సూపర్ సెంటెనరియన్లకు ‘జపాన్’ ప్రసిద్ధి చెందింది. తాజాగా, 114 సంవత్సరాల ‘షిగెకో కగావా’.. ఈ ద్వీపదేశంలోనే కాదు, ఆసియాలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధవ్యక్తిగా గుర్తింపు పొందింది. తన దీర్ఘాయువు రహస్యాన్ని గతంలో ఓసారి మీడియాతో పంచుకున్నది కగావా. సంపూర్ణ ఆరోగ్యం వెనక ఉన్న కారణాలను వివరించింది.
1911 మే 28న జన్మించిన షిగెకో కగావా.. ఒసాకా ఉమెన్స్ మెడికల్ కాలేజీలో చదివింది. మహిళా వైద్యురాలిగా సేవలు అందించింది. సమాజానికి సేవ చేయడానికి, మహిళలకు ఆరోగ్య సంరక్షణను అందించడానికి తన జీవితాన్నే అంకితం చేసింది. అలా.. సుదీర్ఘకాలంపాటు సేవలు అందించి.. 86 ఏళ్ల వయసులో విధుల నుంచి విరమణ తీసుకున్నది. అయినప్పటికీ తన దగ్గరికి వచ్చేవారికి వైద్య సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. 2021లో 109 సంవత్సరాల వయసులో.. టోక్యో టార్చ్ రిలేలో పాల్గొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల తన దీర్ఘాయువు రహస్యాన్ని పంచుకుంటూ.. ఆరోగ్యంగా ఉండటానికి తాను అసాధారణంగా ఏమీ చేయడం లేదని చెప్పుకొచ్చింది.
ఎప్పటికప్పుడు ఆరోగ్య సంరక్షణ చూసుకోవడం, సమతుల ఆహారం, చురుకైన జీవనశైలి.. తన అసాధారణమైన దీర్ఘాయువుకు దన్నుగా నిలిచాయని వెల్లడించింది. కగావా సాధారణ దినచర్యను పాటిస్తుంది. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పడుకోవడం, మేల్కొనడం.. ఆమె ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. రోజుకు మూడుసార్లు భోజనం చేయడం.. కగావాకు చిన్నప్పటి నుంచే అలవాటు. అయితే మితంగా తింటుందట. ఇక ఈమె డాక్టర్‌గా పనిచేసినప్పుడు వాహనాలు ఎక్కువగా అందుబాటులో ఉండేవికాదు. దాంతో పేషెంట్ల దగ్గరికి నడుచుకుంటూనే వెళ్లేదట.
అందుకే తాను ఇప్పటికీ బలంగా, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక ప్రతిరోజూ ఏదో ఒక ఆట ఆడేదట. తన శక్తే తనకున్న గొప్ప ఆస్తిగా భావించేదాన్నని అంటున్నది. కావాల్సింది తినడం, చేయాలనిపించిన పని చేయడం.. ఇలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకడం కూడా తన దీర్ఘాయువుకు కారణం అని చెబుతున్నది. 114 ఏళ్ల వయస్సులో.. భూతద్దం పట్టుకొని మరీ ప్రతిరోజూ వార్తాపత్రికలను పూర్తిగా చదువుతుంది. మేధస్సును ఎప్పటికప్పుడు పెంచుకుంటే.. ఆయువుకూడా పెరుగుతుందని అంటున్నది.
ఇక ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే.. తన ఆరోగ్యానికి పునాది అని చెబుతున్నది. తన కుటుంబంతోపాటు సమాజం కూడా తన సంతోషాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడ్డారని అంటున్నది. నిజానికి ఈ లక్షణాలన్నీ జపాన్‌లోని శతాధిక వయస్సు గలవారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు.. ఆయుర్దాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి జీవనశైలిని ఫాలో అయిపోతే.. ‘శతమానం భవతి’ సాధ్యమేనని అంటున్నారు నిపుణులు.