Nimisha Priya Case | నిమీష ప్రియ.. కరడుగట్టిన హంతకురాలు కాదు. సాధారణ మహిళ. ప్రాణాలు తీయడం వృత్తి కాదు, ప్రవృత్తి అంతకంటే కాదు. ప్రాణాలు నిలిపే నర్సు ఉద్యోగం ఆమెది. పంజరంలో చిలుకను చేసి, పడక మీద ఆటబొమ్మగా మార్చి.. ఆనందపడిపోతున్న ఓ మానవ మృగాన్ని నేలకూల్చడమే ఆమె చేసిన నేరం! న్యాయం, అన్యాయం.. ఆ తర్వాత. ముందు ఆమె వాదనలు వినడానికి కూడా యెమెన్ కోర్టులు సిద్ధంగా లేవు. ఏకపక్షంగా ఉరిశిక్షను ఖరారు చేశాయి. తనిప్పుడు, దేశం కాని దేశంలో ఊచలు లెక్కబెడుతున్నది. మనందరి మద్దతూ కోరుతున్నది. ప్రియకు న్యాయం కావాలి!
యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలు. దాని పక్కనే ఓ క్లినిక్. కేరళకు చెందిన నిమీష ప్రియ ఆ క్లినిక్‌ను నిర్వహిస్తున్నది. జైలు వార్డెన్‌కు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రియ క్లినిక్కే వస్తుంటాడు. ఆమె అంటే ప్రత్యేక అభిమానం. కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు. సంభాషణలో తలాల్ అబ్దో మహదీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘వాడ్ని చంపేయ్ బేటా! లేకపోతే నీ బాధలు తీరవు. నువ్వు నీ దేశం వెళ్లలేవు’ అంటూ ఆవేశపడిపోతుంటాడు వార్డెన్ సాబ్. నిజమే, ప్రియకు జరిగిన అన్యాయం చిన్నదేం కాదు. తలాల్ ఓ మృగం. మనిషిలా కనిపించే తోడేలు.
‘హత్యలు, రక్తపాతాలు ఆతర్వాత. ముందు వాడి చేతిలోంచి పాస్‌పోర్ట్ లాగేసుకోవాలి. కానీ.. ఎలా? మత్తు మందు ఇస్తే?’- ప్రియ బుర్ర పాదరసంలా పనిచేసింది. వైద్య వృత్తిలో ఉంది కాబట్టి, అదేమంత కష్టం కాదు. అందులోనూ ఆ దుర్మార్గుడు మద్యానికి బానిస. ఎప్పటిలాగే, ఆ రోజు కూడా మత్తులో జోగిపోతూ క్లినిక్‌కు వచ్చాడు. అప్పటికే సగం ఖాళీ అయిపోయిన మద్యం సీసా అతని చేతిలో ఉంది. నోట్లో బూతులు ప్రవహిస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూ దొర్లి నిద్రలోకి జారిపోయాడు. గురక మొదలైంది. ధైర్యం చేసి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ ఆ మందు ఏమాత్రం పనిచేయలేదు. కారణం, తలాల్ డ్రగ్స్‌కు బానిస. దీంతో ఆ డోసేజీ సరిపోదని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు కూడా అర్ధరాత్రి దాటాక ఆమె గదికి వచ్చాడు. వచ్చీరాగానే దున్నపోతులా మంచం మీద వాలిపోయాడు. ఈ సారి ‘కెటామైన్’ అనే మత్తు మందుతో సిద్ధంగా ఉంది ప్రియ. చాకచక్యంగా ఆ ద్రవాన్ని ఇంజెక్ట్ చేసింది. కేకలు పెడుతూ, గింజుకుంటూ నేలకొరిగిపోయాడు తలాల్.
