టెక్నాలజీ దిగ్గజం అమెజాన్.. తాజాగా కొత్త స్మార్ట్ డిస్ప్లేలను పరిచయం చేసింది. ఎకో షో 11తోపాటు ఎకో షో 8(నాలుగో తరం) మోడల్స్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ‘ఓమ్ని సెన్స్’ టెక్నాలజీతోపాటు మరిన్ని ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. గదిలో ఎవరైనా ఉన్నారా? లేదా? అని ‘ఓమ్నీ సెన్స్’ సెన్సర్‌తో గుర్తిస్తాయి. దానికి అనుగుణంగా లైట్లను ఆన్/ ఆఫ్ చేయడం వంటి పనులు ఆటోమేటిక్‌గానే చేసేస్తాయి. ఈ రెండు మోడల్స్ కూడా అమెజాన్ తదుపరి తరం ఏఐ అసిస్టెంట్ ‘అలెక్సా+’కు సపోర్ట్ చేస్తాయి. ఇక ప్రైవసీకి పెద్దపీట వేస్తూ.. కెమెరాను మూసివేయడానికి ఫిజికల్ షట్టర్, మైక్రోఫోన్‌ను ఆఫ్ చేయడానికి బటన్‌ను వీటిలో అందిస్తున్నారు. వైఫై 6ఈ సపోర్ట్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వీటి ప్రత్యేకతల విషయానికి వస్తే.. అమెజాన్ ఎకో షో 11లో అతిపెద్ద స్క్రీన్, మెరుగైన ఆడియోను పొందుపరిచారు. 11 అంగుళాల ఫుల్హెచ్డీ టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ గ్లాస్డిజైన్తో వస్తున్నది. అమెజాన్ ఏజెడ్3 ప్రో చిప్సెట్తో ఏఐ పనులను మరింత వేగంగా చేయగలుగుతుంది. ఇందులోని 13 ఎంపీ సెంట్రల్ కెమెరా.. సరికొత్త ‘ఆటో-ఫ్రేమింగ్’ ఫీచర్‌తో వస్తున్నది.
వీడియో కాల్స్ సమయంలో మీరు కదులుతున్నా.. మిమ్మల్ని ఫ్రేమ్ మధ్యలోనే ఉంచడం దీని ప్రత్యేకత. ఇక సంగీత ప్రియుల కోసం.. ఆడియో సిస్టమ్‌లో పెద్ద మార్పులే తీసుకొచ్చింది. స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో శక్తిమంతమైన బాస్ కోసం ప్రత్యేక వూఫర్ను ఏర్పాటు చేసింది. ఇక పాత ఎకో షో 8 మోడల్‌ను మరింత మెరుగుపరిచి.. సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది అమెజాన్ సంస్థ. ఇందులో 8.7-అంగుళాల హెచ్డీ డిస్ప్లేను ఏర్పాటు చేసింది. గదిలోని పరిస్థితులను బట్టి సౌండ్‌ను సర్దుబాటు చేసుకుంటుంది. పాత వెర్షన్ కంటే స్పష్టమైన వాయిస్, మెరుగైన బాస్‌ను అందిస్తుంది. ఇక ఇందులో బిల్ట్-ఇన్ స్మార్ట్ హోమ్హబ్ (జిగ్బీ, మ్యాటర్, థ్రెడ్ సపోర్ట్) ఉంది. దీనివల్ల ఇతర స్మార్ట్ పరికరాలను నేరుగా కనెక్ట్ చేయవచ్చు. ఆటో ఫ్రేమింగ్‌తో కూడిన 13 ఎంపీ కెమెరాతోపాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచింది. ఎకో షో 11 ధర రూ.26,999 ఉండగా.. ఎకో షో 8 (నాలుగో తరం) సుమారు రూ.23,999లకు లభించనున్నది.