మాది కర్ణాటకలోని సకలేశ్పుర. చిన్నప్పటినుంచీ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకున్నా. ఊటీలో ప్రారంభమైన నా చదువు మైసూరు, మంగళూరు, బెంగళూరులో కొనసాగింది. బాల్యం నుంచే నటన అంటే ఆసక్తి, నటులంటే చాలా అభిమానం. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనేది నా ఆశ. అందుకోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో.. మా కజిన్ ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కడ ఓ ఫ్రెండ్ సీరియళ్లలో ప్రయత్నించమని సలహా ఇచ్చింది. తాను నిర్మిస్తున్న ఓ సీరియల్లో కొత్త హీరో ముఖం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పింది. అలా అనుకోకుండా వెళ్లాను, వెంటనే ఎంపికయ్యాను. దాంతో ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే ‘లక్ష్మీబారమ్మా’ అనే కన్నడ సీరియల్లో తొలిసారి నటించా. ఆ తర్వాత మళ్లీ చదువుల మీద దృష్టిపెట్టాను.
‘పున్నాగ’ ద్వారా తెలుగులోకి..
ఎంబీఏ చేస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓ తెలుగు సీరియల్ కోసం పిలుపు వచ్చింది. అప్పటికి చదువు మధ్యలో ఉంది. ఏం చేయాలో తోచలేదు. చివరికి నటనవైపే మొగ్గాను. ఎంబీఏ వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. తెలియని భాష, ప్రాంతం, మనుషులు.. అయినా నన్ను నేను నిరూపించుకోడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. అలా ‘పున్నాగ’ ద్వారా తెలుగువారి ముందుకొచ్చా. ఆ సీరియల్తో చాలా మంచిపేరు వచ్చింది. కన్నడలోనూ, తెలుగులోనూ వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం జీ తెలుగు ‘అగ్నిపరీక్ష’లో నటిస్తున్నా. ఒకే పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించే అవకాశం ఉన్న మంచి వేదిక సీరియల్. ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే సినిమాల్లోనూ చేయాలని ఉంది.
ఎంతో ప్రత్యేకం..
మొదట్లో తెలుగులో డైలాగ్స్ పలకడానికి చాలా ఇబ్బంది పడేవాణ్ని. కానీ ఇప్పుడు, నాకే ఆశ్చర్యం వేసేంత బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నా. ఇకపై ఇదే నా భాష, ఇక్కడే నా ఇల్లు. తెలుగు వినడానికి, మాట్లాడటానికి ఎంతో బాగుంటుంది. మొదట్లో ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే, భయంతోపాటు ఆనందమూ కలిగేది. ఇప్పుడు అంతా అలవాటైపోయింది. అన్ని జానర్ల సినిమాలు చూస్తుంటాను. తెలుగులో మహేశ్ బాబు, సమంత నటన అంటే ఇష్టం.
కుటుంబమే బలం..
మాకు కాఫీ ఎస్టేట్ ఉంది. నాన్నతోపాటు అన్నయ్య వ్యాపారం చూసుకుంటాడు. అమ్మ గృహిణి. నచ్చిన కెరీర్ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చారు అమ్మానాన్న. సీరియళ్లలో నటించడం మొదలుపెట్టాక, ఇంకా మంచిమంచి పాత్రలు చేయమని ప్రోత్సహిస్తున్నారు. ప్రేమ, పెండ్లి అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశాలే. ఎవరో చెప్పారనీ, ఎవరో ఏదో అనుకుంటారనీ పెండ్లి చేసుకోకూడదు. బంధాన్ని పెంచుకుని, ఆనందంగా జీవించేందుకు అన్ని రకాలుగా సిద్ధపడ్డాకే పెండ్లి చేసుకోవాలి. వివాహం ఒక బాధ్యత. మన జీవితంలోకి వచ్చేవారిని ఎప్పుడూ బాధపెట్టకుండా, బాధ్యతగా మెలగాలనేది నా ఉద్దేశం.