ఈ రోజుల్లో చాలామంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్లలో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. దాంతోపాటు అతి త్వరగా కండలు పెంచాలని రకరకాల ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండలు పెంచుకోవడానికి, ఫిట్నెస్ లక్ష్యాల్ని సాధించడానికి ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు ప్రతి రోజూ 1.2 నుంచి 2 గ్రాముల ప్రొటీన్ మాత్రమే అవసరం. కానీ, అవగాహన లేకపోవడంతో ప్రొటీన్ పౌడర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. సరైన పద్ధతిలో ప్రొటీన్ పౌడర్లను వాడితే ఎలాంటి ముప్పూ ఉండదు. కానీ, మోతాదుకు మించి వాడటం.. నాణ్యత లేని బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రొటీన్లను జీర్ణం చేసి, శరీరానికి అందించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవసరానికి మించి ప్రొటీన్ పౌడర్లను వాడటం, భోజనానికి ప్రత్యామ్నాయంగా మార్చడం, కొన్ని నియంత్రణ లేని పౌడర్లలో అనబాలిక్ స్టెరాయిడ్స్, హానికరమైన మూలికలు ఉండి ఇవి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
అయితే శరీరాకృతికోసం సప్లిమెంట్స్ వాడుతున్న వారిలో ఫ్యాటీ లివర్ ఉన్నవారు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులతో బాధపడేవారు, ఊబకాయం, షుగర్ వంటి ఇతర జబ్బులు నయం కావాలని మందులు వాడుతున్నవారు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాలి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ప్రొటీన్ పౌడర్లను పలు చిట్కాలను పాటిస్తూ వాడటం ఉత్తమం. మీ శరీరానికి రోజుకు ఎంత ప్రొటీన్ కావాలో లెకించి, అంతే తీసుకోండి. ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసుకుని, గుర్తింపు పొందిన కంపెనీల ఉత్పత్తుల్ని మాత్రమే కొనండి. పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, టోఫు, పనీర్, చేపలు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రొటీన్ పొందడానికి ప్రయత్నించండి. ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు రోజుకు శరీర బరువులో ప్రతి కిలోకు 2 గ్రాముల కంటే ఎకువ ప్రొటీన్ తీసుకోకూడదు.