Shruti Haasan | తాము సెలెబ్రిటీల వారసులమైనా.. సాధారణ పిల్లల్లాగే పెరిగామని చెబుతున్నది శృతి హాసన్. అందుకే.. పెద్ద ఇల్లు, చుట్టూ ఎన్నో కార్లు ఉన్నా.. వాటిని చూసి తామెప్పుడూ గర్వాన్ని ప్రదర్శించేవాళ్లం కాదని అంటున్నది. అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్-సారిక దంపతుల గారాలపట్టి అయిన శృతి ఇటీవల ఒక ఆన్లైన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, తన బాల్యంతోపాటు తల్లిదండ్రులు నేర్పించిన విలువల గురించి చెప్పుకొచ్చింది.
‘చిన్నప్పటి నుంచే మా చుట్టూ క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. ‘పాకెట్ మనీ’ అనే కాన్సెప్ట్ మా ఇంట్లోనే లేదు. అన్నీ మేమే సంపాదించుకోవాలి. ‘ఇంత పెద్ద ఇల్లు. ఇన్ని కార్లతో పిల్లలు చెడిపోతారు..’ అని మా అమ్మ ఎప్పుడూ భయపడేది. అందుకే, మేమంటే ఎంత ప్రేమగా ఉండేదో.. అంతే కఠినంగా వ్యవహరించేది!’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా.. తన బాల్యంలో జరిగిన ఒక సరదా సంఘటననూ పంచుకున్నది.
‘ఎవరి బర్త్‌డే అయినా.. మా స్నేహితులంతా ఫ్యాన్సీ చాక్లెట్లు పంచేవారు. ఓసారి నా పుట్టినరోజు నాడు మాత్రం.. మా అమ్మ బెల్లం-పల్లీలతో చేసిన చిక్కీ లడ్డూలను పంపించింది. వాటిని చూసిన నా స్నేహితులంతా నవ్వుకున్నారు. ‘మీ నాన్న సినిమా హీరో అని చెబుతావు కదా!? మరేంటి ఇలాంటి స్వీట్ తీసుకొచ్చావు?’ అంటూ ఎగతాళి చేశారు’ అని చిన్ననాటి సంగతిని పంచుకుంది శృతి హాసన్. ‘ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఎదురైనా.. వాటన్నిటిలోనూ మాపై అమ్మకు ఉండే ప్రేమ, బాధ్యతే కనిపించేది!’ అని అంటున్నది.
ఇక చిత్రసీమలో తన ఎదుగుదలకు తండ్రి కమల్ హాసన్ పేరును ఎక్కడా వాడుకోలేదని వెల్లడించింది. ‘నా ఇంటిపేరు నాకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మాట వాస్తవమే! కానీ, అది కేవలం అప్పుడప్పుడూ విమానాశ్రయాలలో క్యూలైన్లను తప్పించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది’ అని తెలిపింది. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘హేరామ్’ చిత్రంలో అతిథి పాత్రతో తెరంగేట్రం చేసిన శృతి.. ఒక దశలో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి నటిస్తున్నది.