వరంగల్, జూన్ 16 : బడి గంటలు మోగిన వేళ.. ఫిట్నెస్ బస్సులు యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. పాఠశాలలు ప్రారంభించే సమయానికి స్కూల్ బస్సులు రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది. అయితే పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండానే బస్సులను రోడ్డెకిస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ సీరియస్గా ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్సుల్లో కనీసం సగం బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందక పోవడంపై దృష్టిసారించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టింది. రెండు రోజులుగా చేస్తున్న తనిఖీల్లో 10 స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.
15 ఏళ్ల కాలం ముగిసిన బస్సులే ఎక్కువ
పాఠశాలల యాజమాన్యాలు 15 ఏళ్ల కాలం ముగిసిన బస్సులను ఎక్కువగా రోడ్డెకిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 202 స్కూల్ బస్సులు 15 ఏళ్ల కాలం ముగిసినవి ఉన్నట్లు రవాణా శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ బస్సులు పాఠశాల పిల్లలను తీసుకురావడానికి పూర్తిగా నిషేధమని, వీటిని ఖండం బస్సులుగా గుర్తిస్తామని అధికారుల పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయా స్కూల్ బస్పుల యాజమాన్యాలు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఫిట్నెస్ పొందినవి 226 మాత్రమే
పాఠశాలలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 226 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. జిల్లా వ్యాప్తగా 976 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో 202 స్కూల్ బస్సులు 15 ఏళ్ల కాలం ముగిశాయి. మిగిలిన 774 స్కూల్ బస్సుల్లో కేవలం 226 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. 548 స్కూల్ బస్సులు రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్సుల్లో సగం బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ప్రమాదాలు జరుగక ముందే ఫిట్నెస్ లేకుండా రోడ్డెకుతున్న స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఫిట్నెస్ లేకుంటే సీజ్
ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం. ఇప్పటికే ఫిట్నెస్కు రాని బస్సు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. 15 ఏళ్ల కాలం ముగిసిన స్కూల్ బస్సులను ఖండం వాహనాలుగా గుర్తిస్తాం. వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయం.ప్రాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై కఠినంగా వ్యవహరిస్తాం.
– పురుషోత్తం, డీటీసీ