ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:16

అమ్మ బుక్క... నాన్న బుక్క..

అమ్మ బుక్క... నాన్న బుక్క..

‘మా పిల్లలు సరిగా తినడం లేదండీ’.. ప్రతి తల్ల్లీ చేసే ఫిర్యాదే. అయితే ‘సరిగా తినడం’ అనేమాటకు నిర్వచనం తెలుసుకోవడం అవసరం. మంచి ఆహారానికి కొలమానం పరిమాణం కాదు.. పోషకాల నాణ్యత. తల్లిపాల తర్వాత, సాధారణ ఆహారం మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన ఆహారాన్ని  అలవాటు చేస్తే.. అనారోగ్యకరమైన చిరుతిండ్ల జోలికి పోరు.  పిల్లలకు ఏ వయసులో ఎలాంటి ఆహారం ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో నిపుణుల మాటల్లోనే..

ఆహారాన్ని మందులా తగిన మోతాదులో తీసుకోకపోతే మందులే ఆహారం అవుతాయి.

- హిప్పోక్రేట్స్‌ 

మంచి ఆహారాన్ని మితంగా తీసుకుంటే, రోగాల బారిన పడి మందులను ఆహారంలా తినాల్సి వస్తుందన్నది వైద్య పితామహుడు హిస్పోక్రేట్స్‌ మాట. ఈ మాటను వేదవాక్కులా ఆచరిస్తే పెద్దయ్యాక జబ్బులను తప్పించుకోవచ్చు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. పిల్లలు సరిగా తినడం లేదని ఆందోళన పడటానికి ముందు వాళ్ల బరువు, ఎత్తు సరైన క్రమంలో ఉంటున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇందుకు గ్రోత్‌ చార్ట్‌లు ఉపయోగపడతాయి. 

వీనింగ్‌ ఎందుకు?


తల్లి పాల నుంచి దూరంగా జరగటాన్ని వీనింగ్‌ అంటారు. దీన్ని ఆరోనెల నుంచి ప్రారంభించాలి. మనిషి పరిణామ క్రమంలో ఇది అత్యవసరం. సాధారణంగా రెండేండ్ల వయసు వరకు తల్లిపాలను  తీసుకున్న పసివాళ్లు తరువాత ప్రకృతిసిద్ధమైన ఆహారాన్ని తిని, అరిగించుకోవాలి. అప్పుడే వాళ్ల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అంతేగాక ఈ వయసులో పాలను అరిగించుకొని దాని నుండి శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించగలిగే ఎంజైమ్స్‌ క్షీణిస్తాయి. అందువల్ల 6 నెలల వయసులో తల్లిపాల నుండి ఘనాహారం వైపు మళ్లించాలి. ఈ వయసులో పాపాయి చేతికి, నోటికి మధ్య సమన్వయంలో పరిణతి వస్తుంది. తల నిలబెడతారు. చిగుళ్లు గట్టిపడి, కొరికి, నమిలి, మింగే ప్రక్రియకు అనువుగా నోరు, దంతాలు సిద్ధమవుతాయి. అంటే, ఈ వయసు నుంచి చేతితో ఘనాహారాన్ని తీసుకుని తినవచ్చని ప్రకృతే సహజంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నదన్నమాట. అంతేగాక ఈ వయసులో పేగులో ఉండే అమైలేజ్‌ ఎంజైమ్‌ పరిణతి చెంది, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటగా పరిచయం చేసే ఘనాహారం వరి సంబంధితమై ఉండాలి. అన్నమే పెట్టాలి.  అది అలవాటయ్యాక పప్పులు ఇవ్వొచ్చు. 

4 నుంచి 6 నెలలు


మెడ నిలపగలుగుతారు. చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకోగలుగుతారు. పాలు కాకుండా వేరే ఆహారం పరిచయం చేయాలి. కేవలం పాల వల్ల బరువు సరిగా పెరగకుంటే 6 నెలల లోపు డాక్టర్‌ సలహాతో ఇతర ఆహారం పెట్టొచ్చు. లేకుంటే ఇవ్వొద్దు. డాక్టర్‌ సలహా లేకుండా అవసరం లేకపోయినా 6 నెలల కన్నా చిన్న వయసు నుంచే ఘనాహారం ఇవ్వకూడదు. దీనివల్ల తల్లిపాలు తక్కువగా తాగుతారు. ఫలితంగా మెదడు ఎదుగుదలలో సమస్య రావచ్చు. అంతేగాక, జీర్ణకోశం వాటిని అరిగించుకునేలా పరిణతి చెందదు. పేగుల్లోని ఎంజైమ్స్‌ ఇందుకు సిద్ధంగా ఉండవు. 


6 నుంచి 12 నెలలు


ఏడాదిలోపు మెత్తగా మెదిపిన అన్ని పదార్థాలు ఇవ్వొచ్చు. కారం, మసాలాలు, మాంసాహారం మాత్రం వద్దు. వీనింగ్‌ సరిగా లేకుంటే ఇన్‌ఫెక్షన్లు, పోషకాహార లేమి రావచ్చు. అందుకే తగినంత ప్రొటీన్‌ అందేలా చూడాలి. మెయిన్‌ భోజనానికి మధ్య మధ్యలో ఏదో ఒకటి స్నాక్స్‌ రూపంలో ఇస్తుండాలి. ఇద్దరు ముగ్గురు పిల్లలకు కలిపి ఒకేసారి పెడితే బాగా తింటారు. 7 నుంచి 8 నెలల వయసులో కూరగాయలు ఇవ్వడం మొదలుపెట్టాలి. మొదట ఆలుగడ్డను మెత్తగా ముద్దలా చేసి పెట్టాలి. ఆ తరువాత క్యారెట్‌, పాలకూర, బీన్స్‌ అలవాటు చేయాలి. తర్వాత అన్ని కూరగాయలు ఇవ్వొచ్చు. అయితే మనదేశంలో పండే కూరగాయలు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కొరకడం ప్రక్రియ 9 నుంచి 10 నెలల వయసులోనే మొదలవుతుంది. అందుకే అలాంటి పదార్థాలు ఇవ్వాలి. క్యారెట్‌, ఆలుగడ్డ ముక్కల్లాంటివి ఉడికించి వాళ్లకి తినమని చేతికి ఇవ్వాలి. గుడ్డులోని పచ్చసొన ఇవ్వొచ్చు. దీనిలో అవసరమైన ఫ్యాట్స్‌, విటమిన్లు ఉంటాయి.

పిల్లల కోసం ఆహార సూత్రాలు

1. తల్లిపాలు బిడ్డ పుట్టిన గంటలోపు పట్టే ప్రయత్నం జరగాలి. పిల్లలు ఇన్‌ఫెక్షన్లు, అలర్జీల బారిన పడకుండా చేసే అమృతం తల్లిపాలు. 

2. మొదటి నాలుగు నుంచి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అన్నిటికంటే శ్రేయస్కరం. ఇది రెండేండ్ల వరకు ఇవ్వగలిగితే పిల్లల ఎదుగుదలకు మరింత మంచిది. 

3. నాలుగు నెలల నుండి ఆరు నెలల లోపు తల్లిపాలతో సహా ఘనాహారం కూడా  మొదలు పెట్టాలి. దీన్నే వీనింగ్‌ అంటారు.

4. వీనింగ్‌ ప్రక్రియ పరమార్థం తల్లిపాలకు దూరంగా జరగటం. ఈ క్రమంలో పిల్లలకు పోషకాహార లోపం రానివ్వకుండా చూడటం చాలా ముఖ్యం. 

5. సంవత్సరం వయసు వచ్చేనాటికి చాలావరకు తల్లిదండ్రులు తినే ఆహారం పిల్లలకు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 

6. ఆహారం మోతాదు కంటే పోషక నాణ్యత చాలా ముఖ్యం. అన్నీ తగిన మోతాదులో తింటున్నారా లేదా అనేది గమనించాలి. 

