వెంకటాపూర్/గోవిందరావుపేట, నవంబర్ 30 : ఆలయాలు మన చరిత్రకు ఆనవాళ్లు అని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మండలంలోని పాలంపేటలో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణఅదిత్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. రామప్ప చెరువు ప్రత్యేకత, రామప్ప ఉప ఆలయాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి రామప్ప ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రామప్ప చెరువు కట్టపైనున్న ఆలయాలతో పాటు పశ్చిమ వైపున గల కాలభైరవుడి ఆలయాన్ని అధికారులతో కలిసి సందర్శించి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోని డీపీఆర్ పంపాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు. అంతకుమందు ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజుకుమార్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో శ్రీదేవి మాట్లడుతూ ఆలయాలు మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకు నిలయాలు అన్నారు. ఇందులో చరిత్రతోపాటు కళలు, ఇంజినీరింగ్ టెక్నాలజీ, సైన్స్ దాగి ఉన్నాయని వీటిపై ప్రతి విద్యార్థి తనకు ఆర్టికల్ రాసి పంపించాలని కోరారు. అలాగే టూరిజం గైడ్స్ వేతనాలు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలుపగా పెంచేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్, టూరిజం అధికారులకు ఆమె సూచించారు. అనంతరం రామప్ప చెరువులో, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో బోటింగ్ చేశారు. వేలాడే వంతెనలపై నడుస్తూ రెండో ఐలాండ్‌ను వీక్షించారు. లక్నవరం అందాలు చాలా బాగున్నాయన్నారు. ఊటి, కొడైకెనాల్‌కు దీటుగా లక్నవరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీలు నర్సింగ్, మల్లునాయక్, ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అఫీసర్ కుసుమ సూర్యకిరణ్, తహసీల్దార్ మంజుల, టూరిజం కార్పొరేషన్ మేనేజర్ అశోక్, రామప్ప హరిత మేనేజర్ రంజిత్, ఏఎస్సై కృష్ణయ్య, అర్కియాలజీ ఏడీఏ నర్సింగ్‌నాయక్, డీటీవో శివాజీ, గోవిందరావుపేట తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్, హరిత కాకతీయ మేనేజర్ అశోక్‌రెడ్డి, సూర్యకిరణ్, యూనిట్ మేనేజర్లు కిరణ్, శేషు, బాబు పాల్గొన్నారు.