Chickenpox | చికన్పాక్స్ను వాడుక భాషలో అమ్మవారు, తల్లి అని పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వానకాలం, చలికాలంలోనే ఎక్కువగా వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎండకాలంలో కూడా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటివాటిలో చికన్పాక్స్ ప్రధానమైనది. ఇది వేసవిలో ఎక్కువగా విజృంభిస్తుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది.
కాకపోతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. చికన్పాక్స్ అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని బాధితులు చాలావరకు 12 ఏండ్లలోపు పిల్లలే ఉంటారు. రోజురోజుకూ ఎండలు ఎక్కువయ్యే నేపథ్యంలో చికన్పాక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
చికన్పాక్స్ వ్యాధి ‘వేరిసెల్లా హెర్పిస్’ అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వైరస్ గాలిలో తేలియాడుతూ ఉంటుంది. అలా గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలకు ఈ వైరస్ ప్రమాదకరం. ఒక ప్రాంతంలో వ్యాధి సోకితే ఆ పరిసర ప్రాంతాల్లో దీని తీవ్రత ఉంటుంది. అందుకే, అమ్మవారు (చికన్పాక్స్) వచ్చిన వాళ్ల ఇంటికి వెళ్లకూడదని పెద్దలు జాగ్రత్తలు చెబుతారు. అయితే, పిల్లలతోపాటు ఈ వ్యాధి పెద్దలకు కూడా సోకుతుంది. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది.
చికన్పాక్స్ అంత ప్రమాదకరమైన వ్యాధేమీ కాదు. కానీ సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాలమీదికి రావచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకినవారిలో ఇన్ఫెక్షన్ తీవ్రమైతే అది ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలతోపాటు న్యుమోనియా, మెదడువాపు తదితర జబ్బులకు దారితీయవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి సోకినప్పుడు పిల్లలను బయటికి పంపించకూడదు. లేకపోతే ఇన్ఫెక్షన్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఐదేండ్లలోపు పిల్లలు చికన్పాక్స్ బారినపడితే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. సొంతవైద్యం, నాటువైద్యం ప్రమాదకరం. లక్షణాల ఆధారంగా పిల్లలకు చికిత్స చేయాల్సి ఉంటుంది.
అమ్మతల్లి వ్యాధి పూజలతో తగ్గదు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సకాలంలో చికిత్స చేయించాలి. సాధారణంగా చికన్పాక్స్ వస్తే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను డాక్టర్‌కు చూపించకుండా, మూఢనమ్మకాలతో పూజలు చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. డాక్టర్‌కు చూపిస్తే, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి జొవిరాక్, హెర్పిస్ తదితర మందులతో చికిత్స చేస్తారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదం.
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ ఉషారాణి
ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్
నిలోఫర్ హాస్పిటల్
హైదరాబాద్