మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 00:10:40

చిక్కు లెక్కల... శకుంతలక్క!

చిక్కు లెక్కల... శకుంతలక్క!

‘మా స్కూలు శకుంతలాదేవి’,   ‘మా కాలేజీ శక్కూ జూనియర్‌' ... మ్యాథ్స్‌లో నూటికినూరు మార్కులు తెచ్చుకునే ఏ అమ్మాయినైనా తనతోనే పోలుస్తారు. ఎంత పెద్ద లెక్కనైనా లెక్కచేయని స్వభావం తనది. లెక్కల్నే కాదు, సమస్యల్నీ సంక్షోభాల్నీ కూడా రెండు ఒకట్లు రెండు అన్నంత సులభంగా పరిష్కరించుకునేది. ఆమె ప్రతిభ అగణితమైంది. కాల్పనిక సాహిత్యం రాసింది. స్వలింగ సంపర్కుల కోసం ఉద్యమించింది. ఎమర్జెన్సీని ఖండించింది.  మెదక్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీకి నిలిచింది.  ఓ మంచి బయోపిక్‌కు అవసరమైన దినుసులన్నీ శకుంతలాదేవి జీవితంలో ఉన్నాయి. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలాదేవి - హ్యూమన్‌ కంప్యూటర్‌' చిత్రం త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్నది. ఓ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి ఏమాత్రం తీసిపోని మలుపులన్నీ శకుంతల జీవితంలో కనిపిస్తాయి. ఆమె తండ్రి పూజారి. కానీ, ఎందుకో ఆ వృత్తి ఆయన వ్యక్తిత్వానికి సరిపడలేదు. తనకు సాహసాలంటే ఇష్టం. అందుకే సర్కస్‌ కంపెనీలో చేరాడు. పులులను ఆడిస్తూ, ఒంటితాటి మీద విన్యాసాలు చేస్తూ మురిసిపోయేవాడు. మేజిక్‌ అన్నా  ఆయనకు ప్రాణం. ఓసారి తను పేకముక్కలతో మేజిక్‌ చేస్తుంటే, మూడేళ్ల కూతురు చూసింది. ముద్దు మాటలతో ఆ పేకముక్కలు ఏ వరుసలతో ఉన్నాయో టకటకా చెప్పేసింది. తండ్రి బిత్తరపోయాడు. తన కూతురిలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని గ్రహించాడు. ఇంతలో సర్కస్‌లో ఉద్యోగం పోయింది. కూతురితో కలిసి ‘లెక్కల’ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. మొదట బెంగళూరులో, తర్వాత మైసూరులో ... దేశాలు, ఖండాలు దాటి వెళ్లారు తండ్రీ కూతుళ్లు.

రికార్డులు తిరగరాసిన లెక్క: 13X13 ఎంత అంటే కొంచెం సేపు ఆలోచిస్తాం. అదే, ఒక్కోదాంట్లో 13 అంకెలున్న రెండు సంఖ్యలను గుణించమంటే, అసాధ్యం అని కొట్టిపారేస్తాం. కానీ శకుంతలాదేవి 28 సెకన్లలోనే ఆ లెక్కను ఛేదించింది. వాయుమనో వేగాలతో చిక్కు లెక్కలు పరిష్కరించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఆ మలుపు తర్వాత, ప్రపంచం ఆమెను ‘లెక్క’లోకి తీసుకోవడం మొదలుపెట్టింది. ‘హ్యూమన్‌ కంప్యూటర్‌' అంటూ బిబిసి ఆకాశానికి ఎత్తేసింది. కానీ ఆ బిరుదు తనకి ఇష్టం ఉండేది కాదు. కంప్యూటర్లు అతి సామాన్య యంత్రాలనీ, మనిషి మేధస్సు అంతకంటే శక్తిమంతమైందనీ ఆమె నిశ్చితాభిప్రాయం. ఆ నమ్మకంతోనే దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ, లెక్కల్లో మెలకువలు నేర్పుతూ మంచి పేరు సంపాదించింది. జ్యోతిషం పట్ల శకుంతలకు చాలా గురి. మనకు పైకి కనిపించే లెక్కలే కాదు, మననును నడిపించే లెక్కలు కూడా ఉంటాయని తన ప్రగాఢ విశ్వాసం. ఆ కోణంలోనే జ్యోతిషం మీద విస్తృతమైన పరిశోధనలు చేసింది. సెలబ్రిటీలు సైతం ఆమెతో జ్యోతిషం చెప్పించుకునేందుకు ఉత్సాహం చూపేవారు. లెక్కలు, పజిల్స్‌, జ్యోతిషం... ఇలా తనకు పట్టు ఉన్న ప్రతి రంగం మీదా పుస్తకాలు రాసింది శకుంతల. అవి అంతే వేగంగా అమ్ముడయ్యేవి. క్రైమ్‌ పుస్తకాలు రాసి, నవలా రచయిత్రిగానూ నిరూపించుకుంది.

దిమ్మతిరిగే పుస్తకం: శకుంతలా దేవి రచనలన్నీ ఒక ఎత్తు.... స్వలింగ సంపర్కం గురించి రాసిన ‘ద వాల్డ్‌ ఆఫ్‌ హోమో సెక్సువల్స్‌' ఒక ఎత్తు. ఆ మాట వినడానికే ఇష్టపడని 1970వ దశకంలో, స్వలింగ సంపర్కులను అర్థం చేసుకోవడం లేదంటూ వ్యవస్థను నిలదీశారు ఆమె. ‘సమాజం జాలితోనో, సహనంతోనో చూడటం గొప్ప విషయం కాదు... వాళ్ల అలవాటును అంగీకరించటం మన బాధ్యత’ అని గుర్తుచేశారు. ‘ప్రతీ వ్యక్తిలోనూ ఓ స్వలింగ సంపర్కుడు ఉంటాడు’ అనే వాదన లేవదీశారు. ఆ పుస్తకం రాయడం వెనుక ఉన్న నేపథ్యం కూడా విచిత్రమైందే. ప్రపంచం అంతా లెక్కల జెండా ఎగురవేసిన తర్వాత, స్వదేశానికి వచ్చారు శకుంతల. పరితోష్‌ బెనర్జీ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. పరితోష్‌ స్వలింగ సంపర్కుడు! అన్ని విధాలా ప్రత్యేకం: శకుంతల ఏం రాసినా ఏం చేసినా... అబ్బురంగానే ఉండేది. కంప్యూటర్లను జయించిన వ్యక్తిగా ఆమెను ఓ నాయికలా చూసేవాళ్లు. శకుంతల నిజ జీవితం కూడా చాలా వైవిధ్యభరితం. స్తోమత ఉన్నా ఎప్పుడూ కారు కొనుక్కోలేదు. ఆటోల్లోనే తిరిగేవారు. ఆ మాటే అడిగితే, ‘వీలైనంతవరకు జనాలకు దగ్గరగా ఉండటం నాకు ఇష్టం’ అని చెప్పేవారు. తనకి బడికి వెళ్లే అవకాశం రాలేదని ఎప్పుడూ బాధపడలేదు. పైగా ‘చదువంటే బడికి వెళ్లడం, డిగ్రీలు సంపాదించుకోవడం కాదు... విజ్ఞానాన్ని పెంచుకుంటూ జీవితం గురించి తెలుసుకోవడం’ అని కొట్టిపారేసేవారు. తన మనసులో ఏ ఆలోచన వచ్చినా, దాన్ని వెంటనే అమలుపరిచేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీరు శకుంతలకు నచ్చలేదు. అందుకే, ఇందిర మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు, ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. వృద్ధాప్యంలోనూ ఆమె మెదడు మహా చురుకుగా పనిచేసేది. ఒక్క  క్షణమైనా ఖాళీగా ఉండేవారు కాదు. శతమానానికి ఇంకో పదిహేడు అంకెలు బాకీ ఉండగా 2013లో, తన ఎనభైమూడో ఏట శకుంతలాదేవి మరణించారు.  ఆ వార్త విని... ఎక్కాలు వెక్కివెక్కి ఏడ్చి ఉంటాయి! త్వరలో విడుదల

బయోపిక్స్‌ రాజ్యమేలుతున్న కాలంలో.. శకుంతల జీవితాన్ని సినిమాగా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది అను మీనన్‌ అనే దర్శకురాలికి. అప్పటికే తను తీసిన మూడు సినిమాలూ బాగానే ఆడాయి. వెంటనే కథ మీద కసరత్తు మొదలుపెట్టారు. శకుంతలాదేవి కూతురు అనుపమా బెనర్జీతో మాట్లాడారు. కథ సిద్ధమైంది. ఆ పాత్రకు ఎవరు సరిపోతారా అనే ప్రశ్న వచ్చింది. ‘వెంటనే విద్యాబాలన్‌ మెదిలారు’ అంటారు అను.  శకుంతల కథను వినగానే ‘ఎస్‌' అనేశారు విద్య.  శకుంతలాదేవి మాటతీరు, ఆహార్యం, హావభావాల మీద చాలా కసరత్తే చేశారు.. గత ఏడాది డిసెంబరులోనే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తయిపోయింది. విడుదల తేదీని కూడా లెక్కల పజిల్‌లానే వదిలారు విద్య. ‘సరిగ్గా 148 రోజుల్లో మా చిత్రం విడుదల అవుతుంది. ఆ తేదీని మీరే తెలుసుకోండి’ అని ఊరించారు. కానీ,  మే 8న విడుదల కావాల్సిన చిత్రం లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఆగిపోయింది. అయితేనేం, అమెజాన్‌ ప్రైమ్‌తో ఒప్పందం కుదిరిపోయింది.

త్వరలోనే విడుదల!

1977... అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో గణిత ప్రదర్శన జరుగుతున్నది. 201 అంకెలు ఉన్న సంఖ్యకి 23వ మూలం (రూట్‌) కనుక్కోమంటూ అక్కడున్న వ్యక్తికి పరీక్ష పెట్టారు. 50 సెకన్లలోనే జవాబు చెప్పేసింది ఆమె. అది నిజమో కాదో తేల్చేందుకు అప్పట్లో అత్యాధునికమైన యూనివాక్‌ కంప్యూటర్‌ సాయం కోరారు. జవాబును నిర్ధారించేందుకు కంప్యూటర్‌కు పట్టిన సమయం... 62 సెకన్లు! కంప్యూటర్‌ను ఓడించిన ఆ యువతి పేరు శకుంతలాదేవి.


logo