నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 17 : తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 72వ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సార్’ అంటూ నినదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలు చోట్ల అన్నదానాలు చేశారు. హనుమకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన య్ భాస్కర్ వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నిరుపేద విద్యార్థుల ఫీజులు చెల్లించి వారికి రశీదులు అందజేశారు.
మడికొండలోని మెట్టుగుట్టపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అలాగే వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో అరూరి కేట్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచా రు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ సెంటర్లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, భారీ కేక్ కట్ చేశారు. పర్వతగిరి మండలకేంద్రంలోని పర్వతాల శివాలయంలో పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేక్‌కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజల తరుపున కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కేక్‌కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. అలాగే కురవి వీరభద్రస్వామి ఆలయంలో కేసీఆర్ గోత్రనామాలపై మాజీ మంత్రి సత్యవతి పూజలు చేయించారు. దంతాలపల్లి మండలం రామనుజపురంలో రైతులు పొలాల మధ్యలో కేసీఆర్ జన్మదినం జరుపుకోగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పాల్గొన్ని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన స్వగృహంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.