శతాబ్దాల కిందట భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి వాస్కోడిగామా సాహస యాత్ర చేపట్టాడు. కానీ, ఇప్పుడు మన దేశ మూలాలు ప్రపంచం అంతటా గొప్పగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఏ దేశమేగినా.. కీలక పదవుల్లో భారతీయం జయకేతనం ఎగురవేస్తున్నది. అందరికీ పెద్దన్న అని చెప్పుకొనే అమెరికాలోనూ అత్యున్నత స్థానాల్లో మనవాళ్లు మెరికల్లా రాణిస్తున్నారు. మనదేశాన్ని రెండు శతాబ్దాలు పాలించిన బ్రిటిష్వారినీ మనవాడు ప్రధానిగా శాసించాడు. తాజాగా కెనడాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో భారతీయ మూలాలున్న ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, మరో ఇద్దరు కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టిన అనితా ఆనంద్ ప్రత్యేకం. ఆమె కథ ఆసక్తికరం.
కెనడా గడ్డ మీద భగవద్గీత చేబూని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 58 ఏండ్ల అనితా ఆనంద్. కాలం కలిసివస్తే.. కొన్నాళ్ల కిందటే ఆమెకు ఇంతకుమించిన అందలం దక్కేది. ఆ దేశ తాజా మాజీ ప్రధాని ట్రూడో పదవీచ్యుతుడైన తర్వాత ప్రధాని రేసులో అనిత పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, కారణాంతరాల వల్ల ఆమె వెనక్కి తగ్గారు. ఆ సమయంలో మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. మార్క్ కార్నీ ప్రధానిగా కొనసాగుతున్నారు. రెండు వారాల తర్వాత మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. కార్నీ బృందంలో భారతీయ మూలాలు ఉన్న నలుగురికి కీలక పదవులు దక్కాయి. వారిలో అనితకు విదేశాంగ మంత్రిగా అవకాశం వచ్చింది.
అనిత విద్యాధికురాలు. ఆమె తల్లిదండ్రులు సరోజ్ దౌలత్‌రామ్, సుందరం వివేక్. ఇద్దరూ వైద్యులే. సరోజ్‌ది పంజాబ్ కాగా, వివేక్‌ది తమిళనాడు. 1960 ప్రాంతంలో ఈ దంపతులు కెనడాకు వలస వెళ్లారు. అక్కడ సరోజ్ అనస్తీషియాలజిస్ట్‌గా, వివేక్ జనరల్ సర్జన్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. అనిత పెద్ద కూతురు. 1967లో నోవాస్కోషియాలోని కెంట్విలేలో ఆమె జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. అనిత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. డల్హౌసీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. కార్పొరేట్ లాయర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు. అదే సమయంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా, గెస్ట్ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. పలు న్యాయ సంబంధమైన బోర్డుల్లో సభ్యురాలిగానూ ఉన్నారు. రాజకీయాలపై అనితకు ఎప్పట్నుంచో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓక్వెల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి కెనడా పార్లమెంట్లో అడుగుపెట్టారు.
ఎంపీగా పనిచేసిన తొలి దఫాలోనే అనిత కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ట్రూడో మంత్రి వర్గంలో కొంతకాలం రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రవాణా-అంతర్గత వాణిజ్య శాఖామంత్రిగా, పబ్లిక్ సర్వీసెస్- ప్రొక్యూర్మెంట్ మంత్రిగానూ పనిచేశారు. మరోసారి ఓక్వెల్ నుంచి గెలుపొందిన అనిత ఈసారి కీలకమైన డిఫెన్స్ మినిస్ట్రీని చేపట్టారు. ట్రూడో హయాంలో భారత్- కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాలు అనిత చక్కదిద్దుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త అయిన జాన్ నోల్టన్‌ను అనిత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.
కార్నీ మంత్రి వర్గంలో భారతీయ మూలాలు ఉన్న మరో మహిళ రూబీ హాస్తా! నేరాలను ఎదుర్కొనే శాఖ కార్యదర్శిగా ఆమె ఎంపికయ్యారు. కార్యదర్శి అంటే మన దగ్గర సహాయ మంత్రి పదవి లాంటిది. ఈ బాధ్యతలు చేపట్టిన రూబీ తల్లిదండ్రులది పంజాబ్. 1970లో వాళ్లు కెనడా
వెళ్లి స్థిరపడ్డారు. 1979లో జన్మించిన రూబీ రాజనీతిశాస్త్రం, న్యాయవిద్య అభ్యసించారు. న్యాయవాదిగా పనిచేశారు. 2015 నుంచి బ్రాంప్టన్నార్త్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొంతకాలం ప్రజాస్వామ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని
చేశారు. తాజాగా నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన శాఖకు కార్యదర్శిగా ఎంపికయ్యారు.