సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 24, 2020 , 01:32:25

ప్లాస్మాదానం.. ప్రాణదానం

ప్లాస్మాదానం.. ప్రాణదానం

వైరస్‌ సోకిన వ్యక్తి త్వరగా రికవరీ..

ప్లాస్మాదానంపై అపోహలొద్దు 

జిల్లాలో ప్లాస్మాదాతలు 30 మందిపైనే

కొవిడ్‌ బాధితులకు ఊరట

ఆలేరు : కరోనాపై పోరాడి గెలిచిన పలువురు రియల్‌ హీరోలుగా మారుతున్నారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా దానం చేస్తున్నారు. రక్తదానంలో ముందుండే జిల్లా వాసులు.. ప్లాస్మాదానంలోనూ ముందు వరుసలో నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కనిపించని కరోనా యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో అదుపులో ఉన్నట్లే కనిపించిన వైరస్‌ వ్యాప్తి.. నిబంధనల సడలింపుతో విజృభించింది. దీంతో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 6176 మంది కరోనా బారినపడ్డారు. 47 మందికి పైగా మృతి చెందారు. కొంతమంది పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో కొవిడ్‌ బాధితులకు ప్లాస్మా థెరఫి అంశం తెరపైకి వచ్చింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కోలుకున్న తరువాత వారి రక్తంలో ఉండే ప్లాస్మాను సేకరించి మరో బాధితుడికి ఎక్కిస్తారు. దీంతో బాధితుడికి కరోనా వైరస్‌ నుంచి బయటపడుతున్నారు. దీంతో ప్లాస్మా దానం గురించి చర్చ మొదలైంది. దీంతో జిల్లా వాసులు ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ప్లాస్మాతో ప్రాణదానం..

రక్తంలో 55శాతం ప్లాస్మా ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కొవిడ్‌ను జయించిన వ్యక్తి ప్లాస్మాలో యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. దీనిని పాజిటివ్‌  వ్యక్తి శరీరంలో ప్రవేశపెడితే రోగ నిరోధకశక్తి పెరిగి కరోనా వైరస్‌ను నాశనం చేస్తాయి. ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుండడంతో  ప్లాస్మాదానంపై ప్రచారం జరుగుతోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారికి  పరీక్షలు చేసిన తర్వాత అతడిలో కొవిడ్‌ లేదని నిర్ధారించుకుని ప్లాస్మాను స్వీకరిస్తారు. ప్లాస్మాదానం చేసే వ్యక్తి బరువు కనీసం 50 కిలోలు, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం కనీసం 12 ఉండి రక్తం నాణ్యతగా ఉండాలి. ఒక వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మా నుంచి సుమారు  ముగ్గురు పాజిటివ్‌ వ్యక్తులను కాపాడవచ్చునని వైద్యలు చెబుతున్నారు. 

ఎందరో దాతలు..

జిల్లాలో  6176 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో  3829 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇందులో 30 పైగా ప్లాస్మా దానం చేశారు. మరికొంత మంది ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రక్తదానంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వారంతా ఇప్పుడు ప్లాస్మా ప్రాధాన్యతను వివరిస్తున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. 

రక్తదానం కంటే గొప్పది..

కరోనా బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్లాస్మాథెరపీతో ప్రాణాలు కాపాడొచ్చు. రక్తంలో 55 శాతం ప్లాస్మా ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. కొవిడ్‌ను జయించిన వ్యక్తి ప్లాస్మాలో యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. దీనిని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి శరీరంలో ప్రవేశపెడితే రోగ నిరోధక కణాలు పెరిగి కరోనా బారిన నుంచి బయటపడొచ్చు. రక్తదానం చేయడం.. ప్లాస్మా దానం చేయడం ఒకటే. ప్లాస్మా దానంతో ఏ ఇబ్బందీ ఉండదు. 

                  -డాక్టర్‌ సాంబశివరావు, జిల్లా వైద్యాధికారి

దాతలు ముందుకు రావాలి

కరోనా మహమ్మారి విస్తృతంగా పెరుగుతుంది. చాలామంది రోగులు రోగనిరోధక శక్తి లేక చనిపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఎవరైనా ఉంటే, వేంటనే ప్లాస్మా దానానికి ముందుకు రావాలి. దీంతో మరోవ్యక్తి ప్రాణం కాపాడినవారవుతారు.  

  - డి.అంజయ్య, రెడ్‌క్రాస్‌ జిల్లా కోశాధికారి,  

     యాదాద్రిభువనగిరి

ఒకరి ప్రాణాలు కాపాడాను

నేను కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నా.  కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు చాలా భయమేసింది. మా కుటుంబ సభ్యులు, మిత్రులు  అందించిన ధైర్యంతో రెండు వారాల్లోనే కోలుకున్న. చాలా మంది కరోనా బారిన పడి మృతువాత పడుతున్నారు. వారిని కాపాడాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే రెడ్‌క్రాస్‌ సొసైటీలను సంప్రందించి, ప్లాస్మా దానం చేశాను. 

        -బత్తిని అరుణ్‌కుమార్‌, ప్లాస్మాదాత, వలిగొండ

VIDEOS

logo