‘సంగీతం నువ్వైతే.. సాహిత్యం నేనవుతా..’ అప్పుడెప్పుడో ఆకలి రాజ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురింపజేసిన పాట ఇది. ఆత్రేయ రాసిన ఈ పదాలను ఇప్పటి జెన్ జెడ్ తెగ ఫాలో అవుతున్నది. పదాలు రాయకున్నా, స్వరాలు కూర్చకున్నా.. మనసుకు నచ్చిన పాటలతో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి డేటింగ్ జర్నీకి శ్రీకారం చుడుతున్నారు వీళ్లు. క్రష్‌తో ఖుషీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. రింగ్‌టోన్ వినేసి అట్రాక్ట్ అవుతున్నారు. డయలర్ టోన్కే ఫిదా అవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మ్యూజిక్ టేస్ట్ ఒకేలా ఉంటే చాలు కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అవుతుందని ఫిక్సవుతున్నది జెన్ జెడ్.
మీరు డేటింగ్ చేస్తున్నారా? మీ క్రష్‌తో కనెక్ట్ కావడానికి మ్యూజిక్ బెస్ట్ వే అని తెలుసా? టిండర్ డేటా ప్రకారం.. ఒకే మ్యూజిక్ టేస్ట్ ఉంటే, కంపాటిబిలిటీ పక్కాగా కుదురుతుందట! అంతేకాదు.. ఇప్పుడు మ్యూజిక్ వీరికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతున్నదట. అవును, జనరేషన్ జెడ్‌కి మ్యూజిక్ ఒక కొత్త లవ్ లాంగ్వేజ్‌గా మారింది. డేటింగ్ ప్రొఫైల్స్ నుంచి కలిసి తయారు చేసుకునే ప్లేలిస్ట్ వరకు.. ప్రతిచోటా మ్యూజిక్ హవా నడుస్తున్నది. మాటల్లో చెప్పలేని భావాలను మ్యూజిక్ ద్వారా ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. భారతీయ జెన్-జీ టాప్ ఫైవ్ ఇంట్రెస్ట్స్లో మ్యూజిక్ ఒకటని తేలింది. ఒకే మ్యూజిక్ టేస్ట్ ఉన్నవారు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. మ్యూజిక్ టేస్ట్‌ని బట్టి అవతలి వ్యక్తి పర్సనాలిటీ, కంపాటిబిలిటీని అర్థం చేసుకోవచ్చని 35 శాతం మంది వక్కాణించారు. ఈ ఫిల్టర్డ్ ప్రపంచంలో, మ్యూజిక్ టేస్ట్ మీ ఇన్నర్ ఫీలింగ్స్‌ని బయటపెట్టేస్తుందని వీళ్లు బలంగా నమ్ముతున్నారు.
ప్లేలిస్ట్ కేవలం పాటల కలెక్షన్ మాత్రమే కాదు, అది మీ పర్సనాలిటీని కూడా చెబుతుంది! టిండర్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ చెబుతున్న ప్రకారం…‘మ్యూజిక్ కేవలం మూడ్‌ను చూపించదు. అది మీ ఎమోషనల్ ఫీలింగ్స్‌కి అద్దం లాంటిది. టేస్ట్‌ను జడ్జ్ చేయడం కాదు.. ఏది వాళ్లకు కనెక్ట్ అవుతుందో గమనించడం ముఖ్యం!! ‘పాటల్లోని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, టెంపో, ట్యూన్ మనకు ఒక పర్సనాలిటీని ఇస్తాయి. ఎలాగంటే.. హై-ఎనర్జీ పాటల్ని ఇష్టపడేవాళ్లు ప్రేమలో బోల్డ్‌గా ఉంటారట. మెలోడీ పాటలకు మైమరిచిపోయేవాళ్లు ఎమోషనల్ సేఫ్టీ కోసం చూస్తారని టిండర్ డేటా చెబుతున్నది. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లవర్స్ స్పాంటేనిటీని కోరుకుంటే.. సింగర్స్, లిరిక్ రైటర్స్‌ను ఇష్టపడే బ్యాచ్ ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఇస్తారట! అదీ మ్యాటర్!!
