బీపీ, షుగర్ తరువాత ఎక్కువగా వినిపించే రుగ్మత థైరాయిడ్! ఈ సమస్య మహిళల్లోనే అధికంగా కనిపిస్తుంది. మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక ప్రధానమైన గ్రంథినే థైరాయిడ్ అంటారు. దీని నుంచి థైరాయిడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మానవ శరీర జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎదగడానికి.. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, ఎత్తు పెరగడానికి, బాలికల్లో అయితే రజస్వల కావడానికి, స్త్రీలలో నెలసరి, గర్భం దాల్చడం ఇలా అనేక జీవక్రియల్లో పాలుపంచుకుంటాయి. థైరాయిడ్‌లో సమస్య ఉత్పన్నం అయితే.. ఈ జీవక్రియలన్నీ గాడితప్పే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించే ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ ట్యూమర్స్ ఏర్పడితే.. గతంలో వాటిని మందులతో కాకుండా శస్త్రచికిత్స ద్వారా తొలగించేవారు. ఇప్పుడు ఎలాంటి కోత లేకుండా థైరాయిడ్ గ్రంథిపై ఏర్పడిన కణితిని సులభంగా తొలగించవచ్చు. అయితే ఆపరేషన్ లేకుండా కణితులను ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారు? ఎలా తొలగిస్తారు? ఎలాంటి వాటిని తొలగించవచ్చు? శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ ఆధునిక పద్ధతి వల్ల కలిగే లాభాలేంటి? తదితర అంశాలను నేటి ‘ఊపిరి’లో తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదన్నా, బాలికలు సరైన వయసులో రజస్వల కాలేదన్నా, మహిళలు గర్భం దాల్చడంలో అవరోధాలు ఏర్పడుతున్నా.. థైరాయిడ్ సమస్య కారణం కావచ్చు. అందుకే గర్భధారణ సమస్యలతో వచ్చినవారికి మొట్టమొదటగా థైరాయిడ్ పరీక్షలు చేయిస్తుంటారు వైద్యులు. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో ప్రధానంగా మూడురకాల సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొదటిది హైపో థైరాయిడ్, రెండోది హైపర్ థైరాయిడ్, మూడోది థైరాయిడ్ ట్యూమర్స్. హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలను మాత్రలతో నియంత్రించవచ్చు. కానీ, థైరాయిడ్ ట్యూమర్స్.. అంటే కణితులను మాత్రం ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అంటే గొంతు దగ్గర చిన్నపాటి కోతపెట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గొంతుపై కోత పెట్టిన మరక ఏర్పడటంతోపాటు రోగి మూడు నాలుగు రోజులపాటు దవాఖానలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా నొప్పి, ఇతరత్రా కారణాల వల్ల రోగి కోలుకునేందుకు కొంత సమయం కూడా పడుతుంది. వీటన్నిటినీ అధిగమించి, ఎలాంటి కోత లేకుండా థైరాయిడ్ గ్రంథిపై ఏర్పడిన కణితిని సులభంగా తొలగించే చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది.

థైరాయిడ్ గ్రంథిపై ఏర్పడే కణితులే.. ట్యూమర్స్. ఇవి ఏర్పడటం వల్ల గొంతు భాగంలో వాపు రావడం లేదా గడ్డ ఏర్పడటం కనిపిస్తుంది. 20 నుంచి 40 ఏండ్ల వయసున్న మహిళల్లో ఇవి రావడం సర్వసాధారణమని చెప్పవచ్చు. ఈ కణితులు రెండు రకాలుగా ఉంటాయి.
1. సాధారణ ట్యూమర్స్. వీటినే బినైన్ ట్యూమర్స్ అని కూడా అంటారు.
2. క్యాన్సర్ ట్యూమర్స్.
గొంతు వద్ద వాపు లేదా గడ్డలాగా వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. ఇందులో వచ్చిన గడ్డ లేదా కణితి.. క్యాన్సర్ గడ్డనా? లేక బినైన్.. అంటే నాన్ క్యాన్సర్ గడ్డనా? అనేది తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్కానింగ్ చేసినప్పుడు సరిగ్గా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు సూది పరీక్ష చేస్తారు. దీనినే వైద్యపరిభాషలో ఎఫ్ఎన్ఏసీ (ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ) టెస్ట్ అంటారు. ఈ ప్రక్రియలో స్కాన్ చేస్తూనే ఒక చిన్న నీడిల్ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తారు. ఇందులో రోగికి ఏర్పడింది నాన్ క్యాన్సర్ గడ్డనా లేక క్యాన్సర్ గడ్డనా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే థైరాయిడ్ ట్యూమర్స్ వచ్చిన బాధిత రోగుల్లో 95 శాతం మందికి నాన్ క్యాన్సర్ ట్యూమర్సే ఉంటాయి. థైరాయిడ్ గ్రంథిపై క్యాన్సర్
కణితులు చాలా అరుదుగా.. 5 శాతం లోపు మందిలో మాత్రమే ఏర్పడే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ కణితి ఏర్పడిన రోగులకు సూది పరీక్ష చేసినప్పుడు అది నాన్ క్యాన్సర్ అని నిర్ధారణ జరిగితే.. వారికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. కేవలం రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ
ఫాలోఅప్‌లో ఉంటే సరిపోతుంది.
థైరాయిడ్ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా గొంతు వద్ద చిన్నపాటి కోత పెట్టి థైరాయిడ్ గ్రంథిపై ఏర్పడిన కణితిని తొలగిస్తారు. కొన్ని సందర్భాలలో కణితితోపాటు ఆ థైరాయిడ్ గ్రంథి మొత్తం తొలగించాల్సి రావొచ్చు.
నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా చికిత్స చేయడం. ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో మూడు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో 1.మైక్రోవేవ్ ఆబ్లేషన్ 2. రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ 3. ఇథనాల్ ఆబ్లేషన్. అయితే అన్నిరకాల థైరాయిడ్ గడ్డలకు ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేయడం కుదరదు. కేవలం బినైన్.. అంటే నాన్ క్యాన్సర్ గడ్డలున్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ చికిత్స చేయాలంటే రోగికి అల్ట్రాసౌండ్ పరీక్షలోనూ, ఎఫ్ఎన్ఏసీ సూది పరీక్షలోనూ అది నాన్ క్యాన్సర్ గడ్డ అని నిర్ధారణ కావాలి. అంతేకాకుండా కణితి పరిమాణం 3-4 సెం.మీ. మేరకు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేసే వీలుంటుంది.
థైరాయిడ్ గ్రంథిపై ఏర్పడిన కణితి పరిమాణం 4 నుంచి 5సెం.మీ. ఉండటమే కాకుండా అందులో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు చికిత్సను రెండు దశలుగా చేస్తారు. మొదటి దశలో ఇథనాల్ అనే రసాయన పదార్థాన్ని నీడిల్ ద్వారా ఇంజక్ట్ చేస్తారు. దీనివల్ల గడ్డలోని నీటి శాతం తగ్గిపోయి, గడ్డ పరిమాణం 2 లేదా 3 సెం.మీలకు తగ్గుతుంది. ఈ చికిత్స చేసిన నెల లేదా రెండు నెలల తరువాత మిగిలిపోయిన కణితి భాగాన్ని మైక్రోవేవ్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతిలో కాల్చివేస్తారు. ఈ పద్ధతి వల్ల థైరాయిడ్‌ను డీటెండ్ చేసుకోవచ్చు. హార్మోన్లను రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. భవిష్యతులో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాదు.
నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ విధానంలో ఒక చిన్నపాటి నీడిల్‌ను థైరాయిడ్ గ్రంథిపై ఉన్న కణితిపైకి పంపించి, అల్ట్రాసౌండ్ స్కాన్‌లో చూస్తూ ఆ కణితిలోని కణాలను కాల్చివేస్తారు. ఈ ప్రక్రియలో థైరాయిడ్ గ్రంథికి ఎలాంటి హాని కలగదు. ఈ చికిత్స తరువాత ఎలాంటి మాత్రలు వాడాల్సిన అవసరం ఉండదు. శస్త్రచికిత్స పద్ధతితో పోల్చితే ఈ నాన్ సర్జికల్ విధానంలో రోగికి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కోత లేని చికిత్స కావడం వల్ల గొంతుపై ఎలాంటి గాటు మరక ఏర్పడదు. అంతేకాకుండా ఈ చికిత్సను డేకేర్లోనే.. అంటే ఉదయం వస్తే సాయంత్రానికల్లా పంపించేస్తారు. దవాఖానలో అడ్మిట్ కావల్సిన అవసరం రాదు. కోత ఉండనందున ఎలాంటి నొప్పి కూడా ఉండదు. దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటాడు.