నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇస్తున్నారు. దాంతో, వాళ్లు చిన్నవయసు నుంచే మొండిగా తయారవుతున్నారు. అదే తీరుగా పెరుగుతూ.. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే.. పిల్లల పెంపకంలో సమతుల్యత పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా.. మరీ కఠినంగా వ్యవహరించకుండా ఉండాలని చెబుతున్నారు.
అధిక స్వేచ్ఛతో పెరిగే పిల్లలు మొండివారిలా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. తమకు ఎదురు లేదని వారు భావిస్తే.. భవిష్యత్తులో కొరకరాని కొయ్యల్లా మారొచ్చు. కాబట్టి, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సమతుల్యత పాటించాలి. కొన్ని విషయాల్లో స్వేచ్ఛగా వదిలేసినా.. మరికొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే.. వారి భవిష్యత్తు బాగుంటుంది.
పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అధికంగా స్నాక్స్ తినడం, ఎక్కువపేపు స్క్రీన్‌పైనే గడపడం చేస్తుంటారు. దాంతో, అనారోగ్యంతోపాటు వారి చదువూ అటకెక్కుతుంది.
అధిక స్వేచ్ఛతో తల్లిదండ్రుల దగ్గర తమ మాటే నెగ్గుతుందని పిల్లలు భావిస్తారు. బంధువుల దగ్గరా అలాగే ప్రవర్తిస్తారు. ఇలాంటి పిల్లల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. పెద్దయ్యాక మొండిగా మారే అవకాశం ఉంటుంది.
పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల.. చిన్న వయసు నుంచే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు.
సరైన మార్గదర్శకత్వంతో స్వేచ్ఛ ఇవ్వడం వల్ల.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి అభిప్రాయాలనూ భయం లేకుండా వ్యక్తపరచగలరు.
పిల్లల్ని మరీ స్వేచ్ఛగా కాకుండా, కఠినంగా వ్యవహరించకుండా పెంచాలని నిపుణులు చెబుతున్నారు. కొట్టడం, తిట్టడం కంటే.. ప్రేమతో కూడిన కాఠిన్యాన్ని ప్రదర్శించాలని సూచిస్తున్నారు. ఇక పిల్లలకు చిన్నచిన్న పనులు, బాధ్యతలను అప్పగించాలి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడే అంశాలపై వారితో సంభాషించాలి. అప్పుడే.. వారు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది.