సమోసా.. అది మన ఆకలి మాత్రమే తీర్చదు. అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆఫీస్ సమయంలోనైనా, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నప్పుడైనా సమోసాలు కనిపిస్తే లొట్టలేసుకుంటూ తింటాం. కొందరైతే వాటిని భోజనంలాగే లాగిస్తుంటారు. ‘వాటిని తిని మా ఆకలిని చల్లార్చుకుంటామని, మనీ సేవింగ్’ అంటూ కాకమ్మ కథలు చెబుతుంటారు. కానీ, అలాంటి తిండి మన శరీరానికి ఏ మాత్రం మంచిది కాదని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్న వాళ్లం అవుతామని హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా సమోసాలు మానవ గుండెపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయో లెక్కలతో సహా వివరిస్తూ సమాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో ‘మీరు తినే సమోసా ధర రూ. 20 ఉంటుందనుకోండి. దానిని క్రమం తప్పకుండా సంవత్సరానికి 300 సార్లు తింటే, 15 ఏళ్లకు అది కాస్త సుమారు రూ.90 వేల ఖర్చవుతుంది. డబ్బు ఆదా పేరుతో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారం తీసుకుంటున్నాం. కానీ, మన ధమనులు దెబ్బతింటే రూ.3 లక్షలతో యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి వస్తుంది. అంటే మీరు సమోసాలపై పెట్టిన ఖర్చుకు 400 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది’ అంటూ రాసుకొచ్చారు.
ఆదా పేరుతో కల్తీ తిండి వల్ల చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, నూనెలో వేయించిన సమోసా లాంటి చిరుతిండికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్య వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోండి.