కాసింత జుట్టు ఉండాలే కానీ ఊరికే కొప్పు వేసినా అందంగానే కనిపిస్తుంది. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా చెల్లుతుందంటూ బుగ్గలు నొక్కుకుంటారు పెద్దలు. కానీ ఆ సిగనే మరింత సింగారంగా తీర్చిదిద్దితే దాని అందం ద్విగుణీకృతం అవ్వడం ఖాయం. అలాగని వెంట్రుకలకు లేనిపోని బరువులు తగిలించి వాటిని ఇబ్బంది పెట్టే పనీ చేయకూడదు.
అటు అందమూ ఇటు సౌకర్యమూ సమపాళ్లలో కలిసేలా మార్కెట్లోకి వస్తున్నాయి ‘హెయిర్ ఫినిషింగ్ ఫిక్సర్ కోంబ్’లు. ముడి వేసుకున్నాక కూడా మెడ మీద ఉండే పొడవు తక్కువ వెంట్రుకలను కూడా పట్టి ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంటే సాగే గుణం ఉండే ఈ క్లిప్ రెండు అంచుల్ని లాగి పట్టి, మెడ మీది వెంట్రుకల్లో ఉంచి కొప్పు కింది దాకా లాగి వదిలేస్తే సరి.
కింది జుట్టు చిందర వందరగా లేకుండా శుభ్రంగా ఫినిషింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక ఇందులోనే పువ్వులు, సీతాకోక చిలుకల్లాంటి అలంకరణలు వస్తుండటంతో కొప్పు అందం కొంగొత్తగా మారిపోతుంది. ఇన్నాళ్లూ తల పైభాగానికి మాత్రమే పరిమితమైన కేశాలంకరణలు వీటి కారణంగా ముడి కింది భాగానికీ చేరాయి. తమదైన సొగసుతో హెయిర్ స్టయిల్‌కి విభిన్నమైన లుక్ తీసుకొస్తున్నాయి.