“నీలాల నింగి నుంచి తొంగిచూసే చందమామతో మాటకలిపినా, మనసిచ్చినా.. చల్లగా నవ్వడమే తప్ప తిరిగి మాట్లాడదే! ఊరడించడానికైనా ‘ఊ..’ అనదే! అందంగా ఉందని ఎంత బెట్టో”.. అంటూ బుంగమూతి పెట్టుకునేవాళ్లెందరో. అలాంటి వారికి అచ్చంగా ఆ జాబిలమ్మే నేల మీదికి దిగొచ్చిందా అనిపించేలా కనిపిస్తుంది.. అందాల కథానాయిక మేఘా ఆకాశ్.
నిండు నీలం రంగు కాటన్ వస్త్రం మీద చమ్కీలతో జరీవర్క్ చేసిన చుడీదార్, దానిమీద అర్ధచంద్రాకారపు కట్ వర్క్ దుపట్టా ఆమె సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. వీటికి జతగా కుందన్లు, తెల్ల పూసలు పొదిగిన పెద్దపెద్ద దుద్దులు మహా ముద్దుగా మురిపిస్తున్నాయి. నుదుట నల్లబొట్టు.. ‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి’ అంటూ దిష్టి తీస్తున్నట్టు కనిపిస్తున్నది. ‘లై’తో తెరంగేట్రం చేసిన ఈ భామ ఇప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ తెలుగు వాకిట తెగ అల్లరి చేస్తున్నది!