శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Feb 23, 2020 , 23:24:12

పోషక ఉత్పత్తుల రంగంలో గెలిచిన విజయా రంజన్‌

పోషక ఉత్పత్తుల రంగంలో గెలిచిన విజయా రంజన్‌

సాధించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమనేది అనేక సందర్భాల్లో రుజువైంది. అందులోనూ మహిళలు మరింత ముందు వరుసలో ఉంటారు. అనుకున్న పని పూర్తయ్యేవరకు తమ ప్రయత్నం చేయడం మానరు. బెంగళూరుకు చెందిన గృహిణి కూడా అదే పట్టుదలతో ముందుకు సాగి తలచుకుంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారు. కేవలం రూ. 2.5 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి రెండేళ్లలో 370 శాతం వృద్ధి సాధించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం వ్యాపారాన్ని మరింత వృద్ధి చెందించి విజయవంతంగా దూసుకుపోతున్న సిరిమిరి హెల్దీ స్నాక్స్‌ అధినేత్రి విజయా రంజన్‌ సక్సెస్‌మంత్ర.

విజయా రంజన్‌ మొదట గృహిణిగానే ఉండేవారు. అప్పుడు ఆమె భర్త ఇంగ్లీష్‌ జలమార్గాన్ని ఈదడానికి శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయనకు అవసరమైన పోషకాహారాన్ని అందించాలి అనుకున్నారు. అందుకోసం మార్కెట్‌ను అన్వేషించారు. అయితే అప్పటికీ మంచి న్యూట్రిషన్లు అందించే ఉత్పత్తులేవి మార్కెట్‌లో లేవు. కొన్ని రకాల పోషక ఉత్పత్తులు లభిస్తున్నప్పటికీ అందులో శరీరానికి అవసరమైన శక్తినిచ్చే పదార్థాలు లేవని ఆమె తెలుసుకున్నారు. వాటివల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదని గుర్తించిన విజయ సహజమైన పదార్థాలతో పోషక ఉత్పత్తులను అందించడానికి ఓ చిన్న ప్రయత్నం చేశారు. 


ప్రయోగాలు చేసి

విజయ వాణిజ్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. తత్వశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. దీంతో కస్టమర్లతో నేరుగా కనెక్ట్‌ అయ్యే అవకాశం తనకు అధికంగా ఉందనేది ఆమె నమ్మకం. అలాగే తను తయారు చేసే ఉత్పత్తులు అందరికీ అనుకూలంగా ఉంటాయనే ఆత్మవిశ్వాసం ఆమెది.అది 2015వ సంవత్సరం, మార్కెట్లో దొరుకుతున్న ముయెస్లీ, గ్రానోలా బార్స్‌ వంటి అనేక పోషక ఉత్పత్తులు చక్కెర, ఆర్టిఫిషియల్‌ ప్రిజర్వేటివ్స్‌ ఇంకా ఇతర అనారోగ్యాన్ని కలిగించే వస్తువులతో తయారుచేస్తున్నారని ఆమె కనుగొన్నారు. కాబట్టి, తాను గింజలు, ధాన్యాలు పండ్ల కలయికతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. అయితే ఈ పదార్ధాలతో తయారు చేసిన వాటి నుంచి వచ్చే పోషకాల గురించి పరిశోధించడానికి ఆమెకు సుమారు 3-4 నెలలు పట్టింది. ఆ తర్వాత నుంచి తన భర్త కోసం అనేక రకాల పోషకవిలువలున్న స్నాక్స్‌ సిద్ధం చేసిపెట్టేవారు.


అల్పాహారంగా మారి

విజయ మొదట్లో తన కుటుంబానికి ఇలాంటి పోషక ఉత్పత్తులను తయారుచేయాలని మాత్రమే అనుకున్నారు. కానీ స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకుతున్నారని తెలుసుకున్నారు. దీంతో తను తయారు చేసిన ఉత్పత్తులను వారికి రుచి చూపించారు. అందరూ అందులోని పోషకాలను గుర్తించడంతో పాటు అవి తీసుకున్న తర్వాత వచ్చే శక్తిని గుర్తించగలిగారు. దీంతో కాలక్రమేణ, విజయ తయారుచేస్తున్న పదార్థాలు ఆమె కుటుంబంతో పాటు స్నేహితుల పిల్లలకు కూడా అల్పాహారంగా మారాయి.


