కోరిన వస్తువు దొరకడం లేదన్న కంగారులో కంగారూలా చిందులు తొక్కుతున్న వేళ, చిరాకులో చికాకు కేకలు పెడుతున్న మనిషిని ఒక్క నిమిషం కట్టిపడేయడం మాటలతో అయ్యే పనికాదు. అదే సమయంలో గదిలో ఏ మూల నుంచో ‘తు జహాఁ జహాఁ చలేగా! మేరా సాయా ఆప్ హోగా..’ లీలగా వినిపిస్తే పనిలో పదనిసలన్నీ మాయమవుతాయి. చిటపట చినుకులు పడుతున్నప్పుడు.. ఢిల్లీ సెట్ రేడియోలోంచి ‘ఆజ్ మౌసమ్ బడా బేమాన్ హై..’ అని రఫీ గొంతుక వినిపిస్తే ఎంత బాగుంటుంది? ఆ తరానికి రేడియోలు, గ్రామ్‌ఫోన్ రికార్డులు కట్టబెట్టిన అదృష్టం ఈ తరానికి మ్యూజిక్ యాప్‌ల ద్వారా దక్కుతున్నది. ఆ పాతపాట ఏ కాలమైనా మధురమే అని భావించిన దర్శక, నిర్మాతలు ఓటీటీలో అలనాటి ఆణిముత్యాలను సందర్భోచితంగా మెరిపిస్తున్నారు.
టీ తాగుతున్నా ఓటీటీ, టిఫిన్ చేస్తున్నా ఓటీటీ. పోటాపోటీగా సాటిలేని సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మేటి అనిపించుకుంటున్నాయి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. కళ్లు చెదిరే కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను పలకరిస్తున్నా.. పాతదనాన్నీ కొత్తగా ప్రయోగిస్తున్నారు. సంగీతప్రియులను అలరించడానికి, ఆ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పాతపాటలను నమ్ముకుంటున్నారు. ముఖ్యంగా హిందీ వెబ్‌సిరీస్‌లలో ఈ తరహా ట్రెండ్ నడుస్తున్నది.
బ్యాక్‌గ్రౌండ్ కోసం యథాలాపంగా పాతపాటలను ఎంచుకోవడం లేదు.. ఓటీటీ వేదికలు. ఒక పాత్రను పరిచయం చేయడానికి, సన్నివేశాన్ని మరింత పండించడానికి, కథలో మలుపులు ప్రేక్షకులకు బాగా అర్థం కావడానికి ఏరికోరి నలుపు-తెలుపు గీతాలను వినిపిస్తున్నాయి. పనిలోపనిగా ‘నోస్టాల్జియా’ అనుభూతిని కలిగిస్తున్నాయి. పన్లోపనిగా కొత్తపాట రూపొందించడానికి అయ్యే ఖర్చులో కొంత తగ్గించుకుంటున్నాయి కూడా.
డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ద గ్రేట్ ఇండియన్ మర్డర్’ వెబ్‌సిరీస్‌లో పాతపాటల కచేరీ పెట్టినంత పనిచేశారు. సందర్భాలు, సన్నివేశాలకు తగ్గట్టుగా అలనాటి సూపర్‌హిట్ పాటలను సరికొత్తగా వాడుకున్నారు. మహమ్మద్ రఫీ ఆలపించిన ‘బహారో పూల్ బర్సావో.. మేరా మెహబూబ్ ఆయాహైఁ’ పాటను సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి ఉపయోగించారు. దిలీప్‌కుమార్ ‘నయాదౌర్’ సినిమాలోని ‘ఏ దేశ్ హై వీర్ జవానోఁకా’ పాటతోపాటు ‘ఓ కౌన్ థీ’ చిత్రంలోని ‘లగ్‌జా గలే..’ పాటను వినిపించారు. ఆయా సన్నివేశాల చిత్రీకరణ మాట ఎలా ఉన్నా.. ఈ పాతపాటలు ప్రేక్షకులను మరింత కనెక్ట్ చేస్తాయని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.
పాత సినిమాల్లోని మధురమైన పాటలు చెవిన పడితే తెలియకుండానే మనసు తేలిక అవుతుంది. ఆ సాహిత్యం, సంగీతం ఏ తరం మనిషినైనా భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. ఈ కిటుకు ఆధారంగానే నయా వెబ్‌సిరీస్‌లలో గోల్డెన్హిట్స్కు చోటు కల్పిస్తున్నారు. అవసరమైన చోట ఒరిజినల్ ట్రాక్నే నేపథ్యంగా వినిపిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే పాటలోని మాధుర్యం తగ్గకుండా రీమిక్స్ చేసి చిత్రీకరిస్తున్నారు. దశాబ్దాల కిందటి సంఘటనలు, వర్తమాన అంశాలు కథావస్తువులుగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లలో అలనాటి మేటి పాటలు వినిపించడం బోనస్ అంటున్నారు ప్రేక్షకులు.
దశాబ్దాలు గడుస్తున్నా సరే, కొన్ని పాటలు పదేపదే వినాలనిపిస్తాయి. మనసులో చెరగని ముద్రవేస్తాయి. అలాంటి మేలైన గీతాలను ఎంచుకొని వెబ్‌సిరీస్‌లలో ఉపయోగిస్తుండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తాజ్‌మహల్’ సిరీస్‌లో షమ్మీకపూర్ ఎవర్గ్రీన్ హిట్ ‘దీవానా హువా బాదల్..’ పాట వినిపిస్తుంది. సోనీ లివ్ ఓటీటీని అమాంతం పైకి లేపిన వెబ్‌సిరీస్ ‘స్కామ్ 1992- ద హర్షద్ స్టోరీ’. స్టాక్మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన హర్షద్ మెహతా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ గతేడాది ట్రెండింగ్‌లో నిలిచింది. ఇందులోనూ నోస్టాల్జియా పాటలు అలరిస్తాయి. అమితాబ్ హిట్స్ ‘రాత్ బాకీ బాత్ బాకీ’, ‘జుమ్మా చుమ్మా దేదే..’ పాటలు వినిపిస్తాయి. వెబ్ సిరీస్ ప్రచారానికి పాతపాటలు చాలా అవసరమని అంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. రొటీన్‌కు భిన్నంగా వినిపించే ఆ తరం పాటలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి కూడా. కొన్ని సర్వేల ఆధారంగానే ప్రేక్షకులకు ఇష్టమైన అంశాలను ఓటీటీలో పొందుపరుస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.