బొట్టు బిళ్లలు… మనకు రోజువారీ జీవితంలో భాగమే. కానీ ఇటీవలి కాలంలో చాలామంది ఫ్యాషన్ అంటూ వాటిని పెట్టుకోవడం మానేస్తున్నారు. దీనికి ఓ చక్కని పరిష్కారాన్ని వెతికింది హైదరాబాద్‌లో పుట్టిన మేఘన ఖన్నా. ట్రెండీ లుక్ కోరుకునే వాళ్ల కోసం బొట్టు బిళ్లలనే ట్రెండీగా మారిస్తే సరిపోతుంది కదా… అన్న ఆలోచన చేసింది. ‘బిందీ ప్రాజెక్ట్’ పేరిట ఓ సంస్థను స్థాపించి స్టేట్మెంట్ తరహా స్టిక్కర్ల తయారీ ప్రారంభించింది. దుస్తులు యాక్సెసరీల పునర్వినియోగానికి కృషిచేస్తున్న ప్రీలవ్డ్ కో అనే సంస్థకు సహవ్యవస్థాపకురాలిగా, మహిళలకు మోటార్ సైకిల్ కోచ్‌గా, పర్సనల్ ైస్టెలిస్ట్గానూ పనిచేస్తున్నది. తన బొట్టు బిళ్లలను నగలుగా చూడాలని చెప్పే ఈమె ‘జిందగీ’తో పంచుకున్న సంగతులు!
Bindi Project | నేను గమనించినంత మేర నా చుట్టు పక్కల ఏదైనా మిస్ అయింది అని అనిపిస్తే దాన్ని అక్కడికి తీసుకురావడం నాకు అలవాటు. బిందీ ప్రాజెక్ట్ విషయంలో ఇదే జరిగింది. మా అమ్మ బెంగాలీ. నాన్న పంజాబీ. అయితే నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ కావడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న చాలా ఏండ్లు సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో ఉన్నారు. నేను ఇక్కడే పుట్టాను. అయితే నా మిత్రులు అప్పుడప్పుడూ వంశపారంపర్యంగా వచ్చే బంగారు బొట్టు బిళ్లల గురించి మాట్లాడుకునేవాళ్లు. అయితే ఇప్పుడసలు బొట్టు బిళ్లలే ఎవరూ పెట్టుకోవడం లేదని కూడా చర్చ వచ్చేది. అందుకే నేను బొట్టు బిళ్లలను ఆకర్షణీయంగా తయారు చేయాలి అనుకున్నాను. నిజానికి వ్యాపారవేత్తగా నా తొలి సంస్థ కూడా ఇలా ప్రారంభం అయిందే. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలను అమ్మే లావిటేట్ సంస్థ స్థాపన వెనకా ఇలా ఖాళీలను పూరించే తరహా ఉద్దేశమే ఉంది.
దేశం విడిపోయినప్పుడు పంజాబ్‌లోని లాహోర్ నుంచి సికింద్రాబాద్ వచ్చి స్థిరపడింది మా కుటుంబం. మా నాన్న ఇక్కడే పెరిగారు. భారత ఎయిర్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తూ శ్రీనగర్ నుంచి సికింద్రాబాద్ దాకా అనేక చోట్ల సేవలందించారు. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్… ఇలా అనేక రాష్ర్టాల్లో తిరిగాం. పుణెలో డిగ్రీ చేశాను. తర్వాత ఎంబీఏ చేసి ముంబైలో మార్కెట్ రీసెర్చ్ సంస్థలో ఏడాది పాటు పనిచేశాను. కానీ ఉద్యోగం అన్నది నాకెందుకో మింగుడుపడలేదు. బాగా పనిచేస్తున్నానన్న పేరు వచ్చింది కానీ అది అంత సంతృప్తినివ్వలేదు. వెంటనే ఉద్యోగం మానేశా. నిజానికి తర్వాత ఏం చేయాలి అన్నదాని మీద నాకు స్పష్టత లేదు. నాకు నచ్చిన ఊళ్లనీ తిరిగా. అక్కడి ప్రత్యేకతలు తెలుసుకున్నా. ఎప్పుడూ రాని నగరం బెంగళూరుకు కూడా వచ్చి కొన్నాళ్లు ఉన్నా. అయితే ఉత్తర భారతదేశం వైపు ఉన్న హస్త కళలకు సంబంధించిన వస్తువులు, నగలు దక్షిణ భారతంలో దొరకడం లేదని అర్థమైంది. నేను చెప్పేది 2002 నాటి సంగతి. అప్పుడు వేరువేరు రాష్ర్టాలకు వెళ్లడానికి సరైన రవాణా సదుపాయాలు ఉండేవి కావు. దీంతో నేను వివిధ రాష్ర్టాల హస్తకళలను ఒక్క దగ్గరికి తీసుకొచ్చేలా ‘లావిటేట్’ అనే సంస్థను బెంగళూరులో ప్రారంభించా. అందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. పద్దెనిమిది సంవత్సరాలు దాన్ని నడిపాను. చాలా పేరొచ్చింది. కొవిడ్ సమయంలో అప్పటి పరిస్థితుల కారణంగా దాన్ని మూసివేశాను. ఆ తర్వాత నా స్నేహితురాలితో కలిసి ప్రారంభించిన ప్రీలవ్డ్ కో అనే సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించాను. థ్రిఫ్టింగ్ అనే పద్ధతిలో ఇది నడుస్తుంది. అంటే ఒకరి దగ్గర నిరుపయోగంగా ఉన్న వస్తువులు మరొకరికి ఇచ్చి, అవతలి వాళ్ల దగ్గరి వస్తువులు లేదా దుస్తులను వీళ్లు తీసుకోవడం అన్నమాట. ఇది కూడా ప్రస్తుతం బెంగళూరులోనే ఉంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాం.
