Suniel Shetty | తన కూతురు అతియా శెట్టిని.. ‘ఓ అద్భుతమైన అమ్మ!’గా వర్ణిస్తున్నాడు బాలీవుడ్ వెటరన్ స్టార్ సునీల్ శెట్టి. ప్రసవ సమయంలో సి-సెక్షన్‌కు బదులుగా నార్మల్ డెలివరీని ఎంచుకున్న తన బిడ్డను చూస్తే ఎంతో గర్వంగా ఉన్నదని అంటున్నాడు. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవం కోసం అతియా ‘నార్మల్ డెలివరీ’ జరగాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంపై సునీల్ శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అతియాపై ప్రశంసలు కురిపించాడు. “ఇప్పుడు చాలామంది సిజేరియన్ ద్వారానే పిల్లల్ని కంటున్నారు.
నొప్పుల బాధలేకుండా.. సౌకర్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో నా బిడ్డ.. సహజ ప్రసవాన్ని ఎంచుకున్నది. ఆమె ఎంతో ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మమ్మల్నే కాదు.. డాక్టర్లను కూడా ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. నా బిడ్డ.. ఎంతో ఎదిగింది” అంటూ అతియాను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక తన బిడ్డను అద్భుతమైన తల్లిగా అభివర్ణిస్తూ.. “ఆమె తల్లి మానాశెట్టి కూడా ఎంతో దృఢమైన మహిళ. అతియా ఆమె నుంచే అన్నీ నేర్చుకున్నది. ఎలాంటి సందర్భంలోనైనా ముఖంలో అలసట, ఒత్తిడి అనేది లేకుండా.. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది.
బిడ్డగానే కాదు.. తల్లిగానూ తప్పకుండా సక్సెస్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, “అతియా నార్మల్ డెలివరీని తట్టుకుంటుందా? అని నేనుకూడా మొదట్లో అనుమానపడ్డా. కానీ, ఆమె మాత్రం తన బిడ్డను సహజంగానే ఈ లోకంలోకి తీసుకురావాలని కోరుకుంది. ఆమె ఆలోచన ఎంతో గొప్పది” అంటూ వెల్లడించాడు. 2015లో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’తో నటనా రంగ ప్రవేశం చేసింది అతియా. ఆ తర్వాత ముబారకన్, మోతీచూర్ ఛాక్నచూర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నది. 2023లో తన స్నేహితుడు, భారత జట్టు క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను వివాహం చేసుకున్నది.