e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిందగీ జీవితం చాలా ఇచ్చింది!

జీవితం చాలా ఇచ్చింది!

జీవితం చాలా ఇచ్చింది!

చదివింది ఇంటరే అయినా, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో మహానగరానికొచ్చింది. ఒంటరి తల్లికి, తోడబుట్టిన తమ్ముడికి అండగా నిలిచింది. దొరికిన పని చేసుకుంటూ మొండి ధైర్యంతో ముందుకు సాగింది.. సినిమా, టెలివిజన్‌ నటి రోజా భారతి. కుటుంబ పోషణకోసం మొదలైన తన నట ప్రయాణం గురించీ, జీవితం ఇచ్చిన కానుకల గురించీ రోజా ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
కుటుంబ బాధ్యతలు తీసుకోవాలంటే కొడుకే కావాలని లేదు. కూతురైనా కన్నవాళ్లకోసం వెనుకడుగు వేయదు. మాది రాజమండ్రి. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. రాజోలులో ఇంటర్‌ చేశా. తర్వాత చదివే పరిస్థితులు లేవు. అందుకే, అమ్మనూ తమ్ముడినీ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశా. ఈ మహానగరంలో తెలిసిన వాళ్లెవరూ లేరు. హిందీ రాదు. అయినా మొండి ధైర్యంతో ముందడుగు వేశా. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ తమ్ముడిని చదివించాలని నిర్ణయించుకున్నా.
చర్మాస్‌ టు సీ చానల్‌
మొదట చర్మాస్‌ షోరూమ్‌లో చిన్న ఉద్యోగంలో చేరా. జీతం నెలకు పదిహేను వందలు. సంవత్సరం అయ్యాక మూడువేలకు పెరిగింది. అప్పుడే జీడిమెట్లలోని ‘సీ
చానల్‌’లో రిసెప్షనిస్ట్‌ కావాలని ఓ టీవి ప్రకటన చూశా. కానీ, అర్హత డిగ్రీ అని ఇచ్చారు. నేను చదివింది ఇంటరే. అయినా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఇంటర్వ్యూకి వెళ్లా. అనుకోకుండా ఉద్యోగం దొరికింది. మంచి జీతం, అంతకుముందు చేస్తున్న ఉద్యోగంతో పోలిస్తే శ్రమ తక్కువ. తమ్ముడిని చదివించేందుకు, అమ్మను చూసుకునేందుకు ఓ మంచి దారిలా తోచింది. చేరిన కొన్నాళ్లకే యాజమాన్యం, తోటి ఉద్యోగుల ప్రోత్సాహంతో డేటా ఎంట్రీ, యాంకరింగ్‌ నేర్చుకున్నా. అదే చానల్‌లో ఓ లైవ్‌ ప్రోగామ్‌ యాంకర్‌ సమయానికి రాకపోయేసరికి నేనే యాంకర్‌గా చేశా. అలాగే, అనుకోకుండా ఒకరోజు ఓ ప్రముఖ వీక్లీలో వచ్చే ఫ్యాషన్‌ పేజీ ఫొటోషూట్‌కి వెళ్లా. ఆ రోజు వచ్చిన మోడల్‌ సెట్‌ కాలేదు. దీంతో నన్ను పెట్టి ఫొటోషూట్‌ చేశారు. 2008 క్రిస్మస్‌ స్పెషల్‌గా ప్రచురితమైన ఆ పేజీని చూసి ‘మొగలి రేకులు’ దర్శకురాలు మంజులా నాయుడు, బిందునాయుడు నాకు ఫోన్‌ చేశారు. నటనంటే తెలియని నన్ను నమ్మి, అప్పటికే హిట్‌ సీరియల్‌గా నడుస్తున్న ‘మొగలిరేకులు’లో మంచి పాత్ర ఇచ్చారు. రిసెప్షనిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం కొన్నాళ్లకే యాంకర్‌గా, ఆ తర్వాత నటిగా మారింది.
యాంకర్‌గా చేస్తూనే..
చిన్నప్పటినుంచీ నాకు జ్ఞాపకశక్తి ఎక్కువ. స్కూల్లో టాపర్‌ని. అందుకే నాకు యాంకరింగ్‌ చాలా ఈజీ అయింది. సీ చానల్‌లో మొదటిసారి ‘నీకోసం’ అనే లైవ్‌ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేశా. సీరియల్స్‌ చేస్తున్నప్పుడు కూడా దాదాపు అన్ని చానల్స్‌లో ప్రోగ్రామ్స్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించా. ఈటీవీలో ‘సఖి’తోపాటు జీ తెలుగు, ఏ టీవి, ఆర్‌వీఎస్‌, విస్సా వంటి చానల్స్‌లో యాంకరింగ్‌తోపాటు వంటల కార్యక్రమాలు చేశా. నాకు నటన నేర్పించిన శ్రీకాంత్‌ ప్రొడక్షన్‌లోనే ‘మొగలి
రేకులు’, ‘ప్రేమతీరం’, జెమినీలో ‘గోరింటాకు’, ‘మావిచిగురు’ సీరియళ్లు చేశా. ఈ టీవీలో ‘భార్యామణి’ సీరియల్‌ మిస్సయినా, తర్వాత ‘అత్తారింటికి దారేది’లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ‘అభిషేకం’ చేస్తున్నా. జీ తెలుగు ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌కి మంచి పేరొచ్చింది. ‘పక్కింటమ్మాయి’తో పాటు జీ-5కి ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేశా. ఇప్పటివరకు దాదాపు ఇరవై సీరియల్స్‌లో నటించా. వంశీగారి ‘పసలపూడి కథలు’ నటిగా మంచి గుర్తింపునిచ్చింది. దాదాపు పది సినిమాల్లో నటించా. వాటిలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో అలీగారి వైఫ్‌ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు లభించింది. ‘ఆహా’ వేదికగా విడుదలకానున్న ‘అర్ధ శతాబ్దం’ సినిమాలోనూ మంచి పాత్రే నాది.

