చిన్నదైనా.. పెద్దదైనా ప్రస్తుతం ప్రతి వంటగదిలోనూ ‘సింక్’ కంపల్సరీ అయిపోయింది. అయితే, దీనిని సరిగ్గా నిర్వహించకుంటే.. భరించలేని దుర్వాసనను వెదజల్లుతుంది. బొద్దింకలు, వివిధ రకాల కీటకాలు, వైరస్‌లకు ఆవాసంగా మారిపోతుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే..సింక్ కొత్తదాని లాతళతళలాడుతుంది.
నిమ్మకాయ: సింక్‌కు పట్టిన జిడ్డును వదిలించడంలో నిమ్మకాయ నమ్మదగినది. ఒక కప్పు నిమ్మ రసానికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలపండి. ఈ మిశ్రమాన్ని సింక్ మీద పోసి బాగా రుద్దండి. అరగంట సేపు అలాగే వదిలేసి, ఆ తర్వాత కడిగేస్తే.. సింక్ కొత్తదానిలా మెరిసిపోతుంది. దుర్వాసన దూరమై.. సువాసనలు వెదజల్లుతుంది. రసం పిండిన నిమ్మకాయ తొక్కలకు ఉప్పును కలిపి కూడా సింక్‌ను తళతళలాడించొచ్చు.
వెనిగర్: సింక్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడంలో వెనిగర్ బెస్ట్ చాయిస్. ఒక కప్పు నీటిలో మూడు కప్పుల వెనిగర్ వేసి.. ఇక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ, కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో సింక్‌ను శుభ్రంగా కడిగితే.. దుర్వాసన ఇట్టే మాయమవుతుంది. సింక్‌పై ఉండే మరకలు, మురికి కూడా వదిలిపోతుంది.
పిప్పరమెంట్ ఆయిల్ : సింక్ నుంచి వచ్చే చెడువాసనను వదలగొట్టడంలో పిప్పరమెంట్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. ఓ స్ప్రే బాటిల్‌ను తీసుకొని.. అందులో కొద్దిగా నీరు, 10 చుక్కల పిప్పరమెంట్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని సింక్‌పై స్ప్రే చేస్తే చాలు.. సింక్ నుంచి వచ్చే దుర్వాసన ఇట్టే మాయమై పోతుంది.