వ్యాపారం మొదలు ఇలా..

2017 మొదట్లో విజయ పోషకాహారం తయారీని వ్యాపారంగా మార్చాలనే నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబం కోసం చేసిన వంటకాలను, ఉత్పత్తులను మళ్లీ ఒకసారి చెక్‌ చేసుకొని ఆపై ప్యాకింగ్‌ చేసి ఏఏ పదార్థాలు విక్రయించాలో ఆ ఉత్పత్తులతో ఒక పెద్ద జాబితానే తయారు చేసుకున్నారు. 2017 చివరి నాటికి, అమెజాన్‌ మార్కెట్‌ ద్వారా సిరిమిరి ఉత్పత్తులను విక్రయించడానికి సాహెలి ప్రోగ్రామ్‌లో చేరారు.  తాను విక్రయించే ఉత్పత్తుల రకాలను ఖరారు చేసుకున్నారు. ఈ ఉత్పత్తులకు సిరిమిరి అనే పేరును నిర్ణయించడం వెనక మంచి అర్థ్ధం ఉందంట. స్పానిష్‌ భాషలో దీని అర్థం తేలికపాటి చినుకులు. కన్నడలో సిరి అంటే లక్ష్మీదేవి. తన బ్రాండ్‌కు ఇది సరైన పేరుగా గుర్తించారు. అంతేకాక అందరికీ చాలా ఆకర్షనీయంగా, సులభంగా గుర్తుండిపోతుందనేది ఆమె విశ్వాసం. ఆమె అనుకున్నట్లే తక్కువ సమయంలోనే సిరిమిరి ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది.


వ్యాపారాన్ని విస్తరించి

మొదట ఇంట్లో స్వయంగా ఉత్పత్తి మొదలు పెట్టిన విజయ, ఇప్పుడు తన వ్యాపారాన్ని 5,000 చదరపు అడుగుల విశాలమైన స్థలంలోకి మార్చారు. గతంలో తను ఒక్కరే అన్ని రకాల పనులు చూసుకునేవారు. ఉత్పత్తులు, అమ్మకాలు పెరుగడంతో తమ బృందాన్ని ఒకటి నుంచి 15 మంది సభ్యులకు విస్తరించారు. ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌ కోసం పరికరాలను జోడించి అమెజాన్‌లో అమ్మడం ప్రారంభించారు. అప్పటి నుంచి అమ్మకాల్లో 20 రెట్లు వృద్ధి కారణంగా భారీ పెట్టుబడులు సాధ్యమయ్యాయి. 


ఇక అమెజాన్‌లోకి వెళ్లినప్పటి నుంచి వారి ఆదాయం 370 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రతి ఆర్థిక సంవత్సరాన్ని 500 శాతం వృద్ధితో తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సిరిమిరి సక్సెస్‌ అవ్వడం కోసం ఆమెతో పాటు భర్త విజయ్‌ బ్రిటిష్‌ టెలికామ్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. మొదట్లో సిరిమిరి మూడు రకాల ఎనర్జీ బార్లు, మూడు వేరియంట్‌ ముయెస్లీలతో అమెజాన్‌ మార్కెట్‌ ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం, ఎనిమిది వేరియంట్‌ హెల్త్‌ బార్స్‌, ఆరు వేరియంట్స్‌ ముయెస్లీ, హెల్త్‌మిక్స్‌ల ద్వారా ఉత్పత్తి శ్రేణిని విస్తరించారు.


మీరూ చేరండి

అమెజాన్‌ సహేలి వంటి కార్యక్రమాలు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాయి, భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తగా ఉండడానికి ఇది గొప్ప సమయం. ఇంకెందుకు ఆలస్యం మీకేమైనా కొత్త ఆలోచనలు ఉంటే ఒకసారి అమెజాన్‌ సహేలి ప్రోగ్రాం గురించి తెలుసుకోండి. తక్కువ సమయంలోనే ఆర్థికంగా మంచి విజయాలు మీ సొంతమవుతాయి. అవకాశాలు ఏవీ ఊరికేరావు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం.

- విజయా రంజన్‌, సిరిమిరి ప్రొడక్ట్స్‌, ఎండీ, సీఈవో.


logo