ప్రతినెలా ఖర్చులన్నీ పోనూ నా జీతంలో రూ.10 వేల వరకూ మిగులుతున్నాయి. ఈ మొత్తాన్ని నేను చిట్స్ వేయడం మంచిదా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మేలా?
– విశాల, హైదరాబాద్
చాలామంది చిట్స్ వేయడానికి మొగ్గుచూపుతుంటారు. అందుకు రకరకాల కారణాలు. తెలిసిన వాళ్లు చిట్స్ నిర్వహించడం, అనుకున్న సమయానికి చిట్ మొత్తం ఇస్తామని హామీ ఇవ్వడం, నాలుగు రోజులు అటూయిటుగా వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఉండటం.. ఇవన్నీ చిట్స్ వేయడానికి ప్రోత్సహించే అంశాలే! అయితే, రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ సంస్థలు కోకొల్లలు. వ్యక్తులు నిర్వహించే చిట్స్‌కు దూరంగా ఉండటం మంచిది. గుడ్డిగా నమ్మి చిట్ కట్టడం సరైన పెట్టుబడి అనిపించుకోదు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి నెలలు గడిచినా డబ్బులు ఇవ్వని ఉదంతాలు రోజూ చూస్తూనే ఉన్నాం. చిట్స్ వేయాలని భావిస్తే.. రిజిస్టర్డ్ సంస్థల్లో వేయండి. చిట్ ప్రారంభించడానికి ముందే కమీషన్, వడ్డీ, ఇతర షరతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. చట్టపరంగా చిట్స్‌కు ఎలాంటి రక్షణా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే.. తెలివైన వ్యక్తుల ఎంపికగా చెప్పవచ్చు. ఇవి సెబీ పర్యవేక్షణలో ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల లాభాల్లో తేడాలు ఉంటాయి. కానీ, అసలుకే ఎసరొచ్చే ప్రమాదం దాదాపుగా ఉండదు. ఇందులో షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్, లో రిస్క్, గ్రోత్ ఓరియెంటెడ్.. ఇలా రకరకాల స్కీమ్‌లు ఉంటాయి. పెట్టుబడికి ముందు వాటి గురించి కనీస అవగాహన ఉండాలి. కాకపోతే, దీర్ఘ కాలంలో మంచి ఫలితాలు ఉంటాయి. మదుపునకు సంబంధించి చిట్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమం.
– దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజర్
డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్