ప్రస్తుతం స్కూల్ పిల్లలతోపాటు చాలామంది కార్పొరేట్ ఉద్యోగులు కూడా డ్రెస్‌కోడ్ పాటిస్తున్నారు. యూనిఫాం, ఫార్మల్ డ్రెస్‌లో భాగంగా ‘టై’ కూడా ధరిస్తున్నారు. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు మెడకు ‘టై’తోనే ఉంటున్నారు. అయితే, ‘టై’ని సరిగ్గా కట్టుకోకుంటే.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో నిర్వహించిన పలు అధ్యయనాలు కూడా.. నెక్ టై వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుందని తేల్చాయి.
తల తిరగడం, వికారం, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నాయి. 2018లో న్యూరోరేడియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో భాగంగా.. 21 నుంచి 28 ఏండ్ల వయస్సు ఉన్న 30 మందిని ఎంపిక చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని యువకులకు విండ్సర్ ముడితో బిగించిన నెక్‌టైని 15 నిమిషాల పాటు ధరించాలని చెప్పారు. రెండో గ్రూపు వారిని టైకి దూరంగా ఉంచారు. ఆ తర్వాత వీరందరికీ ఎంఆర్ఐ స్కాన్ చేయించారు.
ఈ సందర్భంగా టై ధరించిన వారి మెదడులో రక్త ప్రవాహం 7.5 శాతం తగ్గిందని గుర్తించారు. టై తీసేసిన 15 నిమిషాల తర్వాత కూడా వారి మెదడులో రక్తప్రవాహం 5.7 శాతం తక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు టై ధరించని వారిలో ఎలాంటి సమస్య కనిపించలేదు. అయితే, రక్త ప్రవాహంలో 7.5 శాతం తగ్గుదల పెద్ద సమస్య కాకపోయినా.. టై ధరించే వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి సమస్యలు ఉంటాయని అధ్యయనకారులు చెబుతున్నారు. హృదయ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు వంటివి ఉన్నవారు టై విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా టై ధరించాలనుకుంటే.. మరీ బిగుతుగా కట్టుకోవద్దని అంటున్నారు. టైని అప్పుడప్పుడూ కదుపుతూ, వదులుగా చేసుకుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని అంటున్నారు.