Devotional Movies | పుణ్యమంతా మనదే! ధన్యతంతా వెండితెరదే!! కృష్ణుణ్ని కండ్లకు కట్టిన ఘనత సినిమాదే! రాముణ్ని మన ముందు నిలిపిన కీర్తీ చలన చిత్రానిదే! మహా తపోధనులకు సైతం అర్థం కాని అమ్మవారి తత్తాన్ని సామాన్య ప్రేక్షకుడికి అర్థం చేసిందీ సినిమానే! ఎంతలా అంటే.. అది సినిమా అని తెలుసు, అమ్మవారి పాత్రలో నటిస్తున్నది మనలాంటి మనిషనీ తెలుసు! అయినా.. పరాశక్తి సబ్జెక్టుతో సినిమాలు వస్తేచాలు.. థియేటర్ల ముందు వెయ్యినొక్క కొబ్బరికాయలు పగిలేవి. మంగళ హారతులు అఖండ జ్యోతిగా వెలిగిపోయేవి. భక్తి పారవశ్యంలో కొందరికి పూనకాలు వచ్చేవి. ఇదంతా సినిమా మహిమే! అమ్మవారి చిత్రమంటే బొమ్మ హిట్టు అవ్వాల్సిందే!! అంతగా జనం ఆదరించేవారు మరి. అందుకే ఆ ఆదిపరాశక్తి తన భక్తులకే కాదు.. వెండితెరకూ కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
సినిమా ైక్లెమాక్స్‌లో ఉంది. అమ్మవారి గెటప్‌లో ఉన్న కె.ఆర్.విజయ త్రిశూలం చేతబూనింది. ఆమె కళ్లు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. నాలుక ఇంతబారు చాపి.. దుర్మార్గుడైన రక్కసుడి గుండెలపై కాళ్లు పెట్టి త్రిశూలంతో ఒక్కపోటు పొడిచింది. వాడి రక్తం ఆమె ముఖంపై చిందింది. నేపథ్యంలో ‘అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే..’ అంటూ మహిషాసుర మర్దని స్తోత్రం వినిపిస్తూ ఉంది. ప్రేక్షకులు భయంతో, భక్తితో.. రోమాంచితమై అలా చూస్తూ ఉన్నారు. థియేటర్ అంతా ధీర గంభీరంగా ఉంది. ఇంతలో ముందులైన్లో ఏదో కలకలం.
ఆమె ఎవరికో పూనకం వచ్చింది. చుట్టూ ఉన్నవాళ్లు అదుపు చేయలేపోతున్నారు. కూర్చున్న జనాలంతా ఒక్కసారిగా పైకి లేచారు. కళ్లముందు జరుగుతున్న కలామటీని ఆశ్చర్యంగా ఎంజాయ్ చేస్తున్నారు కొందరు. ఇంతలో పైలైన్లో ఇంకొకరికి పూనకం. బాల్కనీలో ఇద్దరు ముగ్గురు విరుచుకు పడిపోతున్నారు. థియేటర్ యాజమాన్యం అప్పటికే ముందు జాగ్రత్తగా కొబ్బరికాయలు.. కర్పూరం.. గుగ్గిలం.. వేపమండలు సిద్ధం చేసుకొని ఉంది. పూనకాలు మొదలవ్వగానే.. థియేటర్ అంతా గుగ్గిలం పొగతో నింపేశారు. కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చేస్తున్నారు.. వేపమండలతో వాళ్ల శరీరాలను నిమురుతున్నారు. ఈ హడావిడి సద్దుమణిగేలోపు సినిమాకు శుభం కార్డు పడిపోయింది.
ఇప్పుడైతే.. ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్సులు వచ్చేశాయి. జనాలు తెలివి మీరారు. కానీ, ఒకప్పుడు పరిస్థితి వేరు. సౌకర్యాలతో పనిలేదు. అమ్మవారి సినిమా వచ్చిందంటే పూనకాలు లోడ్ అయ్యేవి. అమాయకత్వం, మూఢత్వం, మూర్ఖత్వం.. మూడింటినీ కలగలుపుకొని మరీ ఉండేవారు జనం. అందులో భాగమే ఈ పూనకాలు.. గుగ్గిలాలు. దీనికి సంబంధించిన ఒక ప్రచారం గురించి ఇక్కడ సరదాగా ప్రస్తావించాలి.
అది 1955. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ‘రోజులు మారాయి’ సినిమా విడుదలై థియేటర్లలో ఆడుతున్న రోజులవి. బెజవాడ కనకదుర్గమ్మ కొండ మెట్ల దగ్గర ఓ రాత్రివేళ ఓ రిక్షావాడు బాడుగ కోసం చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ పెద్దావిడ కొండపై నుంచి దిగి వచ్చింది. అతని రిక్షా ఎక్కి.. “రోజులు మారాయ్’ సినిమా ఆడుతున్న థియేటర్‌కి పోనీయ్ రా..’ అన్నది.
ఆ రిక్షావాడు ఆమెను థియేటర్‌కి తీసుకెళ్లాడు. ఆమె రిక్షా దిగి, డబ్బులివ్వకుండా థియేటర్లోకి వెళ్లిపోయింది. డబ్బివ్వకుండా వెళ్లిందన్న కోపంతో.. ఆ రిక్షావాడు థియేటర్ ముందే కాపు కాశాడు. సినిమా వదిలారు. ఆ పెద్దావిడా సరాసరి వచ్చి, మళ్లీ అతని రిక్షానే ఎక్కింది. ‘ఎక్కడ ఎక్కించుకున్నావో.. అక్కడే దించెయ్యరా..’ అన్నది. అతను కోపంతోనే రిక్షా తొక్కుతూ.. ఆమెను కొండ మెట్ల దగ్గర దించాడు. ఆమె మౌనంగా కొండెక్కి వెళ్లి పోతున్నది. అతను పిలుస్తున్నాడు. ఆమె పలకలేదు. అలా వెళుతూ.. వెళుతూ అంతర్ధానమైపోయింది. ఆ రిక్షావాడు చిరాగ్గా తన తలకు చుట్టుకున్న తుండును తీసి విదిల్చాడు. ఆ తుండులో నుంచి నోట్ల కట్టలు పడ్డాయి. జనాల అమాయకత్వానికి ఇదో పరాకాష్ట. ఇదే నిజమని ఆ సినిమాకు పోటెత్తారట జనం. అప్పటికే ‘రోజులు మారాయి’ హిట్ టాక్ తెచ్చుకొని ఆడుతున్నది. ‘బెజవాడ దుర్గమ్మ కొండదిగొచ్చి చూసిన సినిమా’ అని ప్రచారం జరగడంతో జనాలు ఆ సినిమా థియేటర్లకు క్యూ కట్టారట. జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడంలో ఇదో స్ట్రాటజీ.
తదనంతర కాలంలో జనాల సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలోంచే రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టిన కథే కె.ఆర్.విజయ నటించిన ‘మా ఇలవేల్పు’(1971). ఈ సినిమాకు ముందు అమ్మవారి సినిమాలంటే పౌరాణిక, జానపద తరహాలో ఉండేవి. ‘విజయగౌరి’, ‘శ్రీగౌరీ మహాత్మ్యం’, ‘కనకదుర్గ పూజామహిమ’.. ఇలా అన్నమాట. 50, 60ల్లో తెరపై అమ్మవారు అంటే.. సర్వమంగళగా, దయాస్వరూణిగా కనిపించేది. ‘కార్తవరాయుని కథ’, ‘జగదేకవీరుడి కథ’ చిత్రాల్లో మహానటి కన్నాంబ పార్వతీదేవిగా సాక్షాత్కరిస్తే.. ‘చెంచులక్ష్మి’లో మహాలక్ష్మిగా అంజలిదేవి దర్శనమిచ్చింది. ఇక భూదేవి అనగానే చటుక్కున్న గుర్తుకొచ్చే రూపం ఎస్.వరలక్ష్మి. ‘లవకుశ’లో భూదేవిగా ఆమె నటన చిరస్మరణీయం. ‘దక్షయజ్ఞం’లో సతీదేవిగా దేవిక కనిపిస్తే.. ‘ఉమాచండీగౌరీ శంకరులకథ’లో అమ్మవారి మూడు రూపాల్లో అభినయించి భళా అనిపించుకున్నది బి.సరోజాదేవి. ఇక పద్మావతి అంటే సావిత్రి, సత్యభామ అంటే జమున.. ఇవన్నీ మంగళకరమైన శక్తి రూపాలే.
అయితే.. అమ్మవారిలోని మహిషాసురమర్దని రూపాన్ని తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన సినిమానే ‘మా ఇలవేల్పు’. జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకుడు. ఇది పౌరాణికం కాదు, జానపదం కాదు. సమకాలీన సమాజంలో అమ్మవారి మహిమల నేపథ్యంలో సాగే ఫిక్షన్ మూవీ. అప్పట్లో ఇదో కొత్త ఆలోచన. థియేటర్లలో పూనకాలు రావడం మొదలైంది ఈ సినిమా నుంచే! కె.ఆర్.విజయ తొలిసారి అమ్మవారిగా తెరపై కనిపించి కూడా ఈ సినిమాతోనే. ఈ చిత్రం విడుదలైన థియేటర్లన్నీ అప్పట్లో దేవాలయాలుగా మారిపోయాయి. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘మా ఇలవేల్పు’ తర్వాత కె.ఆర్.విజయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆమెను మరో హీరో పక్కన హీరోయిన్గా చూడటానికి కూడా జనం ఇష్టపడలేదు. అప్పట్నుంచి అమ్మవారి పాత్రకు కె.ఆర్.విజయ పేటెంట్ రైట్ అనిపించుకుంది. ‘మా ఇలవేల్పు’ ప్రేరణగా ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. అయితే.. 1982లో వచ్చిన ‘కదలివచ్చిన కనకదుర్గ’ మళ్లీ ఆ రేంజ్ హిట్టయ్యింది. కె.ఎస్.రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కథ ‘మా ఇలవేల్పు’ కథకు దగ్గరగా ఉంటుంది. కానీ.. విజయవాడలో జరిగిన యదార్థగాథ అంటూ అప్పట్లో పబ్లిసిటీ ఊదరగొట్టి, జనాన్ని ఆకర్షించారు. ఇప్పటికీ అది నిజంగా జరిగిన కథ అని నమ్మేవాళ్లు లేకపోలేదు.
ఈ రెండు సినిమాల తర్వాత అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేంత చరిత్ర సృష్టించిన సినిమా కోడి రామకృష్ణ ‘అమ్మోరు’ (1995). గ్రాఫిక్ మాయాజాలంతో జనాన్ని మెస్మరైజ్ చేసిన మూవీ ఇది. కె.విశ్వనాథ్ ‘ఉండమ్మా బొట్టుపెడతా’(1968), ‘మా ఇలవేల్పు’.. ఈ రెండు కథల్ని కలిపి తయారు చేసిన కథ ‘అమ్మోరు’. నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అభిరుచి, రాజీలేని నిర్మాణ విలువలు, కోడిరామకృష్ణ దర్శకత్వ ప్రౌఢి ‘అమ్మోరు’ను తెలుగు సినీ చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా నిలబెట్టాయి. కథానాయికగా సౌందర్యకు, అమ్మవారిగా రమ్యకృష్ణకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమా ఇది. అమ్మవారి సినిమాలు ఎన్ని విడుదలై, విజయాలను అందుకున్నా.. ‘మా ఇలవేల్పు’, ‘కదలివచ్చిన కనకదుర్గ’, అమ్మోరు చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే!
అమ్మవారి నేపథ్య కథాంశాలతో రూపొంది భారీ విజయాలను అందుకున్న ఇతర సినిమాల విషయానికొస్తే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత నటించిన ‘ఆదిపరాశక్తి’, ఎస్.వరలక్ష్మి నటించిన ‘పరాశక్తి మహిమలు’. కె.ఆర్.విజయ నటించిన ‘జై సంతోషిమాత’, ‘అష్టలక్ష్మీ వైభవం’, ‘జగన్మాత’ చిత్రాలతోపాటు ‘శ్రీదేవి కామాక్షి కటాక్షం’, ‘శ్రీశైల భ్రమరాంబికా మహాత్మ్యం’, ‘మధుర మీనాక్షి..’ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. రీసెంట్గా నేటి లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా ‘మూకుతీ అమ్మన్’ సినిమాలో అమ్మవారిగా మెరిసింది.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. సమస్త బ్రహ్మాండాలూ అమ్మనుంచే ఉద్భవించాయని శాస్త్రవచనం. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అయిన అలాంటి అమ్మ.. తుచ్ఛమైన మానవశరీరంలోకి ప్రవేశిస్తుందనుకోవడం అమాయకత్వమే! రక్షించడానికీ, శిక్షించడానికీ అమ్మ దిగిరావాల్సిన అవసరం లేదు. అమ్మ అంతా వ్యాపించి ఉంటుందనీ, సర్వం శక్తిమయం అనీ తెలిసినా.. ఆ నిజాలు ప్రేక్షకులకు రుచించవ్. అబద్ధాన్నే ఎంజాయ్ చేస్తారు. భక్తి, నమ్మకం నుంచి పుట్టుకొచ్చే భావోద్వేగం అత్యంత శక్తిమంతం. దానికి అడ్డు చెప్పలేం.. అడ్డు కట్ట వేయలేం. సినిమా ఎలా ఉన్నా.. అమ్మ కృపాకటాక్ష వీక్షణాలు మాత్రం అందరిపై సదా ఉంటాయి.
– బుర్రా నరసింహా