ఇంట్లో మొక్కలు పెంచడం అంటే.. ఒకప్పుడు అభిరుచి మాత్రమే! ఇప్పుడు అదో అవసరం. ఒత్తిడిని తగ్గించేదిగా, మనసుకు హాయినిచ్చేదిగా, ఇంటికి ప్రత్యేక ఆకర్షణను ప్రసాదించేదిగా మారింది. అయితే, వేసవి ఎండలతోపాటు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఈ మొక్కలను సంరక్షించడం కష్టమై పోతుంది. ముఖ్యంగా, నీళ్లు లేక మొక్కలన్నీ వాడిపోయి, ఎండి పోతుంటాయి. అలా కావొద్దంటే.. బాల్కనీ, కుండీల్లోని మొక్కలకూ గడ్డితో మల్చింగ్ చేయాలి. ఈ మల్చ్.. నేలకు ఒక దుప్పటిలా మారిపోతుంది. నీటిని ఎక్కువ సమయంపాటు నిల్వ ఉంచుతుంది. మొక్కలు ఎండిపోకుండా కాపాడుతుంది. ఇందుకోసం ఎండలు ముదరడానికి ముందే.. కుదురుల్లో మొదలు చుట్టూ 23 అంగుళాల గడ్డి పొరను పరచాలి.
మీరు ఉన్నప్పుడే తగినంత నీరు పెడితే.. ఈ మల్చ్ తేమను పట్టి ఉంచుతుంది. నీటిని నెమ్మదిగా భూమిలోకి విడుదల చేస్తుంది. ఫలితంగా, నీళ్లు ఆవిరి కావడం తగ్గుతుంది. అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మట్టి ఎక్కువసేపు తేమగా ఉంటుంది. మల్చింగ్తోపాటు పండిన, దాదాపు పండిన పండ్లను కోయండి. ప్రత్యేక శ్రద్ధ చూపించకపోతే.. బతకలేని చిన్న మొక్కలను, అంతగా ఫలించని కాయగూర మొక్కలను తొలగించండి. ఆకు కూరలు ఎండిపోకుండా నిరోధించడానికి.. ఆయా కుండీలను నీడలోకి చేర్చండి.