జీవితం చాలా ఇచ్చింది!


అన్నీ వాళ్లే
ఏం తెలియకుండానే మొండిగా మొదలు పెట్టిన నా ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. ఎలా బతకాలో నేర్పింది. నన్ను నన్నుగా ఇష్టపడే ఓ మంచి వ్యక్తిని భర్తగా ఇచ్చింది. తన పేరు ఖిజర్‌ యాఫై. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తను ముస్లిం అయినా నా పద్ధతులను గౌరవిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. ఆదిల్‌, ఆహిల్‌. తమ్ముడు మహేష్‌ కూడా బాగా చదువుకుంటున్నాడు. ఇంటర్‌లో శ్రీచైతన్య కాలేజీ టాపర్‌. ప్రస్తుతం ఐబీఎస్‌లో డిగ్రీ చదువుతున్నాడు. అమ్మ పోయి నాలుగేండ్లు అవుతున్నది. ఒంటరిగా మొదలైన నా ప్రయాణం చాలామంది స్నేహితులనిచ్చింది. కష్టాలూ కన్నీళ్లే కాదు మనుషులు, వారి మనస్తత్వాలు తెలుసుకుని మసలుకోవాలనే గొప్ప సత్యాన్ని నేర్పింది. కండ్లు, కాళ్లు లేనివాళ్లు కూడా ధైర్యంగా సాగుతుంటే, అన్నీ ఉన్న మనం ఎందుకు భయపడుతూ బతకాలని ఎన్నో ప్రత్యక్ష సంఘటనల ద్వారా తెలుసుకున్నా. నేను పాటలు పాడతాను. వంట బాగా చేస్తా. నేను ఆనందంగా ఉంటూ.. చుట్టూ ఉన్నవాళ్లనూ ఆనందంగా ఉంచాలన్నదే నా అభిమతం.
వాళ్ల కోసం.. ఓ బ్రాండ్‌
ఒకప్పుడు అందం అంటే మొహమే. కానీ ఇప్పుడు శరీరాకృతి ఆధారంగా సౌందర్యాన్ని నిర్ణయిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత మహిళ శరీరంలో చాలా మార్పులొస్తాయి. అది చాలా సహజం. కానీ, లావైన వాళ్లు అందంగా లేరని, ఇక దేనికీ పనికిరారని అనుకోవడం సరైంది కాదు. అంతేకాదు కాస్త లావుగా ఉన్నవాళ్లకి మోడ్రన్‌ డ్రెస్సులు కూడా దొరకవు. కుర్తీలు మాత్రమే ఉంటాయి. నేనూ పిల్లలు పుట్టిన తర్వాత ఇదే సమస్య ఎదుర్కొన్నా. అందుకే, లావుగా ఉండే మహిళల కోసం ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌ని క్రియేట్‌ చేయాలనిఉంది.

Advertisement
జీవితం చాలా ఇచ్చింది!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement