గర్భ సంస్కార థెరపీ!

లీలావతి గర్భంలోనే ప్రహ్లాదుడు నారాయణ మంత్రోపదేశం పొందాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశ తంత్రంతెలుసుకున్నాడు. గర్భిణుల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక పరిస్థితులు కూడా కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతాయనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇటీవల, బనారస్ హిందూ యూనివర్సిటీ అనుబంధ వైద్యశాలలో వేదాలూ, పురాణాలలోని ప్రస్తావనల ఆధారంగా.. కాబోయే తల్లుల కోసం ‘గర్భ సంస్కార థెరపీ’ని ప్రారంభించారు.
గర్భిణుల సంరక్షణ మన సంస్కృతిలో కీలకమైంది. ఒకప్పుడు అయితే.. ఆ కాబోయే తల్లి ఎవరి సమక్షంలో ఉండాలో, ఎవరి సమక్షంలో ఉండకూడదో, ఏ సాహిత్యం చదవాలో, ఏది చదవకూడదో.. అన్నీ ముందుగానే నిర్ణయించేవారు. ఆమె గదిని ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసేవారు. ప్రతీ క్షణం ఆహ్లాదంగా ఉంచేందుకు ప్రయత్నించేవారు. కోపం, దుఃఖం లాంటి నెగెటివ్ ఉద్వేగాలు ఆమెలో పొడసూపకుండా జాగ్రత్తపడేవారు. భాగవతం చదవాలి, దైవ చింతనలో గడపాలి, మంచి సంగీతం వినాలి... అంటూ సలహాలు ఇచ్చేవారు. తల్లి మనసు ప్రశాంతంగా ఉంటేనే, కడుపులోని బిడ్డ ఎదుగుదల బావుంటుందని పెద్దల భావన. దీనికి సంబంధించి వైద్యశాస్త్ర పరమైన ఆధారాలు లేకపోయినా, ఆయుర్వేదంలో ఆ ప్రస్తావన ఉందంటున్నారు వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన సర్ సుందర్ లాల్ హాస్పిటల్ ఆయుర్వేద ప్రొఫెసర్లు. ఆయుర్వేదంలో 16 రకాల సంస్కారాల గురించి ఉంది. వాటిలో ఒకటి గర్భ సంస్కారం. దాని ఆధారంగానే ‘గర్భ సంస్కార థెరపీ’ని అక్కడ ఆరంభించారు.
సద్గురు ‘థాయ్మాయ్'
బనారస్ విశ్వవిద్యాలయానికి ఈ ఆలోచన రాకముందే సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ తరహా కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ‘బిడ్డకు జన్మనివ్వడం అనేది మన సంప్రదాయంలో.. పునరుత్పత్తి ప్రక్రియ మాత్రమే కాదు, కొత్త తరాన్ని తయారు చేసే మహాకార్యం. భావి తరాలను రూపొందించడం అనే గొప్ప బాధ్యతను ప్రకృతి తల్లికి అప్పగించింది. మెరుగైన తరాల్ని సృష్టించాలంటే గర్భంలోని శిశువు, గర్భిణి.. ఇద్దరూ కూడా హాయిగా, ఆరోగ్యంగా ఉండాలి’ అంటారు సద్గురు. అందుకే, ఆయన గర్భిణుల కోసం ప్రత్యేక యోగ మార్గాన్ని అందించారు. అదే.. థాయ్మాయ్... అంటే మాతృత్వం. ‘2017లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాంలో మొత్తం 15 సెషన్లు ఉంటాయి. ఒక్కో సెషన్ ఒకటిన్నర నుంచి 2 గంటల వ్యవధిలో పూర్తవుతుంది. నిపుణుల పర్యవేక్షణలో థాయ్మాయ్ నేర్చుకుని, ప్రసవ సమయం వరకూ రోజూ సాధన చేయాలి.
గర్భంతో ఉన్నప్పుడు తల్లి సంతోషంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకే ఆమె శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా, ఎమోషనల్‌గా బలంగా ఉండాలి. తల్లి మానసిక, శారీరక స్థితిగతులను బ్యాలెన్స్ చేస్తుంది థాయ్మాయ్. దీన్ని ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే సాధన చేయాలి. థాయ్మాయ్ ప్రోగ్రాంలో యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ ప్రక్రియలు దశల వారీగా ఉంటాయి. గర్భవతులు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. థాయ్మాయ్ ప్రోగ్రాంలో భాగంగా పోషకాలతో కూడిన సాత్వికాహారం ఎలా తయారుచేసుకోవాలో కూడా నేర్పిస్తారు. ఆ తరువాత అదే ఆహారాన్ని కొనసాగించవచ్చు. థాయ్మాయ్ ప్రోగ్రాంలో చేరిన గర్భిణులందరికీ సీమంతం కూడా చేస్తారు.
‘యోగాసనాలు కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తాయి. దానివల్ల సహజ ప్రసవం సాధ్యం అవుతుంది. మొదటి వారంలో కుర్చీలో తప్ప కూర్చోలేనివాళ్లు, రెండోవారానికల్లా కింద కూర్చుని సాధన చేయగలుగుతారు. ప్రాణాయామం, ధ్యానం వల్ల మనో సమతౌల్యం సాధ్యమవుతుంది. అలజడులు, ఒత్తిళ్ల నుంచి బయటపడుతారు. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం.. థాయ్మాయ్ వల్ల తల్లి, బిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ వాటి మీద ధ్యాస పెట్టం. మాతృత్వంపై పూర్తిగా ధ్యాస పెడితే బిడ్డతో అనుబంధం బలపడుతుంది’ అంటారు సద్గురు. ‘రెండోసారి గర్భం దాల్చినప్పుడు థాయ్మాయ్ సాధన చేసినవాళ్లకు రెండు ప్రెగ్నెన్సీల మధ్య తేడా బాగా తెలుస్తుంది. మొదటిసారి సిజేరియన్ అయినప్పటికీ థాయ్మాయ్ సాధన వల్ల రెండోసారి సహజ ప్రసవం అయ్యే వీలుంటుంది. ప్రసవ వేదన కూడా ఎక్కువ కష్టపెట్టదు. సుఖ ప్రసవమవుతుంది’ అని చెబుతారు సద్గురు ఆశ్రమానికి చెందిన థాయ్మాయ్ శిక్షకులు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ‘సహజ సమాధి’
శ్రీశ్రీ రవిశంకర్‌జీ కూడా గర్భిణుల కోసం ఓ కోర్సు నిర్వహిస్తున్నారు. ఏ ధ్యానం అయినా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సహజ సమాధి మెడిటేషన్ కూడా అంతే. అయితే ఇది గర్భిణులకు ప్రత్యేకమైంది. దీనిలో ఒక మంత్రం ఇస్తారు. మనసులో నాలుగు స్థాయిలు ఉంటాయి.. చేతన (కాన్షియస్), అచేతన (అన్కాన్షియస్), అవచేతన (సబ్కాన్షియస్), సుచేతన (సూపర్ కాన్షియస్). మనం మాట్లాడిన మాటలు, రకరకాల మనుషులతో మన సంబంధాలు, వివిధ సంఘటనల పట్ల మన భావనలు.. అన్నీ మనసులోని పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. సాధారణంగా సబ్కాన్షియస్ స్థాయిలో అనవసరమైన ఆలోచనలు, భావాలు పేరుకుపోయి ఉంటాయి. సహజ సమాధి మెడిటేషన్ ద్వారా ఈ చెతనంతా తొలగిస్తారు. మెడిటేషన్‌తో కూడిన ఈ యోగా వల్ల మనసు ప్రశాంతమై, అనవసరమైన మెమరీ తొలగిపోతుంది. ఆ పాత వాసనల ప్రభావం కడుపులో బిడ్డ మీద పడకుండా ఉంటుంది. ఇన్ని కార్యక్రమాల సారాంశం ఒకటే.. కాబోయే తల్లి ప్రశాంతంగా, ఆనందంగా ఉంటే పండంటి బిడ్డ ఖాయం!
గర్భ సంస్కారం అంటే?
ఆయుర్వేదంలో ప్రసూతి వైద్యాన్ని ‘ప్రసూతి తంత్ర’గా వ్యవహరిస్తారు. ఇందులో భాగమే.. గర్భ సంస్కార థెరపీ. బిడ్డ గర్భంలో ఉండగానే అవలంబించే పేరెంటింగ్ విధానమిది. తల్లి మానసికంగా ప్రశాంతంగా ఉంటే.. బిడ్డ ఎదుగుదల ప్రక్రియ కూడా ఆరోగ్యంగా జరుగుతుంది. అందుకే గర్భిణులకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తారు. వారితో మంచి సాహిత్యాన్ని చదివిస్తారు. స్ఫూర్తిదాయకమైన, పాజిటివ్ దృక్పథాన్ని చాటే సీరియళ్లను చూపిస్తారు. ఆహారం, సంగీతం (శాస్త్రీయ, ఆధ్యాత్మిక సంగీతం), యోగా, జపం.. ఇందులో కీలకం. అశుభవార్తలు చెవిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శరీరానికి అనువైన ప్రత్యేక చేనేత దుస్తులనే ధరించమని చెబుతారు. గర్భస్థ శిశువుపై వీటి ప్రభావం ఎలా ఉందో శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలిస్తారు. ఇవన్నీ మన వేదాల్లో చెప్పినవే. వాటిని ‘గర్భ సంస్కార థెరపీ’ పేరుతో సర్ సుందర్ లాల్ హాస్పిటల్‌తో కలిసి అందుబాటులోకి తెచ్చింది ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటైన బనారస్ హిందూ యూనివర్సిటీ.