అందరూ ‘అద్భుతం!’ అని మెచ్చుకునే ఫౌండేషన్.. మీకు మాత్రం చికాకు కలిగిస్తున్నదా!? ప్రీమియం ఉత్పత్తులు వాడినా.. ముఖం పాలిపోయినట్లు కనిపిస్తున్నదా!? మేకప్ వేసుకున్నా.. వేసుకోనట్లే ఫీలవుతున్నారా!? అయితే, సమస్య ఆయా ఉత్పత్తుల్లో లేదు. మీరు వాడే బ్రష్‌లు, స్పాంజ్లలోనే ఉన్నది. ముందు వాటిని మారిస్తేనే.. మేకప్‌లో అసలైన మార్పు కనిపిస్తుంది.
మేకప్ వేసుకోవడానికి వాడే బ్రష్‌లు, స్పాంజ్లు కేవలం ఉపకరణాలు మాత్రమే కాదు. అవి మేకప్ ఉత్పత్తుల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. అవి శుభ్రంగా లేకపోతే.. అత్యుత్తమ ఉత్పత్తులు కూడా విఫలమవుతాయి. చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందుకే.. మీరు ఏ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారన్నది కాదు. దానిని ఎలా వాడుతున్నారు? దేనితో కలిపి వాడుతున్నారు? అనేది కూడా ముఖ్యమే.
మేకప్ బ్రష్‌లు, స్పాంజ్లకు సంప్రదాయ ఎక్స్పైరీ డేట్ ఉండదు. అయినా, ఏడాదికి ఒకసారైనా వాటిని మార్చేయాలని బ్యుటీషియన్లు చెబుతున్నారు. లేకుంటే మేకప్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. మేకప్ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే.. మేకప్ అప్లికేషన్, బ్లెండింగ్ నాణ్యతపైనా ప్రభావం చూపుతుంది. కోరుకున్న లుక్‌ను అందించడంలో విఫలం అవుతుంది. రెగ్యులర్‌గా శుభ్రం చేయకపోతే.. వాటిపై హానికర బ్యాక్టీరియా పెరిగిపోతుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో కళ్ల కలక వంటి వైరల్ ఇన్ఫెక్షన్లనూ వ్యాప్తిచేస్తాయి. దురద, చర్మం ఎర్రబడటం వంటి ఇతర చర్మ సమస్యలు కూడా దాడిచేస్తాయి. కాబట్టి, వాటిని రెగ్యులర్‌గా శుభ్రం చేసుకోవాలి. ఉపయోగించిన ప్రతిసారీ.. మేకప్ బ్రష్‌ను శుభ్రమైన టవల్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇక కొందరు మేకప్ బ్రష్‌లను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లెన్సర్లను వాడాలని అనుకుంటారు. అలాంటి అవసరం ఏమీలేదు. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీ షాంపూతో కూడా వాటిని శుభ్రం చేసుకోవచ్చు.