తండ్రిగా వారికి అండగా ఉండటమే నా బాధ్యత అనుకుంటా.
తెలుగు ఇండస్ట్రీ ఈ ఏడాది 11 అవార్డులను గెలుచుకుంది. అలాగే ఆస్కార్ సాధించి సత్తా చాటింది. సమకాలీన భారతీయ సినిమాలో తెలుగు సినిమా వైభవాన్ని చూస్తే మీకేమనిపిస్తున్నది?
‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం చాలా సంతోషంగా అనిపించింది. గ్లోబల్‌గా సత్తా చాటిన సినిమా కాబట్టి జాతీయ అవార్డుల్లో కూడా జ్యూరీ పెద్దపీట వేసింది. ప్రస్తుతం దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నది. ఇతర భాషలతో పోల్చితే టాలీవుడ్ ప్రతీ విషయంలో ముందంజలో ఉంది.
హిందీ బెల్ట్‌లో ‘పుష్ప’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. మీరు ఉత్తరాదిలో వివిధ నగరాల్లో ప్రమోషన్స్‌కు వెళ్లారు. మన సినిమా మీద వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
ఉత్తరాది గ్రామీణ ప్రేక్షకులు కమర్షియల్ సినిమాను బాగా ఇష్టపడుతుంటారు. అన్నిటికన్నా కమర్షియల్ సినిమానే గొప్పదనే భావనతో ఉంటారు. ఈ రోజు తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగిందంటే అందులో ఉత్తరాది ప్రేక్షకుల కంట్రిబ్యూషన్ ఉందనే విషయాన్ని అంగీకరించాలి.
భవిష్యత్తులో హిందీ స్ట్రెయిట్ సినిమా చేసే ఆలోచన ఉందా?
మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు భారతీయ సినిమా సమీకరణాలు మారిపోతున్నాయి. అన్ని భాషల నటీనటులు, టెక్నీషియన్స్ కలవడం వల్ల నాణ్యతతో కూడిన గొప్ప సినిమాలు వస్తున్నాయి. భవిష్యత్తులో హిందీ దర్శకుడితో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచన ఉంది.
ఇంతకీ మా ‘పుష్ప-2’ ఎలా ఉండబోతున్నది. కథలో ఎలాంటి కొత్త అంశాలను జోడించారు? ‘ఆర్ఆర్ఆర్’ తరహాలో ఆస్కార్ బరిలో దించేందుకు ఏమైనా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారా?
‘పుష్ప-2’ సూపర్‌గా వస్తున్నది. అస్సలు తగ్గేదేలే (నవ్వుతూ). ఆస్కార్ క్యాంపెయిన్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఆ చిత్రాన్ని ఆల్ ఇండియాలో ఏ స్థాయికి తీసుకెళ్లాలనే అంశం మీదనే దృష్టిపెట్టాం. ఆ సినిమా గ్లోబల్ రీచ్ గురించి ప్రస్తుతానికైతే ఆలోచన లేదు.
మీ ఆధ్యాత్మిక ఆలోచనలెలా ఉంటాయి? దేవుడిని నమ్ముతారా?
నేను దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా వెళ్లను. దేవుడి విషయంలో నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ విశ్వంలో మనల్ని నడిపించే శక్తి ఏదో ఉందని మాత్రం బలంగా నమ్ముతాను.
‘చిరు’ కాంప్లిమెంట్
అవార్డు వచ్చాక చిరంజీవిగారిని కలిశాను. నన్ను చూసి చాలా గర్వంగా ఫీలయ్యారు. ‘నువ్వు పడిన శ్రమకు నీకు అవార్డు రాకపోతే తప్పయ్యేది. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశావు. పాత్రపరంగా మేకోవర్తోపాటు డైలాగ్స్, డిక్షన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నావు. కష్టమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశావు. ఓ కమర్షియల్ సినిమాలో ఇంతటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. పుష్పరాజ్ పాత్ర తాలూకు ప్రతీ అంశంలో నువ్వు ది బెస్ట్ అనిపించావు’ అని చిరంజీవిగారు మెచ్చుకున్నారు.
ఇక చాలు అనుకోను…
ఈ ఇరవై ఏండ్ల ప్రయాణంలో ఓ నటుడిగా నేను ఎంచుకునే కథలు, పోషించిన పాత్రలు, డ్యాన్స్‌లు, ఫైట్స్.. వీటన్నిటికన్నా ప్రేక్షకులు నాలోని పాటిజివ్ ఆటిట్యూడ్‌ను బాగా ఇష్టపడ్డారు. ప్రతి సినిమాలో పరిణతి చెందిన నటుడిగా కనిపించడం, కమర్షియల్ పంథాలోనే కొత్త కథల్ని ఎంచుకోవడం, నా జర్నీలోని ఓ రైజ్… ఈ లక్షణాలన్నీ ప్రేక్షకులకు నాపై ఇష్టాన్ని పెంచాయనుకుంటున్నా. కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా నేను బెటర్మెంట్ కోసం నిత్యం ప్రయత్నిస్తుంటా. ‘ఇక ఇది చాలు’ అనుకొని ఏ రోజూ సంతృప్తి చెందను. ఇంకా ఏదో సాధించాలి.. అనే ఆశావాహ దృక్పథంతో ప్రయాణాన్ని సాగిస్తుంటా. ఎంతబాగా నటించినా ఇంకా కొత్తగా ప్రయత్నించాలనే తపనతో ముందుకుసాగుతా.
మరింత ఉత్సాహం..
ఈ అవార్డు రాకపోయినా నా ఆలోచనా దృక్పథంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. ఎప్పుడూ ది బెస్ట్ ఇవ్వాలన్నదే నా ఫిలాసఫీ. అవార్డు వచ్చింది కాబట్టి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కనబరచాలనే తపన పెరిగింది. మరింత ఉత్సాహంతో పనిలో ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నా. అంతేకానీ, అవార్డు తాలూకు ఒత్తిడి నాపై ఏమాత్రం లేదు. కెరీర్లో ఓ స్థాయిని దాటుకొని ప్రయాణం చేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకారు.
-కళాధర్ రావు జూలపల్లి