దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఇంటా, బయటా.. ఎక్కడ చూసినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరగడం సర్వసాధారణమై పోయింది. సగటున ప్రతి గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండటం.. కలవరపాటుకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో మహిళలపై అత్యాచారాలు, గృహహింసకు వ్యతిరేకంగా ఎందరో గొంతెత్తుతున్నారు. స్వచ్చంధ సంస్థల ద్వారా పోరాడుతున్నారు. అలాంటివారిలో ఒకరు.. అపర్ణా రజావత్! ఈమె స్థాపించిన ‘పింక్ బెల్ట్’ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నది.
ఈ సంస్థ గురించి అమెరికాకు చెందిన జాన్ మెక్క్రిట్ అనే దర్శకుడు ఓ డాక్యుమెంటరీ తీయగా.. అనేక అవార్డులు గెలుచుకున్నది. ‘పింక్ బెల్ట్’ పేరుతో తీసిన ఈ చిత్రం.. అమెరికాలోని పామ్ స్ప్రింగ్స్‌లో ప్రదర్శితమైంది. తాజాగా చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా జ్యూరీ అవార్డును గెలుచుకున్నది. ఆగ్రాకు చెందిన అపర్ణ రజావత్.. మార్షల్ ఆర్ట్స్‌లో 16 సార్లు నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత లండన్‌కు వెళ్లిపోయింది. అయితే, 2012లో జరిగిన ‘నిర్భయ ఘటన’.. అపర్ణను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పుడే మహిళల రక్షణ కోసం పోరాడాలని సంకల్పించింది.
భారత్‌కు తిరిగివచ్చి ‘పింక్ బెల్ట్’ను స్థాపించింది. ఇందులో చేరిన మహిళలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతోపాటు ఆర్థికంగా అండగా నిలుస్తున్నది. ఈ క్రమంలో 2020లో పింక్ బెల్ట్ నిర్వహించిన ఓ శిక్షణా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ స్థానం సంపాదించుకున్నది. ఆ కార్యక్రమంలో 7401 మంది మహిళలు పాల్గొనడం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. తాజాగా తమ సంస్థ గురించి వచ్చిన చిత్రానికి ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసింది అపర్ణ. 2030 నాటికి దేశంలో కనీసం 20 లక్షల మందికి ‘పింక్ బెల్ట్’లో శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నది. ఇందుకోసం ప్రధాన నగరాల్లో హెల్ప్లైన్లను ప్రారంభించి, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తానని అంటున్నది.