ఎకో ఫ్రెండ్లీ వస్తువుల గురించి అందరికీ తెలుసు కానీ ఎకో ఫ్రెండ్లీ నగలు కూడా వచ్చేశాయి! మనం వాడే వస్తువులే కాదు ధరించే నగలు కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నవే ఈ ఎకో ఫ్రెండ్లీ జువెలరీ. బంగారం, వెండి, ప్లాటినమ్ లాంటి ఖరీదైన లోహాలతో చేసిన నగల్ని ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగినట్లు మార్చడం కష్టం. తరుగు, మజూరీ అంటూ అదనపు ఖర్చు కూడా. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా తక్కువ ధరతో ఎక్కువ నగలు కొనుక్కోవచ్చు. అంతేకాదు, ఓపిక ఉంటే మీరే ఇంట్లో తయారు చేసుకుని అందంగా అలంకరించుకోవచ్చు. ఇంతకీ ఈ ఎకో ఫ్రెండ్లీ నగల విశేషాలేంటో
తెలుసుకుందాం..
మగువలు ధరించే దుస్తుల్లోనే కాదు అలంకరించుకునే నగల్లోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. అటు సంప్రదాయాన్ని, ఇటు ట్రెండ్‌ని అనుసరిస్తూ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు ఆధునిక అతివలు. ఈ క్రమంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎకో ఫ్రెండ్లీ నగలకు మొగ్గు చూపుతున్నారు. నగలంటే బంగారం, వెండితో పాటు ఇతర లోహాలతో తయారుచేస్తారు. కానీ ఇవి మాత్రం వాటన్నిటికన్నా పూర్తి భిన్నం. కాగితం, సిల్క్, ఫ్యాబ్రిక్, మట్టి, జనుము, అరటినార.. ఇలా ఒక్కటేమిటీ ప్రకృతి అందించే ప్రతి వస్తువుతో అందమైన నగలను రూపొందిస్తున్నారు డిజైనర్లు. అందం, ఆహార్యంలోనూ బంగారం వంటి ఖరీదైన నగలతో పోటీపడుతున్న ఈ నగలకి ప్రస్తుతం ఆదరణ బాగా పెరుగుతున్నది.
ఫ్యాబ్రిక్ జువెలరీ నూలు, సిల్క్ వస్ర్తానికి అదనపు హంగులు చేర్చి తయారు చేసేదే ఫ్యాబ్రిక్ జువెలరీ.
పూసలు, రాళ్లను జతచేసి అందంగా మలిచే ఈ నగలు ఎలాంటి దుస్తులకైనా ఇట్టే నప్పుతాయి. వీటిలోనూ పాపిడ బిళ్ల నుంచి కాళ్ల పట్టీల వరకు హారాలు, గాజులు, బ్రేస్లెట్లు, కంఠాభరణాలు, చోకర్లు.. ఇలా అన్నిరకాలు అందుబాటులో ఉన్నాయి.
అరటి, జనపనారతో తయారు చేసిన దుస్తులు, తాళ్లు.. ఇతరత్రా వస్తువుల గురించి మనకు తెలిసిందే! సంప్రదాయ బంగారు పతకాన్ని గొలుసుకట్టుగా ఉండే హారానికి జత చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే అర్థమైపోతుంది. రంగురంగులుగా వేసుకునే దుస్తుల మీదకు, ఈ తరహా జువెలరీ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. విడిగా నార గొలుసులను తీసుకొని వాటికి బంగారం, వన్‌గ్రామ్ గోల్డ్, సిల్వర్‌తో తయారుచేసిన పెండెంట్‌ను జత చేసి అందమైన హారంగా మార్చేస్తున్నారు. వీటిని మనకు నచ్చిన ధరలో చేయించుకునే వెసులుబాటు ఉంది. ఆసక్తి గలవారు వీటికి కావలసిన సామగ్రిని తెచ్చుకుని ఇంట్లోనే ఈ హారాలను తయారు చేసుకోవచ్చు.
కాగితంతో తయారు చేసేవే పేపర్ జువెలరీ. మనం రోజూ చదివే పేపర్‌నే ఒద్దికగా అందమైన పూలు, జంతువుల ఆకారాల్లోనూ మలిచి ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. ఇవి ట్రెడిషనల్ దుస్తులతోపాటు వెస్ట్రన్ వేర్పైనా నప్పుతాయి. ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లేవారు రోజువారీ నగలకింద ధరించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ఈ ఎకో ఫ్రెండ్లీ జువెలరీని ట్రై చేయండి!