రెండేండ్ల క్రితం బిందీ ప్రాజెక్ట్ ప్రారంభించేప్పుడు కూడా పర్యావరణహితంగానే ఉండాలన్న నియమాన్ని పెట్టుకున్నాను. అందుకే నా స్నేహితుల లెదర్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన ముక్కలను తీసుకొచ్చి బొట్టు బిళ్లల తయారీకి వినియోగిస్తున్నా. ఎరుపు, నలుపు, మెరూన్ రంగులే కాకుండా మా దగ్గరి బొట్టు బిళ్లలు బ్రౌన్, సిల్వర్లాంటి విభిన్న వర్ణాల్లో కనిపించడానికి ఇదే కారణం. ఇక, మా దగ్గరి స్టిక్కర్లన్నీ పూర్తిగా హ్యాండ్ మేడ్. వీటి తయారీలో వస్త్రంతో పాటు, రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసల్లాంటి వాటిని వినియోగిస్తాం. మా దగ్గర తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో నగలా ఉంటుంది. ఆభరణాల్లో పెద్దపెద్దవి స్టేట్మెంట్ పీస్‌లుగా ఎలా పెట్టుకుంటామో, బొట్టు బిళ్లలో మా దగ్గరివి అలా స్టేట్మెంట్ పీస్లన్నమాట. చీర, సంప్రదాయ దుస్తుల మీదకే కాదు, చిరిగిన జీన్సు మీదకి కూడా పెట్టుకోగలిగేలా వీటిని తయారు చేస్తున్నాం. అయితే మా బొట్టు బిళ్లలు చిన్న చుక్కల్లా మాత్రం ఉండవు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో ఇవి ప్రారంభం అవుతాయి. అంటే ఇందాక చెప్పినట్టు మన ఆహార్యంలో ఇవి కూడా ఒక నగ లేదా యాక్సెసరీ అనుకోవాలి. వీటితో పాటు ఇచ్చే ప్రత్యేకమైన గమ్‌తో మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. ఆమని, రుహాని, దేవయాని, కళ్యాణి… ఇలా రకరకాల పేర్లతో విభిన్నమైన కలెక్షన్లు తీసుకొచ్చాం. ప్యాకెట్ ధర 1000 నుంచి 5000 రూపాయల దాకా ఉంటుంది. మా బొట్టు బిళ్లలకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. రోజురోజుకీ వీటిని ఇష్టపడే వారి సంఖ్యా పెరుగుతున్నది. ఇక, సెలెబ్రిటీల విషయానికొస్తే పెద్ద బొట్టుతో మనల్ని ఆకట్టుకునే గాయని ఉషా ఉతుప్ మా బొట్టు బిళ్లల్ని ఎంతో ఇష్టపడ్డారు. ఈ మధ్య కరీనా కపూర్ కూడా బిందీ ప్రాజెక్ట్ తయారు చేసిన బొట్టు బిళ్ల ధరించింది. ఎవరైనా మా స్టిక్కర్లు కావాలనుకుంటే ఇన్‌స్టా పేజీ ద్వారా సంప్రదించవచ్చు. త్వరలో వెబ్సైట్ కూడా తీసుకురాబోతున్నాం.
మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అందుకే ఆడవాళ్లు తక్కువగా నడిపే బైక్‌ను నేను నడపాలనుకున్నా. అలా ఇలా కాదు, ఏకంగా రైడర్‌గా మారిపోయా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్ అయిన లద్దాఖ్ దగ్గరి ఖార్దుంగ్ లా పాస్‌కు బైక్‌పై వెళ్లిన తొలి భారతీయ మహిళగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నా. అంతేకాదు, రైడింగ్‌లో నా అనుభవాలను తెలియజేసేలా ట్రావెల్ రాణి అనే ఇన్‌స్టా పేజీనీ నడుపుతున్నా. ఆడవాళ్లకి మోటార్ సైకిల్ కోచ్‌గానూ పనిచేస్తున్నా. అటు కెరీర్, ఇటు ఇల్లు… రెండూ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతుంటారు. మహిళగా రెండుకాదు, పాతిక పనులు ఒకే సమయంలో నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మనకి సంతృప్తి ఉండదు. పాత ఫొటోలు చూసుకుని కాస్త లావుగా ఉంటే బాగుండేది అనుకుంటాం. కొత్తవి చూసి లావయిపోయాం అనుకుంటాం. మనల్ని మనం పెద్దగా ప్రేమించుకోం. పోనీ ప్రేమించుకునేలా తయారయ్యేందుకు అంతగా ప్రయత్నించం. అందుకే ఆడవాళ్లు తమని తాము ఆత్మ విశ్వాసంతో, బోల్డ్‌గా చూపించుకోవాలి అని చెబుతా. మా బిందీ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి బోల్డ్ లేడీస్ కోసమే ప్రత్యేకమైన మోడళ్లు తీసుకొస్తూ ఉంటుంది. ఇది వాళ్లని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నమే!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి