నమస్తే నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. అనంతరం పాఠశాలల ఆవరణల్లో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. నర్సంపేటలోని విజ్డమ్ హైస్కూల్లో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. మాంటిస్సోరి పాఠశాలలో ఎర్ర ఊర్మిళ ఆధ్వర్యంలో, మదర్స్ల్యాండ్ పాఠశాలలోనూ వేడుకలు జరిగాయి. బాలాజీ పాఠశాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమార్తె సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసింది. వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. మండలకేంద్రంలోని భారతి డిగ్రీ కళాశాల, ఉప్పరపల్లి, ఇల్లంద, దమ్మన్నపేట, వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. దుగ్గొండి మండలం తొగర్రాయి, మందపల్లి, పొనకల్, నాచినపల్లి, మైసంపల్లి, చలపర్తి, మహ్మదాపురం, తిమ్మంపేటతోపాటు గిర్నిబావిలోని ఎంజేపీటీ, కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. రాయపర్తిలోని లహరి పబ్లిక్ స్కూల్, శ్రీమహాత్మా మోడల్ పబ్లిక్ స్కూల్, జడ్పీహెచ్ఎస్, కొండూరు ఉన్నత పాఠశాల, కాట్రపల్లిలోని సెయింట్ మేరీ పబ్లిక్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సారథ్యంలో విద్యార్థినులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలు పేర్చి క్రీడా మైదానాల్లో నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ పాఠశాలలో చైర్మన్ విజయా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నర్సంపేట మండలం లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో మినీ బతుకమ్మ వేడుకలను చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ట్రెజరర్ అండృ వనజారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అనంతరం బతుకమ్మలను నీటి తొట్టిలో నిమజ్జనం చేశారు. అలాగే, కమ్మపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలు బతుకమ్మలతో సందడి చేశారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్ పాఠశాలలో కరస్పాండెంట్ మేడవరపు కమలాకర్‌రావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
వరంగల్‌లో బతుకమ్మ సందడి..
వరంగల్ నగరంలోని స్కూళ్లలో బతుకమ్మ సందడి నెలకొంది. రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శోభాదేవి ఆధ్వర్యంలో బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు, బాలికలు ఆడిపాడారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో సంబురాలు అంబరాన్నంటాయి. రంగశాయిపేటలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందన, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ బతుకమ్మ పేర్చి ఆడి పాడారు. శివనగర్‌లోని ఏకశిల డీజీ స్కూల్లో విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో సందడి చేశారు. అలాగే, దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిది రూపాల్లో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. వరంగల్ లక్ష్మీపురంలోని కేతన్ కాన్వెంట్ హైస్కూల్లో కరస్పాండెంట్ విశ్వేశ్వర్రావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, టీచర్లు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. వరంగల్ ఎల్బీనగర్లోని లర్నర్స్ల్యాండ్ పాఠశాల, ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాల, దేశాయిపేటరోడ్డులోని ది మాస్టర్ మైండ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గీసుగొండ మండలం కొమ్మాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కాశీబుగ్గ 20వ డివిజన్ సమీపంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద లక్ష్మీగణపతి కాలనీలోని మహిళలు బతుకమ్మ ఆడారు. పర్వతగిరిలోని విశ్వజెనిత్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబురాలు జరిగాయి.