7. పసిపిల్లలు ఎప్పటికీ ఏదో ఒకటి తింటూ ఉండటం అవసరం. ఇందుకోసం ఒక అక్షయ పాత్రను తయారుచేయాలి. అంటే ఒక పాత్రలో పోషక విలువలున్న స్నాక్స్‌ ఉంచాలి. అవి అయిపోయినకొద్దీ పాత్ర నింపుతూ ఉండాలి. 

8.  చాలా తక్కువ ఖర్చుతో దొరికే ఆకుకూరలు; ఆకుపచ్చ, నారింజ, పసుపు రంగులోని కాయగూరలు, పండ్లు పిల్లలతో పాటు మనకూ ఆరోగ్యాన్నిఇస్తాయి.  

9. పిల్లల వయసుకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ప్రేమపూరిత వాతావరణంలో పెరగడం కూడా అవసరం. క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, నట్టల మందు  (డీవార్మింగ్‌) ఇప్పించడం, పరిశుభ్రత నియమాలు పాటించటం కూడా అవసరం.  

10. కాబోయే తల్లులు, బాలింతల లాగానే యుక్తవయసులోని పిల్లలకు ప్రత్యేకించి  కొన్ని ఆహార అవసరాలు ఉంటాయి. అలానే జబ్బుపడిన పిల్లలకు, దాని నుంచి కోలుకునే క్రమంలో ప్రొటీన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఏడాది దాటాక...

ఏడాది దాటాక రెండేండ్ల లోపు మాంసాహారం అలవాటు చేయవచ్చు. అయితే ఏ రుతువులో దొరికే పండ్లు ఆ రుతువులో తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రొటీన్‌ ఆహారం ఎక్కువ ఇవ్వాలి. జీడిపప్పు, పిస్తా, బాదం పొడిచేసి  ఏ ఆహారంలో అయినా చిలకరించవచ్చు. రెండేండ్లు దాటాక పెద్దవాళ్లలాగానే అన్నీ పెట్టొచ్చు. అయితే 6 టీస్పూన్ల కన్నా తక్కువ చక్కెర ఇవ్వొచ్చనీ, ఆ మోతాదు మించకూడదనీ ఎస్పగాన్‌ గైడ్‌లైన్స్‌ (యూరోపియన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్‌) చెప్తున్నాయి. 3 నుంచి 4 ఏండ్లలో గట్టిగా, గుండ్రంగా ఉండే వస్తువులు, గింజలు ఇవ్వకూడదు. ఏ జీడిపప్పు లాంటివో ఇవ్వదలచుకుంటే పొడిచేసి ఆహారంలో కలిపి ఇవ్వవచ్చు. రెండేండ్లలోపు పిల్లలకు కూల్‌డ్రింక్స్‌, షుగరీ డ్రింక్స్‌ అసలు వద్దు. 

కౌమారంలో..

ఈ వయసులో ఎదుగుదల అకస్మాత్తుగా ఎక్కువ అవుతుంది. కాబట్టి కౌమార బాలబాలికలకు పోషకాలు సరిగా అందాలి. చాలామంది పిల్లలు డైటింగ్‌ పేరుతో పోషకాహార లేమికి గురవుతుంటారు. రక్తహీనత బారినపడే వయసు కూడా ఇదే. ఆడపిల్లల్లో 50 శాతం మంది రక్తహీనతతో ఉంటున్నారు. ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, క్యాల్షియం, విటమిన్లు తక్కువగా అవుతున్నాయి. అందుకే ఈ పోషకాలు ఎక్కువగా లభించే ఆహారం ఇవ్వాలి. ఆకుకూరలు, కూరగాయలు అధికంగా ఇవ్వాలి. తాజా కూరగాయలను సలాడ్స్‌గా తీసుకునేట్టు చూడాలి. 

డాక్టర్‌ షర్మిల

సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రీషియన్‌

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo