శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 20, 2020 , 23:20:50

ఓ కంట కనిపెట్టండి!

ఓ కంట కనిపెట్టండి!

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. ఏ స్థాయికి చేరుకున్నా.. వారి ఆనందానికి అడ్డుకట్టవేసే పరిస్థితులు అడుగడుగునా ఉంటాయి. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే దారిలో, బస్సులో, ఆఫీస్‌లో.. ఇంతి ఎదుర్కొనే ఇబ్బంది ఇంతింత కాదు. మర్యాదగా మాట్లాడుతూనే పాడు చూపులు చూసే వాళ్లుంటారు.  ఇలాంటి వారిని తొలిచూపులోనే పసిగట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మొహమాటానికి పోతే విపత్కర పరిస్థితులు ఎదురుకావచ్చు.

  • ఆఫీస్‌లో అయినా, మరెక్కడైనా వ్యక్తిగత విషయాలను అదేపనిగా చెప్పొద్దు. ఇంట్లో ఎవరుంటారు, ఎవరేం చేస్తుంటారు, ఇంట్లో సమస్యలు.. ఇలా ప్రతి విషయాన్నీ షేర్‌ చేసుకుంటూ పోతే.. మీ బలహీనతను అవతలి వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. గోప్యత పాటించాలి.
  • సహోద్యోగులతో ఎంత వరకు ఉండాలో.. అంత వరకే ఉండాలి. మెసేజ్‌లు, కాల్స్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వొద్దు. పరిధి దాటి సందేశాలు పంపిస్తుంటే సున్నితంగా వారించండి. అయినా పద్ధతి మార్చుకోకపోతే ఇంట్లోవారి సాయంతో హెచ్చరించండి. అయినా వినకపోతే పోలీసులను ఆశ్రయించాలి.
  • అయాచితంగా ఒకరు హెల్ప్‌ చేస్తున్నా, ప్రత్యేకంగా కేర్‌ తీసుకుంటున్నారంటే.. మీ నుంచి వారేదో ఆశిస్తున్నట్టే! ఇలాంటి అతి వ్యవహారాలకు ఆదిలోనే చెక్‌ పెట్టాలి.
  • ప్రతికూల పరిస్థితులను ముందుగానే పసిగట్టాలి. ప్రమాదం చెప్పి రాదు. అవతలి వారి ప్రవర్తనను పసిగట్టి ఎలాంటి వారో అంచనాకు రావాలి. ఎంత మంచివారైనా గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దు. ఏమాత్రం తేడాగా అనిపించినా పూర్తిగా దూరంగా పెట్టాలి.