బాలీవుడ్లో ‘బంధుప్రీతి’ అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే! ‘నెపోటిజం’ వల్ల అవకాశాలు కోల్పోయామని కొందరు అంటుంటే.. ‘స్టార్ కిడ్స్’ ముద్రతో ఇబ్బంది పడుతున్నామని మరికొందరు అంటున్నారు. తాజాగా, బాలీవుడ్ బ్యూటీ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘స్టార్ కిడ్’ అని సంబోధించడం తమను అవమానించడమేనని చెప్పుకొచ్చింది.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో కనిపించిన అనన్య పాండే.. ‘స్టార్ కిడ్’గా ఉండటం ఎంత కష్టమో వివరించింది. ‘మీరు ఎక్కడినుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు.. ఏం సాధించారన్నదే ముఖ్యం. నా తండ్రి వైద్యుల కుటుంబానికి చెందినవాడు. కానీ, వాళ్లలా డాక్టర్ కావాలని అనుకోలేదు. యాక్టర్ అవ్వాలని కోరుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి.. కష్టపడి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేను కూడా ఆయన బాటనే ఎంచుకున్నా! ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కానీ, కొందరు నన్ను ఇప్పటికీ ‘స్టార్ కిడ్’గానే చూస్తున్నారు. అది ఏమాత్రం అమోదయోగ్యం కాదు. స్క్రీన్‌పై ఎవరినైనా చూసినప్పుడు.. ‘అరే.. ఈమె ఫలానా స్టార్ కూతురు’ అని అనాల్సిన అవసరం లేదు. నటీనటుల బ్యాక్‌గ్రౌండ్ కన్నా.. వాళ్ల పర్ఫార్మెన్స్ చూడాలి’ అని చెప్పుకొచ్చింది అనన్య. ఇంకా ఏమన్నదంటే.. “సినిమా ఇండస్ట్రీ మాకు ఎంతో ఇచ్చింది. ప్రేక్షకులు కూడా మమ్మల్ని గొప్పగా ఆదరిస్తున్నారు.
తనను నమ్మకున్న ఎంతోమందిని సినిమా రంగం ఆదుకున్నది. అందులో సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాలతోపాటు బయటినుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన షారుక్ ఖాన్.. కొన్నాళ్లుగా బాలీవుడ్ బాద్షాగా వెలుగొందుతున్నారు కదా! కాబట్టి, సినీరంగంలో రాణించాలంటే.. వారి కుటుంబానికి సినీ నేపథ్యమే ఉండాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అలాగే, ఇతను ఇన్సైడర్.. అతను ఔట్‌సైడర్ అంటూ వేరుచేయడం కూడా మంచి పద్ధతికాద’ని పేర్కొన్నది. బాలీవుడ్లో 100కు పైగా చిత్రాల్లో కనిపించి.. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య పాండే. తక్కువ సినిమాలే చేసినా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. నిత్యం ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’తో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది.