అమ్మానాన్న ఒప్పుకోకపోయినా నటనపై ఉన్న అభిమానంతో బుల్లితెరకు పరిచయమైన నటి తన్వియా. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌తో అలరిస్తున్న తన్వియా సినిమాల్లోనూ నటించింది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ మీదున్న ఇష్టంతో స్టేజ్ షోలు చేసిన తన్వియా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది.
సీరియల్స్‌లో నటించే అవకాశం రావడంతో నటిగా మారిన ఈ కన్నడ బ్యూటీ అటు కన్నడ పరిశ్రమలోనూ ఇటు తెలుగులోనూ వరుస అవకాశాలతో రాణిస్తున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ఎన్నాళ్లో వేచిన హృదయం’ సీరియల్లో త్రిపురగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తన్వియా జిందగీతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మాది కర్ణాటకలోని మండ్య. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అక్కలిద్దరి పెళ్లిళ్లయ్యాయి. పెద్దక్కకు నా చిన్నప్పుడే పెళ్లవడంతో తనతో నాకు అనుబంధం తక్కువ. చిన్నక్క, నేను టామ్ అండ్ జెర్రీలా ్ల కొట్టుకునేవాళ్లం. మంచి స్నేహితులం కూడా. నిజానికి నా పేరు తన్వియా కాదు. చిన్నప్పుడు లత అని పెట్టారు. కానీ, స్కూల్లో ఉన్నప్పుడు నా పేరు మార్చుకోవాలనిపించింది. నా స్నేహితురాలు తనకు ఇష్టమని తన్వియా అని నాకు పేరు పెట్టింది. మాది మధ్యతరగతి కుటుంబం. బాల్యం అంత సజావుగా ఏం సాగలేదు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో అమ్మానాన్న ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాళ్లు.
చదువులో ర్యాంక్ స్టూడెంట్‌ని కాదు కానీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌నే. చదువుకంటే కూడా డ్యాన్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే స్కూల్లో, కాలేజీలో నిర్వహించే ప్రతి ప్రోగ్రామ్‌లో తప్పకుండా ప్రదర్శన ఇచ్చేదాన్ని. ఆ ఇష్టమే డ్యాన్స్‌ను కెరీర్‌గా మార్చుకునేలా చేసింది. మా నాన్నకు నేను డ్యాన్స్ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఆడపిల్లకు చదువు, ఉద్యోగమే ముఖ్యమని భావించేవారు. అందుకే సినిమాల్లోకి వస్తానంటే ఒప్పుకోలేదు. కానీ, నాన్న మాట కాదని బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఒక టీమ్‌లో జాయినయ్యా.
దాదాపు వెయ్యికి పైగా స్టేజ్ షోస్ ఇచ్చాను. సినిమాల్లోనూ డ్యాన్సర్‌గా చేశాను. అప్పుడే కలర్స్ కన్నడలో సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే చాలా సినిమాలకు, సీరియల్స్‌కు ఆడిషన్స్ ఇచ్చాను. కానీ, ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోవడంతో నమ్మకం కోల్పోయా. నాలుగైదు లుక్ టెస్ట్‌ల తర్వాత 2022లో ‘అంతర్పట’ అనే కన్నడ సీరియల్లో మొదటి అవకాశం వచ్చింది. అందులో నటించే సమయంలోనే తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, అది పూర్తయిన తర్వాతే ఒప్పుకొందామనుకున్నా. ఆ సీరియల్ పూర్తయిన కొద్దిరోజుల్లోనే జీ తెలుగు నుంచి ‘ఎన్నాళ్లో వేచిన హృదయం’ సీరియల్లో అవకాశం వచ్చింది. కథ వినగానే నచ్చడంతో వెంటనే ఒప్పుకొన్నా. మొదట్లో తెలుగు రాకపోవడంతో చాలా ఇబ్బందిపడేదాన్ని. కానీ టీమ్ సపోర్ట్‌తో త్వరగానే నేర్చుకోగలిగా. స్పష్టంగా మాట్లాడలేకపోయినా తెలుగు అర్థం చేసుకోగలను.
హీరోయిన్ రష్మికా మందన్నా అంటే చాలా ఇష్టం. పుష్ప సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా నచ్చింది. గ్లామర్ కంటే నటనకు ఆస్కారం ఉండే పాత్రల్లో నటించాలనుకుంటున్నా. డ్యాన్సర్‌గానూ రాణించాలనుకుంటున్నా. నాన్న మాట కాదన్నప్పటికీ నాకు నచ్చిన పనిని కెరీర్‌గా ఎంచుకుని విజయవంతంగా రాణిస్తున్నాననే సంతృప్తి ఉంది. అమ్మానాన్నలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. స్నేహితులు, బంధువులు అందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు.
నా బెస్ట్ ఫ్రెండ్ వినోద్. చాలా సపోర్ట్ చేస్తాడు. అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నటిగా సంతోషంగా ఉన్నాను. చాలామంది కొన్ని సందర్భాల్లో నా దగ్గరకి వచ్చి నేను చేసిన పాత్రల గురించి చెబుతూ ఏడుస్తూ ఉంటారు. నేను చాలా ఎమోషనల్ అవుతా. అంతగా ప్రేమించే అభిమానులు ఉండటం నిజంగా నా అదృష్టం. ఇంటికి రమ్మని కూడా ఆహ్వానిస్తారు. అలాంటి సందర్భాల్లో చాలా సంతోషంగా ఉంటుంది.
చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేదాన్ని, కానీ పెరుగుతున్న కొద్దీ ఇంట్లో పరిస్థితుల కారణంగా ఇంట్రావర్ట్‌గా మారిపోయా. ఇప్పుడు మళ్లీ అందరితో కలవడానికి నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా. ఒంటరిగా ప్రయాణం చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ఆదర్శవంతమైన వ్యక్తుల జీవితకథల్ని వినడం ఇష్టం. కర్ణాటకలో దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలను చూశాను. థాయ్‌లాండ్ కూడా వెళ్లాను. ప్రకృతి అంటే చాలా ఇష్టం. పచ్చని పరిసరాల్లో గడపడం, ట్రెక్కింగ్ అంటే ఆసక్తి. భవిష్యత్తులో అమెరికా, పారిస్‌తోపాటు ప్రపంచమంతా చుట్టేయాలని ఉంది.