ప్రభువు వాక్కు లోకానికి అందించడానికై పంపబడిన వారే అపోస్తులు. అపోస్తులు, అపోస్తులురు అనేవి వాడుకలో ఉన్న పదాలు. అపోస్తుల కార్యాలు బైబిల్లో ఓ గ్రంథం. ఇది ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్లిన తర్వాత, అపోస్తులుల ద్వారా దేవుని రాజ్యానికి సంబంధించి, ఆయన సువార్తను వ్యాప్తి చేసిన తొలినాళ్లల్లో పాటుబడ్డ సంఘం, దాని సమస్యలు, దాని క్రమేణ పరివ్యాప్తి గురించి తెలుపుతుంది. ఈ గ్రంథం సువార్తా చతుష్టయంలో ఒకరైన లూకా మహనీయుడు రాశారు.
ప్రభువు విడిచిన కార్యాలకు ఇంపైన కొనసాగింపు ఇందులోని విషయం. అపోస్తుల కార్యాల్లో ఏసుక్రీస్తు నలభై రోజుల పాటు తన శిష్యులతో ఉంటూ.. వాక్య వ్యాప్తిపై చర్చిస్తూ, ఆ తరువాత ఆయన పరలోకానికి వెళ్లడం గురించిన విషయాలు, అపోస్తులుల ద్వారా సంఘం ఏర్పాటు చేయడం, అన్య విశ్వాసులకు కూడా సువార్త ఎలా అందించాలో నేర్పించడం ఇవన్నీ ఈ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ పని కోసం ప్రభువు శిష్యులు, శిష్యేతరులూ ఇంకా ప్రేరేపితులు ఎందరెందరో క్రీస్తు ద్వారా పంపడం ఇవన్నీ ఈ గ్రంథంలో చూడొచ్చు. సువార్త వ్యాప్తి గురించి ప్రస్తావించుకుంటే.. అపోస్తులుల ద్వారా సువార్త ఆనాటి ఎరుషలేం నగరం నుంచి రోమ్ నగరి వరకు వ్యాపించింది.
అపోస్తలులో ప్రభువు శిష్యుడు పేతురు, తనకు తాను అపోస్తులునిగా ప్రకటించుకొన్న ప్రభువు శిష్యేతరుడు పౌలు వీరిద్దరూ ఉంటారు. ఈ అపోస్తులుల కార్యాలకు వీరిద్దరు ప్రధాన పాత్రలే కాక, నడిపించిన రెండు నిండు ప్రాణభూతాలు! వీరి కార్యాలు ఓ పట్టు సడలని దీక్షతో ప్రభువు సూచిత గమ్యోన్ముఖంగా కొనసాగాయి. దేవుని ప్రజలు, వీరికి ఎలా సహకరించి, కలిసి పనిచేశారో, తెలియజేసేదే ఈ ‘అపోస్తులుల కార్యాలు’ అనే గ్రంథం. క్రీస్తు కాలానికి మహోధృతంగా సాగిపోయే యూదా మత సిద్ధాంతాలకు దీటుగా పయనించడానికి ఈ అపోస్తులులు పడిన శ్రమలన్నీ ఇందులో నిక్షిప్తమయ్యాయి.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024