శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 23:29:21

కుర్రాడు చెప్పిన దర్శకుడి కథ!

కుర్రాడు చెప్పిన దర్శకుడి కథ!

సినిమా అంటే..? అద్భుతమైన కథ, ఆజానుబాహుడైన కథానాయకుడు, అందమైన కథానాయిక, అడ్డంకులు సృష్టించే ప్రతినాయకుడు, అలరించే ఇతర పాత్రలు.. తెర మీద కనిపించేది వీళ్లే. కథను నడిపించేదీ వీళ్లే! కానీ, కథకు కచ్చితత్వాన్ని, ఆ పాత్రలకు ఔచిత్యాన్ని ఇచ్చేది మాత్రం దర్శకుడే! ఆ దర్శకుడి ఆలోచనలను అందిపుచ్చుకొని, అందరూ మెచ్చేలా తెరకెక్కించేది సాంకేతిక నిపుణులే!! కానీ, వారి  జీవితాల్లో గెలుపుల కన్నా మలుపులే ఎక్కువ. వాటికి అక్షర రూప మిచ్చాడో నూనూగు మీసాల కుర్రాడు. తొలి ప్రయత్నంలోనే ‘ద లవ్‌ హాజ్‌ బ్రేకప్స్‌. సినిమా డోన్ట్‌- కమర్షియల్‌ సినిమా’ పుస్తకంతో ఓ దర్శకుడి  జీవితాన్ని, అందులోని విభిన్న కోణాలనీ కండ్లముందు ఉంచాడు 18 ఏండ్ల చరణ్‌ నౌపాడ. ఈ యువ రచయితను ‘దోస్తానా’ పలకరించింది.

పద్దెనిమిదేండ్ల వయసులో ఏ కుర్రాడైనా చదువుల్లో బిజీగా ఉంటాడు. లేదంటే జాలీగా గడిపేస్తుంటాడు. హైదరాబాద్‌కు చెందిన చరణ్‌ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. సినిమాలంటే అతడికి వ్యామోహం. తెరమీద కనిపించే పాత్రలను చూసి ఎంతగా ముచ్చటపడేవాడో.. ఆ పాత్రలను అలా నడిపించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల పనితనం గురించి తెలుసుకొని అంతగా ఆశ్చర్యపోయేవాడు. సినిమాను అన్ని కోణాల్లోనూ చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇలా నేర్చుకున్న పాఠాలే తనని ఒక కథకుడిగా తీర్చిదిద్దాయి. 

అభిరుచికి తగ్గట్టుగా..

చరణ్‌ తండ్రి చిన్నాది సినిమా నేపథ్యమే. ఆర్ట్‌ డైరెక్టర్‌గా 70 సినిమాలకు పనిచేశాడు. తల్లి జ్యోతి గృహిణి. తన కొడుకు ఆలోచనలన్నీ సినిమాల చుట్టూ తిరుగుతున్నా తండ్రి ఎన్నడూ ఆక్షేపించలేదు ఆయన. కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ, తను పనిచేస్తున్న సినిమా సెట్‌లోకి కొడుకును అడుగుపెట్టనిచ్చేవాడు కాదు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు చరణ్‌. బుద్ధిగా చదువుకుంటూనే, తన అభిరుచికి తగిన వేదిక నిర్మించుకున్నాడు. ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసిన చరణ్‌.. సెలవుల్లో మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడంతో అతడి ఆశలకు బ్రేక్‌పడింది. మనసుకు నచ్చిన కథలు రాసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఓ ఫోన్‌ కాల్‌. అదే ఈ చిట్టిచిత్రాల దర్శకుడిని రచయితగా మార్చేసింది.

అభిప్రాయాలు మార్చాలని..

గత ఏప్రిల్‌లో ఓ రోజు యథాలాపంగా ఫోన్‌ చూస్తున్న చరణ్‌కు ఓ కాల్‌ వచ్చింది. ‘మేం నోషన్‌ ప్రెస్‌ నుంచి మాట్లాడుతున్నాం. ఏదైనా మంచి కథ రాస్తే పబ్లిష్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అన్నాడు అవతలి వ్యక్తి. ఆలోచిస్తానన్నాడు చరణ్‌. వారం తర్వాత మళ్లీ ఫోన్‌ వచ్చింది. ‘మొదట నేను పెద్దగా సీరియస్‌గా తీసుకున్నది లేదు. కానీ, మళ్లీ వాళ్లు సంప్రదించడంతో ఏదైనా రాయాలనుకున్నా. మామూలు కథలా కాకుండా, నాకు ఇష్టమైన సినిమా చుట్టూ కథ అల్లుదామని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు చరణ్‌. సినిమా విజయానికి తెరవెనుక ఉండి అహర్నిశలు పరితపించే సాంకేతిక నిపుణులు, దర్శకుల గురించి కథ రాయాలనుకున్నాడు. ఇదే విషయం తన స్నేహితులకు చెప్పాడు. ‘దర్శకుల గురించి రాస్తావా? సక్సెస్‌ ఉంటేనే దర్శకుడు. లేకుంటే ఎవరు గుర్తుపెట్టుకుంటారు?’ అని తేలికగా మాట్లాడారు. ఆ మాటలు చరణ్‌ని  ఆలోచింపజేశాయి. ‘కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌'గా అభివర్ణించే దర్శకుడిపై ఇలాంటి అభిప్రాయం ఉండటం ఆ యువకుడికి నచ్చలేదు. అందుకే తన కథలో దర్శకుడినే హీరోగా అనుకున్నాడు. డైరెక్టర్‌ జర్నీని హృద్యంగా అక్షరబద్ధం చేశాడు.

మనసులోని భావనలతో..

దర్శకుల గురించి రాయడం అనగానే పదిమంది దర్శకులను కలిసి, మాట్లాడి వారి లైఫ్‌ జర్నీని చెప్పలేదు చరణ్‌. తన మెదడును తొలిచిన భావనలన్నిటినీ అధ్యాయాలుగా మలిచాడు. దర్శకుడిని కేంద్రంగా చేసుకొని ఓ ఫిక్షన్‌ రాసుకొచ్చాడు. ‘దర్శకుడు కావాలనుకున్న ఓ వ్యక్తి ఇండస్ట్రీలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు. ఎన్ని ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. ఎంతమందిని నమ్మాడు. ఎందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఎలాంటి అవకాశాలను సృష్టించుకున్నాడు. వాటిని విజయాలుగా ఎలా మలుచుకున్నాడు. సినిమా మీద ప్రేమ అతడి వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది. అన్ని అడ్డంకులను దాటుకొని విజయవంతమైన దర్శకుడిగా ఎలా నిలిచాడు.. అన్నది నా కథలో చెప్పాను. సందర్భోచితంగా సన్నివేశాలను అల్లుకున్నాను. పబ్లిషర్స్‌కు పంపితే.. వెంటనే ఓకే చెప్పారు. ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే 272 పేజీల నవల ప్రింటింగ్‌ పూర్తి చేసుకొని నా దగ్గరికి వచ్చింది. తొలి ప్రయత్నంలోనే ఇలాంటి విజయం లభిస్తుందని ఊహించలేదు’ అంటాడు చరణ్‌.

సక్సెస్‌ జర్నీ..


‘ద లవ్‌ హాజ్‌ బ్రేకప్స్‌. సినిమాస్‌ డోన్ట్‌- కమర్షియల్‌ సినిమా’ ఈ పేరు చాలు చరణ్‌కు సినిమాలంటే ఎంత మోజో చెప్పడానికి. ‘ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. సక్సెస్‌ కోసం విపరీతంగా కష్టపడతారు. వారికి సినిమానే జీవితం. ప్రేమలో కామాలు, ఫుల్‌స్టాప్‌లు ఉంటాయి కానీ, జీవితం నిరంతర ప్రయాణం. సినిమాలే జీవితం అనుకునేవారు జయాపజయాలతో సంబంధం లేకుండా సినీయానం కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే దీనికి ఆ పేరు పెటా’ అని చెబుతాడు చరణ్‌. ఈ పుస్తకాన్ని చదివిన సెలబ్రిటీలు చరణ్‌ ఊహాశక్తికి, రచనా వైచిత్రికి ఫిదా అవుతున్నారు. దర్శకుడి గొప్పదనాన్ని చక్కగా చెప్పావని కితాబిస్తున్నారు. చరణ్‌ రచన ఇప్పుడు ఆన్‌లైన్‌ అంగట్లో అందుబాటులో ఉన్నది. అమ్మకాల జోరు ఎలా ఉన్నా.. ఈ యువకుడి ప్రయత్నాన్ని మనమూ మెచ్చుకుందాం.

ఒక వ్యక్తి దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలే ఈ పుస్తకంలోని కథ. బ్రేకప్‌, మత ఘర్షణలు, స్నేహం, తీవ్రవాదం.. ఇలా పది అంశాలతో కథను నడిపించి ఔరా! అనిపించుకున్నాడు చరణ్‌. తొలి రచనతోనే జగపతిబాబు, చోటా కె నాయుడు, వివి వినాయక్‌ తదితర సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నాడు. తండ్రి కండ్లలో ఆనందాశ్చర్యాలు చూశాడు.