వరంగల్, నవంబర్ 16: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఇక పైపులైన్ల లీకేజీల గుర్తింపు సులభతరం కానుంది. వేల సంఖ్యలో ఉన్న లీకేజీలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకొనేందుకు జీడబ్ల్యూఎంసీ ముందుకు సాగుతున్నది. ఈ మేరకు బుధవారం వాటర్ లీక్ డిటెక్షన్ యంత్రాన్ని మేయర్ సుధారాణి పరిశీలించారు. 11, 29వ డివిజన్లో భూమిలో ఉన్న పైపుపైన్ లీకేజీలను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియను ఆమె స్వయంగా చూశారు. పైపులైన్లో వాటర్ సామర్థ్యం, లీకేజీ అవుతున్న పైపులైన్ నుంచి వచ్చే శబ్దం ఆధారంగా ఆధునిక యంత్రం గుర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో లీకేజీల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముందస్తుగానే లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేసే అవకాశం ఈ యంత్రం ద్వారా ఉంటుందని తెలిపారు. ఈ యంత్రానికి మరింత సాంకేతికతను జోడిస్తే బాగుంటుందని సూచించారు. నగరంలో లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ఎస్ఈ కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, ఈఈలు రాజ య్య, ఏఈలు కార్తీక్‌రెడ్డి, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సదాంత్, చందు, రాచర్ల రాము తదితరులు ఉన్నారు.