ఖిలావరంగల్, నవంబర్ 16 : పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పోడు భూముల దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 శాతం సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 18 నుంచి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 85 శాతం పోడు భూముల సమస్యను పరిష్కరించామన్నారు.
ప్రశాంత వాతావరణంలో పోడు భూముల దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిష్కారం కూడా జరుగుతున్నదన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. పోలీసుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే గ్రీవెన్స్ ద్వారా తెలియచేస్తే ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీవో సంపత్రావు, ట్రైబల్ వెల్ఫేర్ టీడీ జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.