నేటి తరం మ్యూజిక్ యాప్స్ చూస్తే.. ప్రతి ఒక్కరికీ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. యంగ్ జనరేషన్లో, కంపాటిబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి ప్లేలిస్ట్‌ను స్వాప్ చేసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది! వీళ్లంతా ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్‌ను ‘సెల్ఫ్-ఆదర్డ్ మూడ్ బోర్డ్’ అని పిలుచుకుంటున్నారు. మన ఫీలింగ్స్, ఎదుటివారికి ఎలా కనిపించాలని అనుకుంటున్నారో ప్లేలిస్ట్ చూపిస్తుంది. సో.. ఎవరి ప్లేలిస్ట్‌ని అయినా ఇష్టపడుతున్నారంటే.. మీరు వారికి పూర్తిగా కంపాటిబుల్ అని అర్థం. ఇది ఇద్దరి మధ్య వెంటనే కనెక్షన్‌ని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, ఇద్దరూ కలిసి ఒక ప్లేలిస్ట్‌ని తయారు చేసుకుంటున్నారు కూడా! పాటలను కలిసి క్యూరేట్ చేసుకోవడం అనేది మాటల ఒత్తిడి లేకుండా ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే ఒక ఇంటర్యాక్టివ్ వే అంటున్నారు సైకాలజిస్ట్‌లు. నేటి తరం లవ్‌బర్డ్స్‌కి మ్యూజిక్ ఒక ఎమోషనల్ షార్ట్‌హ్యాండ్ భాష లాంటిది. వాళ్లు ఏది చెప్పలేరో.. అది మ్యూజిక్ ద్వారా చెప్తారు. దేనికోసం ఆరాటపడుతున్నారు.. దేనికి భయపడుతున్నారు.. దేన్ని ఆకర్షించాలని ఆశిస్తున్నారు… ఇవన్నిటికీ ఇప్పుడు వారి భాష మ్యూజిక్కే. సో.. ఇద్దరు కలిసి ఒక ప్లేలిస్ట్‌ని క్యూరేట్ చేస్తున్నారంటే.. వారు కేవలం పాటలు పంచుకోవడం మాత్రమే కాదు… వారి ఎమోషనల్ కనెక్షన్‌ని కూడా మ్యాప్ చేసుకుంటున్నారని అర్థం.
కొన్నిసార్లు ఇద్దరూ ఒకే బీట్‌కి సింక్ అవ్వకపోవచ్చు. అభిరుచులు వేర్వేరుగా ఉండొచ్చు. అది చాలా కామన్! ఏం కంగారు పడొద్దు. సైకాలజిస్ట్‌లు చెబుతున్న ప్రకారం.. జెన్-జీకి మ్యూజిక్ అనేది ఎమోషనల్ లాంగ్వేజ్. టేస్ట్ క్లాష్ అవ్వడం అనేది డీల్ బ్రేకర్ కాదు. షేర్డ్ మ్యూజిక్ టేస్ట్ కంపాటిబిలిటీకి గ్యారెంటీ కాదుగానీ.. ఎమోషనల్ సేఫ్టీని మాత్రం పెంచుతుంది. మీ ప్లేలిస్ట్ అర్థమైనప్పుడు.. మీరు అర్థమైనట్టే అని ఫీల్ అవుతారు. ‘నిజమైన డీల్ బ్రేకర్ ఎప్పుడంటే.. మీ మ్యూజిక్ రిప్రెజెంట్ చేసే ఎమోషనల్ వరల్డ్‌ని ఎవరైనా తక్కువచేసి మాట్లాడినప్పుడు!! సో, మీ మ్యూజిక్ టేస్ట్ పట్ల రెస్పెక్ట్ ఇవ్వని వాళ్లు మీకు కరెక్ట్ కాదన్నమాట!