ఎంత మొండి క్యాన్సర్‌నైనా సకాలంలో గుర్తించగలిగితే దానిని నియంత్రించి, రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులకు పలురకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునో థెరపీ, హైపర్ థర్మియా, స్టెమ్‌సెల్ థెరపీ, ఫొటోడైనమిక్, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని సామాన్య రోగులకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఇవి మరింతగా వాడుకలోకి వస్తే వీటి ఖరీదు తగ్గుతుంది. చివరి దశ క్యాన్సర్ రోగులకు నొప్పి, ఇతర బాధల నుంచి ఉపశమనం కలిగించేందుకు పాలియేటివ్ కేర్ కూడా అందుబాటులోకి వచ్చింది.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్పెషల్ కేర్ తప్పనిసరి:
గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర వ్యాధులు ఉండి క్యాన్సర్ సోకినవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ మందులు శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్యుల సలహా మేరకు నిర్ణీత సమయంలో అవసరమైన రక్త పరీక్షలు, అవయవాల పనితీరును తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే క్యాన్సర్ చికిత్స వల్ల గుండె, కాలేయం, కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు మరణం సంభవించవచ్చు. అందుకే క్యాన్సర్ చికిత్స కారణంగా ఆరోగ్యవంతమైన కణాలు, ఇతర అవయవాలు దెబ్బతినకుండా ఉండటానికి, దుష్ప్రభావాలు తగ్గించడానికి చికిత్సా విధానాలపై పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం క్యాన్సర్ కణాల మీదనే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీ, వీఎంఏటీ రేడియేషన్ థెరపీ, తక్కువ కోత కలిగిన కీహోల్ సర్జరీ వంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
శస్త్రచికిత్సలో కొత్త మార్పులు:
క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్సది కీలకపాత్ర. రక్త క్యాన్సర్ మినహా ఇతర క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు చేస్తారు. తొలి దశలో క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటే, సర్జరీతోనే వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ఈ శస్త్రచికిత్సలను చాలా తక్కువ కోతతో, కొన్ని సందర్భాలలో డేకేర్ ప్రొసీజర్స్లా కూడా జరుపుతున్నారు.
ముందస్తు సర్జరీలు: క్యాన్సర్ లక్షణాలు లేకున్నా కొన్నిరకాల కణుతులు (పాలిప్స్) కనిపించినప్పుడు వాటిని ముందస్తుగానే తొలగిస్తారు. కుటుంబ చరిత్ర నేపథ్యంలో రక్త సంబంధీకులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ-1, బీఆర్సీఏ-2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ ప్రమాదాన్ని తెలుసుకుని, రొమ్మును తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలు ఉంటే హిస్టరెక్టమి చేసి గర్భాశయాన్ని తొలగిస్తారు. ఇవన్నీ ముందుగానే అనుమానించి జరిపే సర్జరీలు.
క్యూరేటివ్ సర్జరీలు: ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, సర్జరీ తరువాత కీమో, రేడియేషన్ తదితర థెరపీలతో వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి జరిపేవే క్యూరేటివ్ సర్జరీలు. కొన్నిసార్లు సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు.
పాలియేటివ్ కేర్: చివరిదశలో వ్యాధిని గుర్తించినప్పుడు క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించి, ఇబ్బందిని తగ్గించడానికి చేసేది పాలియేటివ్ కేర్. కొన్ని సందర్భాలలో ఇతర చికిత్సలు అందించడానికి అనుకూలంగా ఉండేందుకు సపోర్టివ్ కేర్ కూడా ఇస్తుంటారు.
రీకన్స్ట్రక్టివ్ సర్జరీ: శస్త్రచికిత్సలో క్యాన్సర్ సోకిన భాగాన్ని, దాని చుట్టూ ఉన్న లింఫ్‌నోడ్స్, కణజాలాన్ని తొలగించడం మామూలే. కానీ ఒక్కోసారి బయటికి కనిపించే అవయవాలైన రొమ్ము, నోటికి సంబంధించిన భాగాలను తొలగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు తొలగించిన భాగాలను ఇతర భాగాల నుంచి తీసిన కణజాలం, ఎముకలు, ఇతర లోహాలు, ప్లాస్టిక్‌తో చేసిన ప్రోస్థటిక్స్ను ఉపయోగించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీల ద్వారా సరిచేస్తారు.
కీమో థెరపీ: క్యాన్సర్ చికిత్సలో రోగులు భయాందోళనకు గురయ్యేది థెరపీలకే. కీమో థెరపీ వల్ల రోగులకు వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, జుట్టు రాలిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఇవి తాత్కాలికమే. చికిత్స తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది.
రేడియేషన్ థెరపీ: వంద ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన రేడియేషన్ థెరపీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా అరగంటకు పైగా సాగే ట్రీట్మెంటును నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేయవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లకు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా త్రీడైమెన్షనల్, స్టీరియోటాక్టిక్, బ్రాకీథెరపీ తదితర కొత్త పద్ధతులతో తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవడమే కాకుండా దుష్ప్రభావాలు సైతం తగ్గుతాయి.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121