పోలీసు కావాలంటే కేవలం విద్యార్హత ఉంటేనే సరిపోదు. శారీరక దారుఢ్యం, ఒత్తిడిని తట్టుకునే మానసిక ైస్థెర్యం, కష్టపడేతత్వం ఎంతో అవసరం. అందుకు తగ్గట్టుగా వరంగల్ కమిషనరేట్‌కు కొత్త సైన్యం వచ్చింది. ఒకప్పుడు టెన్త్, ఇంటర్‌తోనే కొలువులు వస్తుండగా, ప్రస్తుతం సర్కారీ ఉద్యోగాలకు పోటీ పెరగడంతో ఉన్నత విద్యావంతులు ఖాకీ డ్రెస్ వేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవలే తొమ్మిది నెలల కఠోరమైన శిక్షణ పూర్తి చేసుకొన్న 578మంది కొత్త కానిస్టేబుళ్లను కమిషనరేట్‌కు అలాట్ చేయగా వారంతా డ్యూటీలో చేరారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. ఈ కొత్తతరం ఖాకీల్లో ఎక్కువగా డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీలు చేసిన 25 ఏళ్ల వయస్సు వారే ఉండడం.. అంతేగాక పురుషుల కంటే తామేం తక్కువ అన్న రీతిలో పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరుగుతుండడం విశేషం.
– సుబేదారి, డిసెంబర్ 11
కేసీఆర్ ప్రభుత్వం 2022లో పెద్ద ఎత్తున పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, 2023లో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. పోలీసు ఉద్యోగాన్ని ఎందరో సవాల్‌గా తీసుకొని శ్రమించి సక్సెస్ అయ్యారు. ఖాకీ కొలువు సాధించారు. ఇందులో అర్హత సాధించిన యువతీయువకులు తొమ్మిది నెలలుగా ఇన్డోర్, అవుట్ డోర్ శిక్షణ తీసుకున్నారు. ఇన్డోర్ ట్రైనింగ్‌లో లా అండ్ ఆర్డర్లో కొత్తగా వచ్చిన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ చట్టాలు, సైబర్‌క్రైం, ఐటీ కోర్, ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ విషయంలో టెక్నాలజీ ట్రైనింగ్ తీసుకున్నారు. అవు ట్ డోర్లో ఫిజికల్ ఫిట్నెస్, రన్నింగ్, పరేడ్, ఫైరింగ్, కూంబింగ్ ఆపరేషన్ ట్రైనింగ్ పొందారు. ఇటీవలే పాసింగ్ అవుట్ శిక్షణ పూర్తి చేసుకొని డ్యూటీలో చేరారు. కొత్తగా పోలీసు కొలువులోకి వచ్చిన యువతల్లో చాలామంది విద్యావంతులతో పాటు 20-25 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు.
578 మంది కొత్త కానిస్టేబుళ్లు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు 578మంది కొత్త పోలీసు కానిస్టేబుళ్లు అలాట్ కాగా, 376మంది సివిల్ కానిస్టేబుళ్లు. ఇందులో పురుషులు 244, మహిళలు 123 మంది ఉన్నారు. ఏఆర్(ఆర్మ్డ్)లో 211 మంది ఉండగా, వీరిలో 168 మంది పురుషులు, 43 మంది మహిళలున్నారు. 376 మంది సివిల్ కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా సెంట్రల్, ఈస్ట్, వెస్ట్‌జోన్‌ల వారీగా పోలీస్స్టేషన్లకు కేటాయించారు. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లలో పురుషులకు బ్లూకోల్ట్స్, బందోబస్తు, వాహనాల తనిఖీలు, నైట్ పెట్రోలింగ్, మహిళా సిబ్బందికి బందోబస్తు, స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు వంటి డ్యూటీ వేస్తున్నారు.
పోలీస్ డ్యూటీతో సమాజం తెలుస్తున్నది
మాది ఖానాపూర్ మండలం కొత్తూరు. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మేము ఇద్దరు ఆడపిల్లలం. నేను 2022లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. బీఈడీ కూడా చేస్తున్నాను. నేను మా అక్క ఇద్దరం దరఖాస్తు చేసి సొంతంగా ప్రిపేరై నం. ఇద్దరికి ఓపెన్ కేటగిరీలో 111 మార్కులు వచ్చాయి. ఇద్దరికి ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో మా పేరెంట్స్ చాలా సంతోషపడ్డారు. మళ్లీ మా అక్కకు ఇటీవలే డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాను. ఇంతకుముందు ఇల్లు, చదువే లోకం. పోలీస్ డ్యూటీతో ఇపుడు సమాజం తెలుస్తున్నది.
– ఎం వినూష, కానిస్టేబుల్
ధైర్యం పెరిగింది
మాది హసన్‌పర్తి మండలం ము చ్చర్ల. మేమిద్దరం ఆడపిల్లలం. నేను ఎంఎస్సీ చదివాను. 2022లో పోలీ సు కమిషనర్ తరుణ్‌జోషి సార్ కల్పించిన ఫ్రీ కోచింగ్ తీసుకున్నాను. పోలీసు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలిచాను. ఎస్సై కావాలని నా కోరిక. పోలీసు ఉద్యోగం చేయడం వల్ల ధైర్యం పెరిగింది. ఒకప్పడు పోలీసు ఉద్యోగంలోకి ఆడపిల్లలు రావాలంటే వెనుకడుగు వేసేది. మార్పు వచ్చింది. అమ్మాయిలు ఎన్నో సవాళ్లను అధిగమించి పోలీసు ఉద్యోగంలోకి వస్తున్నారు.
– దామెర కారుణ్య, కానిస్టేబుల్
మూడో ప్రయత్నంలో సాధించా
మాది వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు దగ్గర. అ మ్మ,నాన్న వ్యవసా య పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనుకున్న. రెండు సార్లు ట్రై చేసినపుడు సక్సెస్ కాకపోవడంతో మానసికంగా చాలా కుంగిపోయాను. మూడో ప్రయత్నంలో బాగా కష్టపడి అనుకున్నది సాధించాను. కానిస్టేబుల్ ఉద్యోగం పొంది మా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నా.
– కే కమల్, కానిస్టేబుల్