Gauri Spratt | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డాడు. రీనా దత్తా, కిరణ్ రావుతో వివాహబంధానికి ముగింపు పలికిన ఈ బాలీవుడ్ టాప్‌హీరో.. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖానే వెల్లడించాడు. తాజాగా తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు.
ఈ సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ సహా, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌తో స్నేహం.. ఇలా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “గౌరీ, నేను పాతికేళ్లుగా స్నేహితులం. ఏడాది కాలంగా ఇద్దరం డేటింగ్లో ఉన్నాం!” అంటూ వెల్లడించాడు. దాంతో, ‘ఎవరీ గౌరీ?’ అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆమె వివరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్.. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో పనిచేస్తున్నది. ఫ్యాషన్ కోర్సుతోపాటు లండన్ యూనివర్సిటీలో స్టయిలింగ్ అండ్ ఫొటోగ్రఫీ ట్రైనింగ్ తీసుకుంది గౌరి. గతంలోనే ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్ల కిందే అతనితో విడిపోయింది.
ప్రస్తుతం తన ఆరేళ్ల కొడుకుతో కలిసి బెంగళూరులోనే ఉంటున్నది. ఈమె తల్లి కూడా సెలెబ్రిటీ స్టయిలిస్ట్. వీరికి బెంగళూరు, ముంబయి నగరాల్లో సెలూన్లు ఉన్నాయి. ఏడాదిన్నరగా డేటింగ్లో ఉన్న ఆమిర్ – గౌరి బంధానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయట. దాంతో.. తమ బంధం గురించి బయటపెట్టాడు ఆమిర్. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే.