శరీర దుర్వాసన… కొంత మందిని ఇబ్బంది పెట్టే సమస్య. జీవిత భాగస్వామి దగ్గరే కాదు, ఆఫీసులు కాలేజీల్లోనూ ఎవరైనా సమీపానికి వస్తేనే కంగారు పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్లకు చక్కటి పరిష్కారం పటిక. ఇంగ్లీషులో ఆలమ్ అని పిలిచే ఇది క్రిస్టల్ రూపంలోనూ, పొడి రూపంలోనూ దొరుకుతుంది. పటిక ముక్కను తీసుకుని కొద్ది నీళ్లతో తడపాలి. ఆ ముక్కను చంకలు, ఇతర దుర్వాసన వచ్చే భాగాల్లో రుద్దాలి. కాసేపు అలా వదిలేసి దుస్తులు ధరిస్తే సరి. పొడిరూపంలో ఉన్నదైతే… ఎసెన్షియల్ ఆయిల్‌తో కలిపి దుర్వాసన వచ్చే భాగాల్లో రాయాలి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చెమటనూ, బ్యాక్టీరియానూ అరికట్టి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇంకేం, దగ్గరగా రా… దగ్గరగా… అని పాడొచ్చు!