పల్స్ చూసింది. ఊపిరి పరీక్షించింది. సందేహం లేదు. చచ్చిపోయాడు. తక్షణ కర్తవ్యం? స్నేహితురాలైన హనన్‌కు కాల్ చేసింది. ఆమె కూడా నర్సే. ప్రియకు ఆత్మీయ నేస్తం. ఆ దుర్మార్గుడు ప్రియను ఎన్ని హింసలకు గురిచేసేవాడో ఆమెకు తెలుసు. ‘పీడా విరగడైంది. పది నిమిషాల్లో వచ్చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు’ అంటూ స్నేహితురాలికి భరోసా ఇచ్చింది హనన్. అన్నట్టుగానే వచ్చేసింది. కానీ, ప్రియ అప్పటికే షాక్‌లో ఉంది. దీంతో తనే తలాల్‌ను కత్తికొక కండగా నరికేసింది. ఆ ముక్కలను మూటకట్టి వాటర్‌ట్యాంక్‌లో పడేసింది. ప్రియ పరిస్థితి కుదుటపడ్డాక ఇద్దరూ పాస్‌పోర్ట్ కోసం మూలమూలనా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అంతలోనే రెండు రోజులు గడిచిపోయాయి. శవం కుళ్లిన వాసన కాలనీ అంతా పాకిపోయింది. తలాల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ప్రియ క్లినిక్‌ను, ఇంటిని సోదా చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం హనన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖాయం చేసింది. ప్రియకు మాత్రం మరణ దండన విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. దీంతో, మృత్యు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నది ప్రియ.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పుట్టిపెరిగింది ప్రియ. టామీ థామస్ అనే వ్యక్తికిచ్చి పెండ్లి చేశారు తల్లిదండ్రులు. అప్పటికే నర్సింగ్ కోర్సు చేసిన ప్రియ, ఉద్యోగం కోసం భర్తతో కలిసి యెమెన్ వెళ్లింది. థామస్ పెట్రోల్ బంక్‌లో పనికి కుదిరాడు. ప్రియ ఓ క్లినిక్‌లో నర్స్‌గా చేరింది. ఆ అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఓ కూతురు పుట్టింది. ఓ క్లినిక్ ప్రారంభించాలన్నది ప్రియ ఆలోచన. కానీ, అక్కడి నిబంధనల ప్రకారం యెమెన్ పౌరులకు మాత్రమే క్లినిక్ ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. దీంతో స్థానికుడైన తలాల్‌ను భాగస్వామిగా చేర్చుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉండేది. క్లినిక్ లాభాలబాట పట్టడంతో తలాల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రియను కీలుబొమ్మగా మార్చాడు. టామీ థామస్‌ను, పాపను బలవంతంగా కేరళ పంపేశాడు. ప్రియా, థామస్‌ల పెండ్లి ఫొటోలు మార్ఫింగ్ చేసి, ప్రియ తన భార్య అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె పాస్‌పోర్ట్ లాగేసుకున్నాడు. సిమ్‌కార్డ్ ముక్కలు ముక్కలు చేశాడు. నిత్యం చిత్రహింసలే. తన స్నేహితులతోనూ పడుకోమని బలవంతపెట్టేవాడు.
కేసు విచారణలోనూ తీవ్ర వివక్ష ఎదుర్కొంది ప్రియ. యెమెన్ న్యాయమూర్తులు ఆమె వాదనను విశ్వసించలేదు. కేసు వాదించడానికి ఏ న్యాయవాదీ ముందుకు రాలేదు. ‘అది దుర్బుద్ధితో చేసిన హత్య కాదు. ఆత్మరక్షణ ప్రయత్నం మాత్రమే’ అని ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంది ప్రియ. భారత దౌత్యాధికారులు, ప్రవాస కేరళ సంఘాలు, ‘సేవ్ నిమీష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’.. చివరి అవకాశంగా ఓ ప్రయత్నం చేస్తున్నాయి. . ‘బ్లడ్ మనీ ( Blood Money )’ తప్ప వేరే దారి లేదు. ‘బ్లడ్‌మనీ అంటే.. బాధిత కుటుంబం దోషిని క్షమించి.. హత్యకు పరిహారంగా ఎంతోకొంత నగదు తీసుకోవడం’. ఆ పేద కుటుంబానికి అదికూడా శక్తికి మించిన పనే. కానీ, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇప్పటికే కొంత మొత్తాన్ని సేకరించారు. ఒకవేళ ప్రయత్నాలు ఫలిస్తే.. ప్రియ సురక్షితంగా బయటికి వచ్చేస్తుంది. ఫలించకపోతే.. విదేశాల్లో ఉరిశిక్ష అనుభవించిన మొదటి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోతుంది. మేం అతి సామాన్యులం. ఒక వ్యవస్థను ఎదిరించి పోరాడలేం. భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మానవతా దృక్పథంతో యెమెన్ సర్కారుతో చర్చలు జరపాలి. ప్రియ రాకకోసం తన చిన్నారి కూతురు ఎదురుచూస్తున్నది. ‘మా అమ్మ ఎప్పుడొస్తుంది’ అంటూ మారాం చేస్తున్నది. ఆ పసిబిడ్డకు ఏమని చెప్పాలి? పోయిన ప్రాణాలను ఎటూ తెచ్చి ఇవ్వలేం. ఉన్న ప్రాణాలను అయినా నిలబెట్టుకుందాం.
– ప్రేమ కుమారి, ప్రియ తల్లి
… డప్పు రవి
“రోగుల చిరునవ్వులే నా ఆస్తులు అంటున్న ఈ డాక్టర్ కథేంటంటే..”
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”