కాశీబుగ్గ, నవంబర్ 16 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుదవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ సీజన్లోనే అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9015 పలికింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన తరాల శోభన్‌బాబు 40 బస్తాల పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చారు.
తేమ శాతం 6.9 ఉండగా కల్యాణి ట్రేడర్స్ అడ్తి ద్వారా మహాలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వ్యాపారి క్వింటాల్‌కు రూ.9015తో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం నవంబర్ నెల కంటే ఈ సారి ధరలు అధికంగా పలుకుతున్నట్లు చెప్పారు. మధ్యరకానికి రూ.7600, కనిష్ఠంగా రూ.6200 ఉన్నట్లు తెలిపారు. మార్కెట్‌కు సుమారు 10వేల బస్తాలు (4500 క్వింటాళ్లు) వచ్చినట్లు చెప్పారు.